Gajapati district
-
కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు..
-
కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు..
భువనేశ్వర్: ఒడిశాలోని గజపతి జిల్లా లక్ష్మీపుర్ గ్రామంలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. టిట్లీ తుపాన్ కారణంగా మరణించిన కూతురి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించే క్రమంలో ఓ తండ్రి ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీపుర్ గ్రామానికి చెందిన ముకుంద్ 7 ఏళ్ల కూతురు బబిత అక్టోబర్ 11 వ తేదీన తిత్లీ తుపాన్ కారణంగా సంభవించిన వరదల్లో తప్పిపోయింది. కాగా, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బుధవారం మహేంద్ర గిరి వద్ద కొండచరియల కింద బబిత మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గురువారం ముకుంద్‌కు చేరవేశారు. అలాగే కూతురి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తేనే.. ప్రభుత్వం నుంచి అందించే పరిహారం అందుతుందని అతనికి తెలిపారు. అలాగే బబిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా.. మృతదేహాన్ని కైన్పూర్ ఆస్పత్రికి తీసుకురావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. కూతురి మృతదేహాన్ని వాహనంలో ఆస్పత్రికి తరలించడానికి డబ్బులు లేని ముకుంద్.. మృతదేహాన్ని ఓ సంచిలో ఉంచి దానిని భుజం వేసుకుని నడుచుకుంటూ వెళ్లాడు. దారి పోడువున చాలా మంది అతన్ని చూస్తూ ఉన్నప్పటికీ.. ఎవరు అతనికి సహాయపడలేదు. ఇలా అతను 8 కి.మీలు ప్రయాణించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి ఆటో ఏర్పాటు చేసి కైన్పూర్ ఆస్పత్రికి వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీనిపై ముకుంద్ మాట్లాడుతూ.. తన కూతురి మృతదేహాన్ని వాహనంలో తరలించడానికి డబ్బులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తుపాన్ కారణంగా గ్రామానికి వచ్చే దారి దెబ్బతినడంతో.. తానే భుజంపై మోసుకుంటూ వచ్చానని అన్నారు. బబిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడానికి సరైన ఏర్పాట్లు చేయని ప్రభుత్వ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ విషయం తెలుసుకున్న గజపతి జిల్లా కలెక్టర్ అనుపమ్ షా మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తుపాన్ కారణంగా కూతురిని కొల్పోయిన ముకుంద్‌కు గురువారం సాయంత్రం 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు. -
టిట్లీ భీభత్సం.. 12మంది మృతి
సాక్షి, భువనేశ్వర్ : టిట్లీ తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 12మంది మృతిచెందగా నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. ఈ సంఘటన ఒడిసాలోని గజపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గురువారం గజపతి జిల్లాలోని బరఘారా గ్రామానికి చెందిన గిరిజనుల పాకలు టిట్లీ తుఫాను కారణంగా నేలమట్టమయ్యాయి. దీంతో తుఫాను బారినుంచి ప్రాణాలు రక్షించుకోవటానికి 22మంది గిరిజనులు దగ్గరలో ఉన్న కొండగుహలో తలదాచుకున్నారు. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగి గుహలో ఉన్న 16మంది గిరిజనులపై పడ్డాయి. దీంతో 12మంది అక్కడిక్కడే మృతిచెందగా మరో నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. రాయగడా బ్లాక్ ఛైర్మన్ ధలేశ్వర్ భుయన్ మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడి మరణించిన 12మంది మృతదేహాలను గుర్తించామన్నారు. మరో నలుగురి ఆచూకీ లభించలేదని తెలిపారు. గ్రామం మారుమూలన ఉండటం వల్లే ఈ విషాదం ఆలస్యంగా వెలుగుచూసిందని పేర్కొన్నారు. -
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు..
కుటుంబ సభ్యుల నిరాకరణే కారణం గజపతి జిల్లా : ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. దూరంగా వెళ్లిపోయి జీవిస్తున్నారు.. కొన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చినా కుటుంబ సభ్యుల ఆదరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుమ్మ సమితి ఉక్కుర పంచాయితీ అనుకంప గ్రామంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఉక్కుర పంచాయతీ అనుకంప గ్రామానికి చెందిన బిజి బిరువా (26), రాయగడ గ్రామానికి చెందిన సాయిబానీ గొమాంగో (24) కొన్నేళ్ల కిందట ప్రేమించుకున్నారు. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వీరు పెళ్లి చేసుకుని ముంబాయి వెళ్లిపోయారు. పదేళ్ల తర్వాత రెండు రోజుల కిందట వారు బిజిబిరువా స్వగ్రామమైన అనుకంప గ్రామానికి వచ్చారు. అతని కుటుంబ సభ్యులు, బంధువులు వారిని ఆదరించలేదు. కులాంతర వివాహం, ఇతర పట్టింపులతో వారిద్దరూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులోని చింతచెట్టుకు ఉరివేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సెరంగో ఐఐసీ చంద్రమణి సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.