game show
-
అభిమానులు నన్ను క్షమించాలి : మంచు మనోజ్
‘‘ఇండస్ట్రీలో నాకు ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. ఇందుకు నా అభిమానులు క్షమించాలి. నిజ జీవితంలో ఏడడుగులేసి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇంతకుముందు ప్యాషన్, గోల్‌తో సినిమాలు చేశాను. ఇప్పుడు ప్యాషన్‌తో పాటు బాధ్యతతో మళ్లీ వచ్చాను’’ అని హీరో మంచు మనోజ్ అన్నారు. ఆయన హోస్ట్‌గా ‘ఉస్తాద్–ర్యాంప్ ఆడిద్దాం’ పేరిట సరికొత్త టాక్ షో వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్ షో ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సంద్భంగా నిర్వహించిన ‘ఉస్తాద్–ర్యాంప్ ఆడిద్దాం’ ప్రోమో రిలీజ్ వేడుకలో మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక సెలబ్రిటీ గేమ్ షో. ఎంతగానో అభిమానించే ఫ్యాన్ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం. ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు, ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఫ్యాన్స్‌ని గెలిపించే షో ఇది. చాలా పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. డైరెక్టర్ వంశీ, రచయిత బీవీఎస్ రవి, సాయి కృష్ణ, నితిన్ చక్రవర్తి, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. -
KBC 14: కోటి గెలుచుకున్న కవిత.. కానీ, రూ. 7.5 కోట్ల ప్రశ్నకు మాత్రం!
కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియల్టీ గేమ్ షో దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పోందిన షోగా పేరొందింది. ఇదే షో తెలుగులో మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా హిందీ వెర్షన్ కేబీసీ సీజన్ 14 నడుస్తోంది. ఇందులో బిగ్ బి తన చురుకైన మాటలతో షోకే హైలైట్‌గా నిలుస్తూ ప్రేక్షకులకు ఫుల్‌గా వినోదాన్ని అందిస్తున్నాడు. ఈ సీజన్లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన గృహిణి కవితా చావ్లా మొదటి కోటి రూపాయలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చివరికి రూ.7.5 కోట్లు ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఆత్మవిశ్వాసంతో ఈ గేమ్ ఆడిన కవిత ప్రేక్షకులతో పాటు హోస్ట్ అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకుంది. ఏంటి ఆ ప్రశ్న.. అప్పటికే కోటి గెలిచిన ఉత్సాహంతో కవిత ఈ గేమ్‌లో ముందుకు అడుగువేశారు. ఇక ఈ రౌండ్ లో17వ ప్రశ్నగా రానే వచ్చింది. ఆ ప్రశ్న విలువ రూ.7.5 కోట్లు, దీంతో నరాలు తెగేంత ఉత్కంఠ ఎదురైంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి మ్యచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు గుండప్ప విశ్వనాథ్. అయితే ఆయన ఈ ఘనతను ఏ జట్టుపై సాధించాడు? ఆఫ్షన్లు ఇవే.. a) సర్వీసెస్ b) ఆంధ్రా c) మహారాష్ట్ర d) సౌరాష్ట్ర. మొదట ఈ ప్రశ్నకు కవితా చాలా సేపు సమాధానం కోసం ఆలోచించింది. కానీ జవాబుపై స్పష్టత లేకపోవడంతో పాటు ఆమె దగ్గర ఎటువంటి లైఫ్ లైన్స్ కూడా లేవు. దాంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తన సమాధానంగా A ఎంపికను లాక్ చేశారు. అయితే, సరైన సమాధానం ఎంపిక B అని తేలింది. దీంతో తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా కవిత కేబీసీ షోలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. కానీ ఆ రౌండ్ దాటి రాలేకపోయింది. ప్రస్తుతం పట్టుదలతో షోలో పాల్గొనడంతో పాటు కోటి గెలిచి సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారింది. చదవండి: Samantha: స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్ ఏం చెప్పారంటే.. -
కోటీశ్వరి కౌసల్య
కౌసల్య ‘ప్రత్యేక ప్రతిభావంతురాలు’! ఇప్పుడు కోటీశ్వరి. ప్రపంచంలోనే ఒక గేమ్ షోలో కోటి గెలిచిన తొలి ‘స్పెషల్లీ చాలెంజ్డ్’ మహిళా కంటెస్టెంట్! ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని చాటిన కౌసల్యా కార్తిక.. మాట్లాడలేరు. వినలేరు. అందుకే ఆమెలా ఆమె సాధించిన విజయం కూడా ప్రత్యేకమైనది. కౌసల్య (31) పుట్టింది, పెరిగింది అంతా తమిళనాడులోని మదురైలో. బియస్సీ టెక్నాలజీ, ఎం.ఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశారు. ఎంబిఏ కూడా. ఇన్నీ చదివిన కౌసల్య పుట్టు మూగ, చెవుడు. కౌసల్యకు భర్త, ఏడాది పిల్లాడు ఉన్నారు. కౌసల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో జూనియర్ అసిస్టెంట్. చిన్న వయస్సు నుండే తెలివైన పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. ప్లస్ టూ వరకు నాగర్ కోయిల్ లోని బదిరుల పాఠశాలలో చదివింది. ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్ ర్యాంకే. బిఎస్సీ, ఎం.ఎస్సీ, ఎంబిఏలో కూడా గోల్డ్ మెడలిస్ట్. కౌసల్యకు రెండు కలలు ఉండేవి. మొదటిది తాను చదివిన బదిరుల పాఠశాలకు సాయం చేయాలి. రెండోది ఇటలీ లేదా స్విట్జర్లాండ్ పర్యటన చేయాలి. ఈ రెండు కలలతో పాటు.. ఆత్మ విశ్వాసం ఇప్పుడు ఆమెను ‘కోటీశ్వరి’ని చేసింది. కలర్స్ చానెల్ వాళ్లు తమిళంలో మహిళల కోసం ప్రత్యేకంగా గత ఏడాది డిసెంబరు 23న ‘కోటీశ్వరి’ అనే గేమ్ షో ప్రారంభించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆ షో ప్రసారం అవుతోంది. సీనియర్ నటి రాధిక అనుసంధానకర్తగా వ్యవరిస్తున్నారు. ఈ ‘షో’లోనే కౌసల్య కోటి రూపాయలు సాధించారు. రాధిక అడిగిన ప్రశ్నలను లిప్ రీడింగ్ ద్వారా అర్థం చేసుకుని సమాధానాలను అందించిన కౌసల్య.. సుదీర్ఘంగా జరిగిన గేమ్‌లో కోటి రూపాయల బహుమతి సాధించారు. షో మొదటి సీజన్లోనే కోటిరూపాయల ప్రైజ్ మనీ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ప్రత్యేక ప్రతిభావంతురాలి’గా కౌసల్య నిలిచారు. కోటిరూపాయల ఫైనల్ ఎపిసోడ్ జనవరి 21 రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ్ చానెల్లో ప్రసారం అయింది. ‘‘ఈ షో ద్వారా నా రెండు కలలు నిజం కాబోతున్నాయి’’ అంటూ కౌసల్య ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఒక ప్రత్యేక ప్రతిభావంతురాలు కౌసల్యను ప్రపంచం చూడటం ఇదే మొదటిసారి అని రాధిక అభినందనల వర్షం కురిపించారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై -
గేమ్ షోలో పరువు పాయె!
గేమ్ షోలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పరువు పోగోట్టుకున్న యువతి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. టర్కీష్ టీవీ షో హూ వాంట్స్ టూ బీ ఏ మిలీనియర్(కౌన్ బనేగా కరోడ్‌పతి షో తరహా)లో పాల్గొన్న సు ఐహాన్(26) ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుంది? అన్న ప్రశ్న కోసం చాలా కష్టపడింది. హోస్ట్ ఇచ్చిన సమాధానాల్లో చైనా, ఇండియా, దక్షిణ కొరియా, జపాన్‌లు ఉన్నాయి. అయితే తనకు ఆన్సర్ తెలుసన్న ఐహాన్, కన్ఫర్మేషన్ కోసం ఆడియన్స్ పోల్‌ను ఆశ్రయించింది. ఆడియన్స్‌లో 51 శాతం మంది చైనా అని ఆన్సర్ చెప్పగా.. నాలిగింట ఒక వంతు ‘ఇండియా’ అని సమాధానం ఇవ్వటం కొసమెరుపు. అయితే ఆడియన్స్ తీర్పుపై అనుమానంతో ‘ఫోన్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్’ను కూడా ఆ యువతి ఆశ్రయించింది. చివరకు ఫ్రెండ్ ద్వారా సమాధానం ‘చైనా’ అని ధృవీకరించుకుని అప్పుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాతి ప్రశ్నకే ఐహాన్ గేమ్ నుంచి అవుటయ్యింది. ఓ పాపులర్ పాటకు కంపోజర్ ఎవరన్న ప్రశ్నకు తడబడి తప్పు సమాధానంతో షో నుంచి నిష్క్రమించింది. అక్కడి నుంచే అసలు వ్యవహారం మొదలైంది. ఎక్‌నామిక్స్‌లో గ్రాడ్యూయేట్ అయిన ఆ యువతిని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేసి పడేస్తున్నారు. ‘నీ ప్రశ్నలో సమాధానం ఉన్నా నీకు ఆన్సర్ తెలీకపోవటం సిగ్గు చేటని కొందరు. నీ చదువు మొత్తం వృథా అని ఇంకొందరు. నువ్వు డ్రాప్ అయి ఉంటే నీ ప్లేస్‌లో ఇంకొకరు వెళ్లేవారంటూ... ఇలా ఆ యువతిని ఏకీ పడేస్తున్నారు. అయితే ఆ యువతి మాత్రం విమర్శలను పట్టించుకోకుండా.. దక్కిన సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తానంటోంది ఐహాన్. -
కోటీశ్వరుడి విజయ విహారం
‘‘మీ అభిమాన హీరో ఎవరు?’’.... అని నాగార్జున అడగ్గానే... ‘ఇంకెవరూ మీరే..’ అని టకీమని చెప్పారు విద్యాబాలన్. నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోలో విద్యాబాలన్ అతిథిగా పాల్గొన్న విషయం ఈ షో వీక్షించినవారికి తెలిసే ఉంటుంది. తనదైన శైలిలో నాగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరుకి ప్రశంసలు లభిస్తున్నాయి. అడపా దడపా సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనడం అదనపు ఆకర్షణ అవుతోంది. గత నెల 9న ప్రారంభమైన ఈ షో తెలుగు చానల్స్ అన్నిటిలోనూ అత్యధిక రేటింగ్ సాధించి, నంబర్ వన్ షోగా నిలిచిందని ‘మా’ టీవీ ప్రతినిధి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ను కూడా కలుపుకుని 1.22 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని పేర్కొన్నారు. గత వారం తెలుగు బుల్లి తెరపై ఐదు టాప్ ప్రోగ్రామ్స్‌లో మొదటి నాలుగు స్థానాల్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఉందని తెలిపారు. -
ఇన్ని సమస్యలుంటాయా అనిపిస్తోంది : నాగార్జున
స్టార్ హోదా నుంచి టీవీ షోలలో స్టార్ లాంటి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు హోస్ట్‌గా కొత్త వేషంలోకి హీరో నాగార్జున సులభంగానే పరకాయ ప్రవేశం చేశారు. ఈ నెల ప్రథమార్ధం నుంచి ‘మా’ టి.వి.లో ప్రసారమవుతున్న ఈ గేమ్ షో తొలివారంలో మంచి టి.ఆర్.పి.లు సాధించింది. సామాన్యులు సైతం సంపన్నులయ్యేందుకు అవకాశమిచ్చే ఈ షో గురించి నాగ్ తో జరిపిన సంభాషణ. బుల్లితెరపై మీ తొలి షో ఇది. ఎలా ఉంది మీ అనుభవం? సినిమా ప్రపంచానికి పూర్తి భిన్నమైన వాతావరణాన్ని ఈ షో నాకు పరిచయం చేసింది. నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఈ షో ఉపకరించింది. స్టార్‌డమ్‌కి అతీతమైనది ఇది. ‘అన్నమయ్య’, ‘మనం’ చిత్రాల ఘనవిజయం ఎంత ఆత్మసంతృప్తినిచ్చిందో, ఈ ‘షో’ విజయం కూడా అంతే ఆత్మసంతృప్తినిచ్చింది. ఈ షో ద్వారా సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎలా ఉంది? వాళ్ల సొంత మనిషిలా మారిపోయి, సమస్యలను వింటున్నాను. వాళ్ల సమస్యలను నా సమస్యలతో పోల్చుకుంటున్నాను కూడా. ఒక సినిమా పరాజయం పాలైతే తెగ బాధపడిపోతుంటాం. కొంతమందైతే నెలల తరబడి బయటకు రారు. రేపెలా గడుస్తుందోనని ఈ రోజు రాత్రి కంటి మీద కునుకు లేకుండా గడిపేవారి సమస్యల ముందు సినిమా ఫ్లాప్ అనేది చిన్న సమస్య అనిపిస్తోంది. పోటీలో పాలుపంచుకునేవారి సమస్యలు విన్న తర్వాత ‘వీళ్లు అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబితే బాగుంటుంది’ అనిపిస్తోందా? కొంతమంది జీవితం మొత్తం సమస్యలే. వాళ్లు ఎక్కువ డబ్బు గెల్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లిష్టమైన ప్రశ్నలు అడిగినప్పుడు, ‘సమాధానం తెలిస్తే బాగుంటుంది’ అనే టెన్షన్ నాకు మొదలవుతుంది. ఇన్నేళ్లూ కష్టాలు పడ్డారు కదా.. కనీసం ఇక్కడైనా వాళ్ల కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగని, ప్రశ్నలు ముందే లీక్ చేయలేను.. సమాధానాలు కూడా బయటపెట్టలేను. ఒక్కోసారైతే నాకు తెలియకుండా క్లూ ఇచ్చేస్తానేమో అనిపిస్తోంది. కానీ, అది చేయకుండా జాగ్రత్తపడతాను. రకరకాల వయసుల వాళ్ళను కలుసుకోవడం, వారి కష్టనష్టాలు వినడం వల్ల అందరి మనస్తత్వాలూ తెలుసుకునే వీలు కలుగుతోంది. సుబ్బలక్ష్మి గారనే పెద్ద వయసు ఆవిడైతే చాలా బాగా ఆడారు. చక్కగా జోక్‌లేసుకుంటూ సరదాగా సాగిందా ఎపిసోడ్. అందరితోనూ కనెక్ట్ కాగలుతున్నాను. ఈ షోలో పాల్గొన్న హెచ్ఐవీ పేషెంట్ భవాని జీవితం విన్నప్పుడు మీరు ఫీలైన వైనం స్పష్టంగా బుల్లితెర మీద కనిపించింది? భవానీ లైఫ్ విన్నప్పుడు నిజంగానే బాధ అనిపించింది. కానీ, తన ధైర్యం, ఆత్మవిశ్వాసం మాత్రం మెచ్చుకోదగ్గవి. తను 80వేల రూపాయలు గెల్చుకోవాలనే లక్ష్యంతో వచ్చింది. 40వేలు గెల్చుకుంది. కానీ, ఇక్కణ్ణుంచి ఊరు తిరిగి వెళ్లేసరికి తన ఇంటి చుట్టుపక్కలవాళ్లు, ఇంతకొంతమంది స్వచ్ఛందంగా ‘మీ అబ్బాయిలకు ఫీజు కట్టు’ అని డబ్బులిచ్చారట. ఆ డబ్బంతా కలిపితే 20వేలయ్యాయని, భవాని ఫోన్ చేసి చెబితే, చాలా ఆనందం అనిపించింది. ఈ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత మనలో తెలియకుండా మార్పొస్తుందని అమితాబ్ మీతో అన్నారు కదా.. మరి, ఇప్పటివరకు చిత్రీకరించిన ఎపిసోడ్స్ ద్వారా మీలో ఏమైనా మార్పును గ్రహించారా? వెంటనే పూర్తిగా మార్పు రావడం జరగదు కానీ, పాల్గొంటున్నవారి మాటలు విన్నాక నా ఆలోచనా విధానంలో కొంత మార్పు వచ్చింది. ఎదుటి వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకునే నేర్పు, అందరి సమస్యలూ వినే ఓర్పు వచ్చింది. ఎంతసేపూ మన సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ, ఈ షో ద్వారా ఇతరుల సమస్యలను తెలుసుకోవడం, ఆలోచించడం మొదలైంది. ‘ఇలా కూడా బతికేస్తున్నారా.. ఇన్ని సమస్యలుంటాయా’ అనిపిస్తోంది. పేదరికం అనుభవిస్తున్నవారి జీవితాల గురించి విన్న తరువాత అవి మిమ్మల్ని ఇంటివరకూ వెంటాడుతున్నాయా? నేను ఇంటికెళ్లేసరికి మా పిల్లలిద్దరూ ఇంట్లో ఉంటే, ‘ఎలా జరిగింది’ అని అడిగి తెలుసుకుంటారు. అమల ఒక్కతే ఉంటే, ఒకవేళ నేను డల్‌గా కనిపిస్తే, ‘ఇవాళ చాలా సమస్యలు విని ఉంటాను’ అని ఫిక్స్ అయిపోతుంది. తను అడిగి తెలుసుకుంటుంది. ఈ షో చేయడం ద్వారా నా కుటుంబంలోనే ఓ మార్పు కనిపిస్తోంది. నాగచైతన్యని, అఖిల్‌ని కూర్చోబెట్టి, ‘వాళ్ల నాన్న జీతం నాలుగు వేలట.. ఆ అబ్బాయి చాలా కష్టపడి చదువుకుంటున్నాడట’ అని చెబుతుంటాను. అదే నేను కావాలని వాళ్లకి ఏవేవో నీతులు చెబితే, ‘లెక్చర్ ఇస్తున్నాడు’ అనుకుంటారు. కానీ, స్వయంగా నేను విన్నవి చెప్పడంతో, వాళ్లు కూడా ‘ఇంతే సంపాదిస్తారా డాడీ... లైఫ్ ఇలా ఉంటుందా’ అంటున్నారు. సో.. ఈ షో మా కుటుంబానికి కూడా ఓ ఆదర్శమే. తల్లిదండ్రులు చెబితే పిల్లలు పెద్దగా వినరు. అదే, ఇలాంటి షోస్ చూస్తే, కొంతైనా స్ఫూర్తి పొందుతారు. మీరే కనుక ఈ పోటీలో పాల్గొంటే.. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగేవారా? లేదు. చాలా ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు. అది అవగాహన లేక. ఉదయం నిద్ర లేచి పేపర్ చదవడం, ఖాళీ దొరికితే టీవీలు చూడటం.. అంతవరకే. బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉండటంవల్లే చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదు. ఈ షో చేయడం ద్వారా మన భారతీయ చరిత్ర గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్నవి మర్చిపోతాం. అవన్నీ రీ కలక్ట్ చేసుకున్నట్లుగా ఉంది. ఫస్ట్ సీజన్ తర్వాత రెండోది కూడా కంటిన్యూ చేయాలనే ఆసక్తి ఉందా? ఇప్పటికైతే ఆ ఆసక్తి ఉంది. ఈ షో చేసే అవకాశం నాకు కాకుండా, మరో హీరోకు వచ్చి ఉంటే, కచ్చితంగా బాధపడేవాణ్ణి. ఈ ఫస్ట్ సీజన్ 45 ఎపిసోడ్స్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత కచ్చితంగా ఏదో మిస్సయిన ఫీలింగ్ కలగక మానదు. Follow @sakshinews -
ఆమె దూరంగా జరిగిన ఆ సంఘటన గుర్తొస్తే... నా హృదయం బరువెక్కుతుంది
‘కొత్తదనం ఎక్కడుంటే నాగార్జున అక్కడుంటారు’... తెలుగు చిత్ర సీమలో అందరూ ఒప్పుకునే మాట ఇది. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన, బుల్లితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ‘మా’ టీవీలో ప్రసారం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే గేమ్‌షోతో... తొలిసారి వ్యాఖ్యాతగా మారి, తెలుగు చిత్ర సీమలో కొత్త ట్రెండ్‌కి తెర తీశారు. ఈ నెల 9 నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో, ధృక్పథాలతో ఈ షోలో తన ముందుకొస్తున్న ఎందరెందరో వ్యక్తుల మనోగతం తనకో అందమైన అనుభవం అంటున్న నాగ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ కొత్త అనుభవం ఎలా ఉందండీ? అద్భుతంగా ఉంది. ప్రపంచంలోని 85 దేశాల్లో ఈ తరహా కార్యక్రమాలు రూపొందాయి. మన దేశంలోని అన్ని రాష్టాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. తెలుగులో మాత్రం ఈ స్థాయిలో రావడం ఇదే ప్రథమం. విద్యావంతులు, విద్యావంతులు కానివారు, ధనికులు, కటిక పేదలు ఇలా తారతమ్యం లేకుండా అందరూ ఈ కార్యక్ర మంలో పాల్గొనడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వారిని వడపోత చేయడం పెద్ద పని. ఎక్కడా స్వలాభాపేక్ష, బంధు ప్రీతి చూడకుండా, నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని ఎన్నుకుంటాం. ఇప్పటివరకూ ఎన్నికైన కొంతమందితో ఎపిసోడ్లు చేస్తున్నాం. బిడ్డల చదువులకనీ, గుండె ఆపరేషన్ల కోసమనీ... బలీయమైన బాధ్యతల్ని తలపై పెట్టుకొని ఎన్నో కథలతో, కలలతో, వ్యథలతో.. ఏదో సాధించాలనే తపనతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే... సెలబ్రిటీలకు ఈ షోలో స్థానం లేదనేగా? ఇది సెలబ్ షో కాదు. సామాన్యుడి షో. అలాగని సెలబ్రిటీలు ఉండరని చెప్పను. వారూ ఉంటారు. అయితే.. పాల్గొనే సామాన్యులకు సాధ్యమైనంతవరకూ నైతికంగా అండగా ఉండడానికే వారు ఈ కార్యక్రమంలో వస్తారు. ఇప్పటివరకూ ఆరు ఎపిసోడ్లు చేశాను. ఆ ఆరుగురూ అత్యంత సామాన్యులు. జీవితంలో వారు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న కష్టాలు విన్న తర్వాత నాలో తెలీని మార్పు వచ్చేసింది. వారిలో ఓ లేడీ ఆటోడ్రైవర్ గురించి చెప్పాలి. ఆమెకు పద్ధెనిమిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. ఇరవై ఏళ్ల వయసు వచ్చే సరికే భర్త పోయాడు. కారణం ‘ఎయిడ్స్’. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక బిడ్డ కడుపులో ఉన్నాడు. భర్తకు ఎయిడ్స్ వచ్చినట్లు ఆమెకు అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలుసు. ఎలా అంటే... తనకూ ఇప్పుడు హెచ్ఐవీ. అదృష్టం ఏంటంటే... ఆమె పిల్లలకు ఆ వ్యాధి సోకలేదు. పెద్ద కొడుకును తనే కష్టపడి సి.ఎ. చదివిస్తోంది. బిడ్డ చదువు కోసమే సాహసం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. తాను హెచ్ఐవీ పేషెంట్ కావడంతో నేను దగ్గరకు తీసుకోబోయినా... ఆమె దూరంగా జరిగిన ఆ సంఘటన ఇప్పుడు గుర్తొచ్చినా నా హృదయం బరువెక్కుతుంది. అలాగే... ఈ కార్యక్రమంలో మొట్టమొదట పాల్గొన్న వ్యక్తి అయిన మోచీ గురించి కూడా చెప్పాలి. చెప్పులు కుట్టడం వాళ్ల నాన్న వృత్తి. అలాగే... అతణ్ణి చదివించాడు. ఇప్పుడు మోచీ కల ఒక్కటే... ఓ నాలుగు లక్షలు పెట్టి ఓ ఇల్లు కట్టాలి. అందులో వాళ్ల నాన్నను కూర్చోబెట్టాలి. ఈ వ్యథలన్నీ వింటుంటే వాళ్లను గెలిపించేయాలనిపిస్తుంది కదా! అవును... నిజంగా ఆ సీట్‌పై కూర్చున్న తర్వాత నా బాధ దేవుడెరుగు. వాళ్లు తప్పులు చెబుతుంటే... నాకు ప్రాణం పోయినంత పనవుతుంది. ఎలాగైనా వారి ఆన్సర్ కరెక్ట్ చేయాలని ప్రయత్నించాలనిపిస్తుంది. కానీ... పద్ధతి ప్రకారం వెళ్లాలి కాబట్టి తప్పదు. నిజంగా వీరి బాధలు విన్న తర్వాత మానసికంగా నాకున్న చిన్న చిన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయి. అసలు ప్రపంచం అంటే ఏంటో, ఎలా ఉందో తెలుస్తోంది. తొలుత సాధారణమైన గేమ్‌షోగా చేద్దామనుకున్నాం. కానీ పోను పోను ఇది ఎమోషనల్ షోగా మారింది. ప్రజల్లో చైతన్యం, ఆశావాహ దృక్పథం పెంచడానికి ఈ కార్యక్రమం ద్వారా మరో పని కూడా చేస్తున్నాం. వీరుంటున్న ప్రదేశాలకెళ్లి, వీరి దైనందిన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించే ఓ కొత్త ప్రక్రియకు ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టాం. కొన్ని కార్యక్రమాల్లో ప్రశ్నలు వింటుంటే సిల్లీగా అనిపిస్తుంటాయి. ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మొదట్లోనే కష్టమైన ప్రశ్నలు అడక్కూడదు. 30-40 ఏళ్ల మధ్య వాళ్లను పురాణాల గురించి అడిగితే... ఠకీమని చెప్పేస్తున్నారు. 18 ఏళ్ల వాళ్లను పురాణాల గురించి అడిగితే... కళ్లు తేలేస్తున్నారు. మన దేశ రాజధాని పేరు అడిగితే కూడా ఆలోచించేవాళ్లు ఉన్నారు. ఒక్క తప్పు చెబితే అరు లక్షలు పోతాయి. దీని వల్ల మానసికంగా ఒత్తిడి ఎక్కువై పోతుంది. ఒకటి మాత్రం నిజం... ఈ కార్యక్రమం వల్ల నాకు తెలీని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గురించి అమితాబ్ ఏమన్నారు? మొన్ననే కలిశా. ‘ఈ షో ఎంజాయ్ చేయ్. కచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ హాట్ సీట్లో కూర్చుంటే టైమే తెలీదు’ అన్నారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’లో అమితాబ్ ప్రశ్న అడిగే తీరు చూస్తే ఉత్కంఠ తట్టుకోలేక బీపీ వచ్చేస్తుంది. మరి మీరెలా చేస్తున్నారు? ఎవరికుండే ప్రత్యేకతలు వారికుంటాయి. నేను చేసింది ఆరు ఎపిసోడ్సే. ఆయన ఏకంగా ఏడో సీజన్‌కి వచ్చారు. పైగా ఆయన లెజెండ్. ఆయన గంభీరమైన ఉచ్చారణ వింటే ఎవరికైనా ఆటోమేటిగ్గా బీపీ పెరిగిపోతుంది. ఆ డైలాగ్ డిక్షన్, ఆ క్లారిటీ... అసాధారణమైనవి. పెద్ద తెరకీ, బుల్లి తెరకీ మధ్య వ్యత్యాసం ఎలా అనిపించింది? దేని ప్రత్యేకత దానిదే. ఇది మాత్రం నాకు ఓ కొత్త అనుభవం. తొమ్మిది కెమెరాలతో సెటప్. ఆడియన్స్ రియాక్షన్, పార్టిసిపెంట్స్ రియాక్షన్, నా రియాక్షన్ ఇలా... అన్నీ ఒకేసారి క్యాప్చర్ చేయడం నిజంగా అద్భుతం. సాధ్యమైనంతవకూ పోస్ట్ ప్రొడక్షన్ కూడా సెట్లోనే అయిపోతుంది. హాట్సీట్లో కూర్చున్న తర్వాత అందర్నీ మరిచిపోవాలి. నేనూ, నా ఎదుటి పార్టిసిపెంట్... అంతే. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక్క సెకన్ కూడా రిలీఫ్ ఉండదు. మరి సినిమాల సంగతి? ‘మనం’ తర్వాత ఈ షో చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నా. చేస్తున్నాను అంతే. జరిగిపోయిన ఆరు నెలలు నా జీవితంలో మరచిపోలేనివి. ‘మనం’ పంచిన అనుభవం మాటల్లో చెప్పలేను. మీ పాతికేళ్ల అనుభవం ‘మనం’లో కనిపించింది. సినిమాలో కొత్త నాగార్జున కనిపించాడు. ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రత్యేకించి ఏమీ చేయలేదు. పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేశానంతే. కమర్షియాలిటీని పట్టించుకోలేదు. నచ్చిన స్నేహితుడితో గడిపినట్లుగా ఇష్టంగా పనిచేశాను. నేనే కాదు అందరూ ప్రేమలో పడిపోయి ఈ సినిమాకు పనిచేశారు. సమంత ఎంతబాగా చేసిందో. ఇక శ్రీయ అయితే... తన కెరీర్లో ఇంత బాగా ఏ సినిమాలోనూ చేయలేదు. ఓ కావ్యనాయికలా, కవితాత్మకంగా అనిపించింది. మీ తదుపరి సినిమా? నేనూ, ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేస్తున్నాం. పైడిపల్లి వంశీ దర్శకుడు. అందులో నాది మంచి పాత్ర. - బుర్రా నరసింహ -
అమితాబ్ బాటలో... బుల్లితెరపై నాగ్
ప్రముఖ నటుడు నాగార్జున బుల్లితెరపై మెరవనున్నారు. 28 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో ద్వారా డ్రాయింగ్ రూమ్‌లో వీక్షకులను పలకరించనున్నారు. జూన్ మొదటివారం నుంచి ‘మా’ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఇప్పటికే విజయవంతమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఫార్ములాతోనే ఈ గేమ్ షో రూపొందుతోంది. రూపొందుతోంది. ఇప్పటి వరకు తెలుగు చానల్స్‌లో వచ్చిన గేమ్ షోలకు భిన్నంగా, ప్రయోజనాత్మకంగా ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను నిర్మిస్తున్నట్లు ‘మా’ టీవీ యాజమాన్యం నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ షో పరిచయ కార్యక్రమంలో ‘మా’ టి.వి. చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘సమాజంలో, ముఖ్యంగా గత నాలుగైదేళ్ళలో చాలా బాధలు పడ్డాం. ప్రతికూల భావనలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో మానవీయంగా ఉంటూ, మారుమూల ప్రాంతపు మనిషి కూడా జీవితంలో గెలుపు సాధించి, మరెంతో మందికి ప్రేరణనివ్వడం కోసమే ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేపట్టాం’’ అని పేర్కొన్నారు. ఈ గేమ్ షోకు నాగార్జునను హోస్ట్‌గా ఎంచుకోవడంపై ఆయన వివరణనిస్తూ, ‘‘చాలా ఏళ్ళుగా నాగ్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. అయితే, ఈ షోకు దాదాపు 37 - 38 మంది స్టార్లను అనుకున్నా, చివరకు నాగార్జునే సరైన వ్యక్తి అని నిర్ధారణకు వచ్చాం. ఆ రకంగా ఆ వడపోతలన్నీ దాటుకొని నాగార్జున ఈ హోస్ట్ హోదాను తనకు తాను సంపాదించుకున్నారే తప్ప మాకు మేము ఇచ్చింది కాదు’’ అని చెప్పారు. ‘ఆరేళ్ళ క్రితం ‘మా’ టి.వి.ని చేపట్టిన మేము ఓ సవాలుగా తీసుకొని, ఈ ‘మట్టిలోని మాణిక్యాన్ని’ సానబెట్టి, అందమైన రత్నంగా తీర్చిదిద్దాం. ఇవాళ తెలుగులోని సర్వజన వినోదాత్మక టీవీ చానళ్ళ (జి.ఇ.సి)లలో నంబర్ వన్ స్థానానికి తీసుకురాగలిగాం. దీనికి మా సంస్థలో పని చేసిన, చేస్తున్న ఉద్యోగుల కృషే కారణం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొద్ది నెలలుగా ప్రథమస్థానంలో నిలిచిన ‘మా’ చానల్‌ను ఆ స్థానంలో సుస్థిరంగా నిలబెట్టేందుకు చేస్తున్న విశిష్టమైన కార్యక్రమమే ఈ తాజా గేమ్ షో. ఈ ఆరేళ్ళలో ‘మా’ టి.వి. నిర్వహణలో నేర్చుకున్న మేనేజ్మెంట్ పాఠాలను అవ్యవస్థీకృతంగా ఉన్న మన సినీ రంగంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నాను’’ అని ‘మా’ టి.వి. బోర్డు డెరైక్టర్లలో ఒకరైన నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ -‘‘ఇంతకాలం సినిమాలతో మిమ్మల్ని అలరించిన నేను బుల్లితెరవైపు ఎందుకు దృష్టిసారించాను? అనే ప్రశ్న మీ అందరికీ కలగొచ్చు. సామాన్యులతో సహా ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. వాటిని నిజం చేసుకోవాలని ఉంటుంది. దాన్ని నెరవేర్చడానికే నేను ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారాను. అయితే... ఈ భారాన్ని మోయడం అంత తేలికైన విషయం కాదు. నిద్రపోతుంటే కలలో కూడా ప్రశ్నలు, సమాధానానే వినిపిస్తున్నాయి’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమల, ఈ గేమ్ షో రూపకర్తల బృందమైన సిద్దార్ధబసు, అనిత బసు, షెనాయ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఇది నాకు కూడా ఓ సవాల్’ - నాగార్జున కార్యక్రమంలో భాగంగా విలేకరులు సంధించిన ప్రశ్నలకు నాగార్జున చెప్పిన సమాధానాల్లో కొన్ని... ఇది నాకు కొత్త అవతారం. అయితే.. ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ ద్వారా అమితాబ్ వేసిన ముద్ర చెరిగిపోయేది కాదు. ఆయన అంత కాకపోయినా... ఆయన దరిదాపులకు వెళ్లేలా ప్రయత్నం చేస్తా. ఈ కార్యక్రమం ఓ విధంగా నాకు కూడా సవాల్. దీన్ని చేయడం అంత తేలికైన విషయం కాదని ఒప్పుకున్న తర్వాత తెలిసింది. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్నా. ప్రముఖుల కన్నా... సామాన్యులకే ఈ కార్యక్రమం విషయంలో పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ల ద్వారా మేం సూచించే టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం. అడపాదడపా సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు. అయితే... అదంతా చారిటీలో భాగం మాత్రమే. ఈ కార్యక్రమం నాకు ప్లస్ అవుతుందా, నేను ఈ కార్యక్రమానికి ప్లస్ అవుతానా అంటే... అది పరస్పరం ఉపయోగకరం. చేసేవాణ్ణి, చూసేవాణ్ణి కూడా పూర్తిగా లీనం చేసుకునే కార్యక్రమం ఇది. దీని ద్వారా నా సొంత శైలిని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తా.నాన్నకు అమితాబ్ అంటే చాలా ఇష్టం. చాలా విషయాల్లో ఆయనను మెచ్చుకునేవారు. ఈ రోజు మన మధ్య లేకపోయినా... పై నుంచి నాన్న ఆశీస్సులు నాకు ఉంటాయి. టీవీలో ఈ గేమ్ షో ప్రసారం ఎప్పుడు మొదలవుతుందా అని నేను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను.