
టీఆర్‌ఎస్ సర్కార్‌ను కూల్చేస్తాం
♦ అదే టీ–మాస్ లక్ష్యం
♦ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో భూస్వామ్య పెట్టుబడిదారి ప్రభుత్వాన్ని కూల్చడమే టీమాస్ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం తెలంగాణ సామాజిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్‌గార్డెన్‌లో టీమాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం కోసం టీమాస్ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంబీసీ కుల వర్గీకరణ చేయకుండానే రూ.కోట్ల నిధులు మంజూరు చేసి మరోసారి బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.
విద్య, రాజకీయ రంగాల్లో ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 19శాతం రిజర్వేషన్లు పెంచడంతోపాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచాలన్నారు. దేశంలో 52శాతంగా ఉన్న బీసీలకు కేవలం పార్లమెంట్‌లో 19సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. అన్ని కులాల వారు సంస్కృతి, సంప్రదాయలను సమాన రీతిలో గౌరవించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గాల వాటా ఆధారంగా రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జిల్లాలోని ప్రతి మండలం, గ్రామాల్లో టీమాస్ కమిటీలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో పేదవాడికి కష్టం వస్తే అండగా నిలుస్తుందన్నారు.
ప్రజాశక్తి ముందు ఏశక్తి నిలవదు : గద్దర్
ప్రజాశక్తి ముందు ఏశక్తి నిలవదని ప్రజాయుద్ధనౌక, టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు గద్దర్ అన్నారు. తెలంగాణ విముక్తికి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకునేంతా వరకు ఉద్యమాలు జరిగాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా భువనగిరిలో బెల్లి లలిత ప్రాణత్యాగం చేసిందన్నారు. భువనగిరి రాజకీయ తీర్మానాలకు ప్రసిద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని, దానిని దెబ్బతిన్న ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ఉద్యమానికి భువనగిరి చరిత్ర ఎంతో కీలకమైందన్నారు.
ఈసందర్భంగా రాష్ట్రంలో జరిగిన ఉద్యమ తీరును, ఆత్మబలిదానం, సామాజిక సమానత్వం, టీమాస్ లక్ష్యంపై కళా ప్రదర్శన ద్వారా సభికులను గద్దర్ ఎంతగానో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల నాయకులు చేరుపల్లి సీతారాములు, పల్ల ఆశయ్య, శ్రీరాంనాయక్, ధర్మానాయక్, కూరపాటి రమేష్, సిర్పంగ శివలింగం, బెల్లి కృష్ణ, అబ్దుల్ ఖాదీర్, అజయ్‌కుమార్, సాయిబాబా, ఎండి.జహంగీర్, బట్టు రామచంద్రయ్య, మాటూరి బాలరాజు, చిలుకమారి గణేష్, ధారావత్ గణేష్‌నాయక్, బట్టుపల్లి అనురాధ, జాన్‌వేస్లీ, మేడి పాపయ్య, కందగట్ల స్వామి, దాస్‌రాం నాయక్, ఎండీ.అబ్బాస్, శోభన్‌నాయక్, రావుల రాజు పాల్గొన్నారు.