హిందూపురం టౌన్ : పెట్టుబడిదారులకు, పరిశ్రమల యాజమాన్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొత్తులుగా మారాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ మండిపడ్డారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కార్మిక చట్టాలను ఎంతోమంది ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్నారన్నారు. ఆ చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్‌ఏ రావ్‌తార్ పరిశ్రమల్లో అన్యాయంగా 183 మంది కార్మికులను తొలగించి 15 నెలలు గడిచినా విధుల్లోకి తీసుకోకపోవడం దారుణమన్నారు.
ప్రజలకు, కార్మికులకు మద్దతుగా నిలవాల్సిన ఎమ్మెల్యే బీకె పార్థసారథి పరిశ్రమ యాజమాన్యం ఇచ్చే నోట్ల కట్టలకు దాసోహం అయ్యాడని విమర్శించారు. కార్మికుల సమస్యపై ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రిని కలిసి విన్నవించినా ఫలితం లేదని ఆవేదన చెందారు. దీంతో అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఎస్‌ఏ రావ్‌తార్ కార్మిక సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి చేపట్టిన పాదయాత్ర 20వ తేదీకి అనంతపురం చేరుకుంటుందన్నారు. 21న కలెక్టరేట్ ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా 22న అన్ని రాజకీయ, ప్రజా సంఘాల, కార్మిక సంఘాలు, విద్యార్థి, రైతు, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జెడ్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు
Published Wed, Sep 14 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
Advertisement