Galaxies
-
అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ..
అంతరిక్షంలో నక్షత్రాలన్నీ సమూహాలు (గెలాక్సీలు)గా.. అక్కడో గుంపు, ఇక్కడో గుంపు అన్నట్టుగా ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలకు ఒకచోట మాత్రం ఏదో గీత గీసినట్టుగా నక్షత్రాల వరుస కనిపించింది. అదేదో పదులు, వందల్లో కాదు.. లక్షల నక్షత్రాలు అలా లైన్ కట్టాయి. అదేమిటా అని చూస్తే నోరెళ్లబెట్టేసంగతి బయటపడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ నక్షత్రాల లైన్ ఏమిటని చూసి.. సాధారణంగా ప్రతి నక్షత్ర సమూహం (గెలాక్సీ) మధ్యలో పెద్ద బ్లాక్‌హోల్ ఉంటుంది. దాని చుట్టూరానే నక్షత్రాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. నక్షత్రాలు కూడా గుంపుగా ఉంటాయి. కానీ ఇటీవల హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాల్లో.. నక్షత్రాలు ఒక గీతలా వరుసగా ఉండటం, అదీ ఓ చిన్న గెలాక్సీ దగ్గర మొదలై కోట్ల కిలోమీటర్ల పొడవునా కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. చిత్రాల్లో అదేదో ‘పొరపాటు (ఎర్రర్)’ కావొచ్చని తొలుత భావించారు. కానీ యేల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ వాన్ డొక్కుమ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసి.. ఆ నక్షత్రాల వరుస ముందు ఓ ప్రకాశవంతమైన వస్తువును గుర్తించింది. క్షుణ్నంగా పరిశీలించి అది కృష్ణబిలం అని తేల్చింది. గెలాక్సీ నుంచి తప్పించుకుని.. ఓ పెద్ద కృష్ణబిలం తన గెలాక్సీ నుంచి తప్పించుకుని, అమిత వేగంతో ప్రయాణిస్తూ.. దారిలో ఈ నక్షత్రాల పుట్టుకకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు, మూడు గెలాక్సీలు ఢీకొన్న క్రమంలో.. ఒక గెలాక్సీ నుంచి విసిరేసినట్టుగా ఈ కృష్ణబిలం బయటికి వచ్చి ఉంటుందని అంచనా వేశారు. దాని పరిమాణం మన సూర్యుడి కంటే రెండు కోట్ల రెట్లు పెద్దగా ఉందని.. అది గంటకు సుమారు 58 లక్షల కిలోమీటర్ల అమిత వేగంతో ప్రయాణిస్తోందని గుర్తించారు. నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి? విశ్వం ఏర్పడే క్రమంలో గెలాక్సీలతోపాటు వాటి మధ్యలో అక్కడక్కడా విడిగా వాయువులు, ఇతర ఖగోళ పదార్థాలు ఉండిపోయాయని శాస్త్రవేత్త పీటర్ వాన్ చెప్పారు. ఈ కృష్ణబిలం ప్రయాణిస్తున్న క్రమంలో దాని ఆకర్షణ శక్తి వల్ల వాయువులు, ఖగోళ పదార్థాలు ఒక్కచోటికి చేరుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కృష్ణబిలం వెనుక ఏర్పడే అతిశీతల పరిస్థితితో.. అవి సంకోచించి నక్షత్రాలు జన్మిస్తున్నాయని వివరించారు. విశ్వంలో ఇలాంటి దానిని గుర్తించడం ఇదే మొదటిసారని తెలిపారు. దీని గుట్టు తేల్చేందుకు త్వరలో ప్రఖ్యాత జేమ్స్‌వెబ్ టెలిస్కోప్‌తో పరిశీలించనున్నామని వెల్లడించారు. ఏమిటీ కృష్ణ బిలం? అతిపెద్ద నక్షత్రాలు వేలకోట్ల ఏళ్లపాటు మండిపోయి, ఇంధనం ఖాళీ అయ్యాక.. వాటిలోని పదార్థమంతా కుచించుకుపోయి ‘కృష్ణబిలం’గా మారుతాయి. వీటి గురుత్వాకర్షణ శక్తి చాలా తీవ్రంగా ఉండి.. సమీపంలోకి వచ్చే అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి. కాంతి కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోవడంతో.. నేరుగా కనబడవు. అందుకే కృష్ణబిలం (బ్లాక్‌హోల్స్) అని పిలుస్తారు. -
NASA: తారల తాండవం!
న్యూయార్క్: ఫొటోలో చక్రంలా తిరుగుతూ కనువిందు చేస్తున్నది ఓ అందమైన తారా మండలం. దాని చుట్టూ ఆనంద తాండవం చేస్తున్నట్టు కన్పిస్తున్నవి భారీ నక్షత్రాలు! లెడా 2046648గా పిలుస్తున్న ఈ నక్షత్ర మండలం భూమికి ఏకంగా వంద కోట్ల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో హెర్క్యులస్ నక్షత్రరాశిలో ఉందట! దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవలే తన అత్యాధునిక నియర్–ఇన్ఫ్రా రెడ్ కెమెరా (ఎన్ఐఆర్ కామ్) సాయంతో బంధించింది. మరుగుజ్జు తారగా మారిన డబ్ల్యూడీ1657ను పరిశీలిస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా ఈ గెలాక్సీ కంటబడిందని నాసా పేర్కొంది. ‘‘విశ్వావిర్భావపు తొలినాళ్లకు చెందిన సుదూర గెలాక్సీలను కనిపెట్టడం, పరిశోధించడమే ప్రధాన లక్ష్యంగా జేమ్స్ వెబ్‌ను తయారు చేయడం తెలిసిందే. ఆయా గెలాక్సీల రసాయనిక కూర్పు తదితరాలను కూడా విశ్లేషించగల సామర్థ్యం దాని సొంతం. తద్వారా వాటి ఆవిర్భావానికి కారణమైన భారీ మూలకాలు ఎలా పుట్టుకొచ్చిందీ తెలిసే ఆస్కారముంటుంది’’ అని ఒక ప్రకటనలో వివరించింది. -
అంతరిక్షం రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా?
భూమ్మీద ఏ చోటకు వెళ్లినా అక్కడి వాతావరణం ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పరిసరాల్లో ఉండే పరిస్థితులను బట్టి ధ్వనులు వినిపిస్తుంటాయి. మట్టి నుంచి మొక్కలు, జంతువుల దాకా ఎక్కడికక్కడ వాసన, రుచి అనుభూతులు ఉంటాయి. మరి అంతరిక్షంలో ఎలాంటి ధ్వనులు వినిపిస్తాయి? అక్కడి రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా? దీనిపై పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చిన వివరాలు ఇవీ.. గెలాక్సీల మధ్య ధ్వని ప్రయాణం సాధారణంగా వాతావరణం లేనిచోట ధ్వని ప్రయాణించదు అనేది భౌతికశాస్త్ర సూత్రం. విశ్వంలో చాలా భాగం శూన్యమే కాబట్టి ధ్వని ప్రసారం ఉండదనే భావన ఉంది. ఇది కొంతవరకు నిజమే. అయితే వేలకొద్దీ నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు) ఉండే గెలాక్సీ క్లస్టర్లు భారీ ఎత్తున గ్యాస్‌తో నిండి ఉంటాయి. వాటిలో ధ్వని ప్రయాణిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతరిక్ష ధ్వనులను విడుదల చేసిన నాసా.. 2003లో పెర్సెయస్ గెలాక్సీ క్లస్టర్ మధ్య ఉన్న ఒక కృష్ణ బిలం (బ్లాక్ హోల్) నుంచి వచ్చిన ధ్వనిని చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ఆ ధ్వని ఫ్రీక్వెన్సీని నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కొన్నికోట్ల రెట్లు పెంచారు. మనకు వినపడే స్థాయికి తీసుకొచ్చి విడుదల చేశారు. గ్రహాల ‘పాటలు’ ఇవి నాసా ప్రయోగించిన రోవర్లు, ఉపగ్రహాల సాయంతో పలు గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల ధ్వనులనూ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అంగారకుడు, శుక్రుడు, జూపిటర్, శనిగ్రహాలతోపాటు పలు తోకచుక్కల ధ్వనులను నమోదు చేశారు. పర్సవరెన్స్రోవర్ మార్స్పైచేసిన ప్రయోగాలతో.. అక్కడి పలుచని వాతావరణం కారణంగా ధ్వనిఅతి మెల్లగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. విజిల్స్, గంటలు, పక్షుల కూతలు వంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ధ్వనులు దాదాపుగా వినిపించవని తేల్చారు. ఏదో కాలిపోతున్నట్టు వాసనతో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్ వాక్ చేస్తుంటారు. అలా స్పేస్ వాక్ చేసి, తిరిగి ఐఎస్ఎస్లోకి వెళ్లిన తర్వాత.. తమకు ‘ఏదో కాల్చిన మాంసం’.. ‘బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్ చేసినప్పుడు వెలువడే పొగ’ వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల (హైఎనర్జీ వైబ్రేషన్స్)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్‌ఎస్‌లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్‌లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు. ‘టచ్’లో మార్పు లేదట! అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు. రకరకాల రుచుల్లో నక్షత్రాలు సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది. అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్ ఫార్మేట్ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన ‘రాస్ప్బెర్రీ’ పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు. కళ్లు ‘ఫ్లాట్’ అవుతాయట! అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపే వ్యోమగాముల్లో ‘స్పేస్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ (సాన్స్)’ సమస్య వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం వల్ల కళ్లలోని ఆప్టిక్ డిస్క్‌లో మార్పులు వచ్చి.. కళ్లు గుండ్రని ఆకారాన్ని కోల్పోతూ, దృష్టి సామర్థ్యం తగ్గుతోందని తేల్చారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ ఇదీ చదవండి: భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును! -
పాలపుంత ఏర్పాటే భిన్నం!
లండన్: విశ్వంలోని నక్షత్ర సమూహా (గెలాక్సీలు)ల్లో ప్రకాశవంతంగా ఉండే మన పాలపుంత (మిల్కీవే).. మిగతావాటికి భిన్నంగా లోపలివైపు నుంచే మెల్లమెల్లగా ఏర్పడిందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జియా-ఈఎస్‌వో ప్రాజెక్టు నుంచి సేకరించిన సమాచారం సహాయంతో.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంతరిక్ష విభాగం శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ జరిగిన తర్వాత ఏర్పడిన తొలి నక్షత్రాల్లో ఎక్కువ శాతం హైడ్రోజన్, హీలియం మూలకాలు మాత్రమే ఉన్నాయని.. ఆ తర్వాతి కాలపు నక్షత్రాల్లో మెగ్నీషియం వంటి లోహ మూలకాలు ఉంటాయని పరిశోధనకు నేతృత్వం వహించిన మరియా బెర్జ్ మన్ చెప్పారు. ప్రస్తుతం పాలపుంతలోని నక్షత్రాల రసాయన సమ్మేళనాలను పరిశీలించగా... మన సూర్యుడి కక్ష్యా ప్రాంతమైన మధ్య భాగంలో ఉన్నవాటిలో లోహమూలకాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని, అంచులకు వెళ్లినకొద్దీ లోహ మూలకాల పరిమాణం పెరిగినట్లుగా గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం.. పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాలు ముందుగా ఏర్పడ్డాయని, అనంతరం అంచులవైపు నక్షత్రాలు ఏర్పడుతూ పాలపుంత విస్తరించిందని తెలిపారు. అంతేగాకుండా.. పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాలు ఏర్పడడానికి తక్కువకాలం పడుతోందని, అదే అంచులవైపు నక్షత్రాలు ఏర్పడడానికి సుదీర్ఘ కాలం పడుతోందని పేర్కొన్నారు.