కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు.. | Odisha man walks 8 km with body of daughter | Sakshi
Sakshi News home page

కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు..

Published Fri, Oct 19 2018 9:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఒడిశాలోని గజపతి జిల్లా లక్ష్మీపుర్‌ గ్రామంలో గురువారం హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. తిత్లీ తుపాన్‌ కారణంగా మరణించిన కూతురి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం ఆస్పత్రికి తరలించే క్రమంలో ఓ తండ్రి ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీపుర్‌ గ్రామానికి చెందిన ముకుంద్‌ 7 ఏళ్ల కూతురు బబిత అక్టోబర్‌ 11 వ తేదీన తిత్లీ తుపాన్‌ కారణంగా సంభవించిన వరదల్లో తప్పిపోయింది. కాగా, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బుధవారం మహేంద్ర గిరి వద్ద కొండచరియల కింద బబిత మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గురువారం ముకుంద్‌కు చేరవేశారు. అలాగే కూతురి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహిస్తేనే.. ప్రభుత్వం నుంచి అందించే పరిహారం అందుతుందని అతనికి తెలిపారు. అలాగే బబిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా.. మృతదేహాన్ని కైన్పూర్‌ ఆస్పత్రికి తీసుకురావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. కూతురి మృతదేహాన్ని వాహనంలో ఆస్పత్రికి తరలించడానికి డబ్బులు లేని ముకుంద్‌.. మృతదేహాన్ని ఓ సంచిలో ఉంచి దానిని భుజం వేసుకుని నడుచుకుంటూ వెళ్లాడు. దారి పోడువున చాలా మంది అతన్ని చూస్తూ ఉన్నప్పటికీ.. ఎవరు అతనికి సహాయపడలేదు. ఇలా అతను 8 కి.మీలు ప్రయాణించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి ఆటో ఏర్పాటు చేసి కైన్పూర్‌ ఆస్పత్రికి వెళ్లేలా ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement