ఎస్పీ వ్యాఖ్యలతో నెల్లూరులో ఉద్రిక్తత
♦ ఓ వర్గం ఆగ్రహం.. ఎస్పీ వాహనంపై దాడి
♦ గాలిలోకి కాల్పులు జరిపిన గన్‌మన్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు ఎస్పీ గజరావుసింగ్ భూపాల్ వ్యాఖ్యలపై ఓ వర్గానికి చెందినవారి ఆందోళన పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో నెల్లూరు ఎస్పీ శుక్రవారం ఓ వర్గానికి చెందిన వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాటలు తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని భావించిన ఆ వర్గానికి చెందిన యువకులు శనివారం పెద్దలతో సమాలోచనలు జరిపారు.
ఎస్పీ వ్యాఖ్యలకు నిరసన తెలపాలని సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో మున్వర్ అనే నేతను పోలీసులు నెల్లూరు ఒకటో నగర పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వందలాది మంది యువకులు స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఎస్పీ భూపాల్ స్టేషన్ వద్దకు బయలుదేరారు. ఆయన స్టేషన్‌కు కొంతదూరంలో ఉండగానే పెద్దసంఖ్యలో యువకులు ఎదురెళ్లి దాడికి యత్నించారు. వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.
వెంటనే ఎస్పీ గన్‌మన్ వాహనంలో నుంచి దిగి ఫైరింగ్ ఓపెన్ చేశారు. గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఎస్పీ అక్కడి నుంచి వెనుదిరిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. స్టేషన్ వద్దకు చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులపైనా కొందరు యువకులకు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అయినప్పటికీ సుమారు ఐదారు వందల మంది యువకులు స్టేషన్ ఆవరణలోనే నిరసన కొనసాగించారు. స్టేషన్‌పైకి చెప్పులు, రాళ్లు విసిరారు.