gafoor
-
ఆ మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేయాలి..
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ ముందుల కొనుగోలు కుంభకోణంపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల స్కాం కి పాల్పడిన టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డొల్ల కంపెనీలు, నకిలీ బిల్లులతో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద సోమవారం సీఐటీయూ ఆందోళన చేపట్టింది. అక్రమార్కులు దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన మాజీ మంత్రులు, చేతులు కలిపిన అధికారులను కూడా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాల చేశారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేసైనా కార్మికులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే గఫుర్ డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కార్మికుల్లో కూడా బీసీలు ఉన్నారన్నారు. కార్మిక శాఖకు బీసీలే మంత్రులుగా ఉంటారని.. అక్రమాలకు పాల్పడితే బీసీ మంత్రులని వదిలేయాలా అని ప్రశ్నించారు. టీడీపీ వాదన వింటుంటే విస్మయం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే గఫుర్ అన్నారు. -
‘కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలి’
సాక్షి, విజయవాడ : సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీఐటీయూ) నాయకులు మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచటం చాలా సంతోషమన్నారు. అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేయి రూపాయలు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం పెంచిన వేతనాలను రాష్ట్ర ఖజనాతో కలపకుండా నేరుగా వేతనాలతో జత చేయాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేయాలని గఫూర్ డిమాండ్ చేశారు. కార్మిక శాఖను డీటీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ధార్మిక సంస్థలకు ఇవ్వటం సరి కాదన్నారు. -
కార్మికులను దోచుకుంటున్నారు
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ గూడూరు : ఆంధ్రాలో టీడీపీ, తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచుకుని పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ముకాస్తున్నాయని సీఐటీయూ ఏపీ జనరల్ సెక్రటరీ ఎంఏ గఫూర్ అన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరులోని శ్రీ కటాలమ్మ దేవాలయ కల్యాణమండపంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం 32వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గఫూర్ మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమంటున్న టీడీపీ ప్రభుత్వం 2015– 16 సంవత్సరాల్లో కార్పొరేట్ వర్గాలకు పన్ను రాయితీ రూ.లక్ష కోట్లకు పైగా ఇవ్వడం జరిగిందన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెక్రటరీ జనరల్ ఎం.కష్ణన్ మాట్లాడుతూ తపాలా శాఖలో ఇప్పటివరకు పోరాటాల్లో పోస్టుమన్, ఎంటీఎస్‌ల పాత్రే కీలకమన్నారు. సమావేశంలో పోస్టుమన్, ఎంటీఎస్ ప్రధాన కార్యదర్శి సీతాలక్ష్మి, పోస్టుమన్ ఎంప్లాయీస్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కె.చంద్రశేఖర్, హుమయున్, ప్రసాద్, విద్యాసాగర్, సంఘం డివిజనల్ కార్యదర్శి సుధాకర్, పురుషోత్తం పాల్గొన్నారు. -
పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు
హిందూపురం టౌన్ : పెట్టుబడిదారులకు, పరిశ్రమల యాజమాన్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొత్తులుగా మారాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ మండిపడ్డారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కార్మిక చట్టాలను ఎంతోమంది ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్నారన్నారు. ఆ చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్ఏ రావ్‌తార్ పరిశ్రమల్లో అన్యాయంగా 183 మంది కార్మికులను తొలగించి 15 నెలలు గడిచినా విధుల్లోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రజలకు, కార్మికులకు మద్దతుగా నిలవాల్సిన ఎమ్మెల్యే బీకె పార్థసారథి పరిశ్రమ యాజమాన్యం ఇచ్చే నోట్ల కట్టలకు దాసోహం అయ్యాడని విమర్శించారు. కార్మికుల సమస్యపై ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రిని కలిసి విన్నవించినా ఫలితం లేదని ఆవేదన చెందారు. దీంతో అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఎస్ఏ రావ్‌తార్ కార్మిక సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి చేపట్టిన పాదయాత్ర 20వ తేదీకి అనంతపురం చేరుకుంటుందన్నారు. 21న కలెక్టరేట్ ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా 22న అన్ని రాజకీయ, ప్రజా సంఘాల, కార్మిక సంఘాలు, విద్యార్థి, రైతు, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జెడ్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.