ఆమె దూరంగా జరిగిన ఆ సంఘటన గుర్తొస్తే... నా హృదయం బరువెక్కుతుంది | Akkineni Nagarjuna Special Interview | Sakshi
Sakshi News home page

ఆమె దూరంగా జరిగిన ఆ సంఘటన గుర్తొస్తే... నా హృదయం బరువెక్కుతుంది

Published Tue, Jun 3 2014 10:31 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

ఆమె దూరంగా జరిగిన ఆ సంఘటన గుర్తొస్తే... నా హృదయం బరువెక్కుతుంది - Sakshi

ఆమె దూరంగా జరిగిన ఆ సంఘటన గుర్తొస్తే... నా హృదయం బరువెక్కుతుంది

‘కొత్తదనం ఎక్కడుంటే నాగార్జున అక్కడుంటారు’... తెలుగు చిత్ర సీమలో అందరూ ఒప్పుకునే మాట ఇది. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన, బుల్లితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ‘మా’ టీవీలో ప్రసారం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే గేమ్‌షోతో... తొలిసారి వ్యాఖ్యాతగా మారి, తెలుగు చిత్ర సీమలో కొత్త ట్రెండ్‌కి తెర తీశారు. ఈ నెల 9 నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో, ధృక్పథాలతో ఈ షోలో తన ముందుకొస్తున్న ఎందరెందరో వ్యక్తుల మనోగతం తనకో అందమైన అనుభవం అంటున్న నాగ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
 
 ఈ కొత్త అనుభవం ఎలా ఉందండీ?
 అద్భుతంగా ఉంది. ప్రపంచంలోని 85 దేశాల్లో ఈ తరహా కార్యక్రమాలు రూపొందాయి. మన దేశంలోని అన్ని రాష్టాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. తెలుగులో మాత్రం ఈ స్థాయిలో రావడం ఇదే ప్రథమం. విద్యావంతులు, విద్యావంతులు కానివారు, ధనికులు, కటిక పేదలు ఇలా తారతమ్యం లేకుండా అందరూ ఈ కార్యక్ర మంలో పాల్గొనడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వారిని వడపోత చేయడం పెద్ద పని. ఎక్కడా స్వలాభాపేక్ష, బంధు ప్రీతి చూడకుండా, నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని ఎన్నుకుంటాం. ఇప్పటివరకూ ఎన్నికైన కొంతమందితో ఎపిసోడ్లు చేస్తున్నాం. బిడ్డల చదువులకనీ, గుండె ఆపరేషన్ల కోసమనీ... బలీయమైన బాధ్యతల్ని తలపై పెట్టుకొని ఎన్నో కథలతో, కలలతో, వ్యథలతో.. ఏదో సాధించాలనే తపనతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
 
 అంటే... సెలబ్రిటీలకు ఈ షోలో స్థానం లేదనేగా?
 ఇది సెలబ్ షో కాదు. సామాన్యుడి షో. అలాగని సెలబ్రిటీలు ఉండరని చెప్పను. వారూ ఉంటారు. అయితే.. పాల్గొనే సామాన్యులకు సాధ్యమైనంతవరకూ నైతికంగా అండగా ఉండడానికే వారు ఈ కార్యక్రమంలో వస్తారు. ఇప్పటివరకూ ఆరు ఎపిసోడ్లు చేశాను. ఆ ఆరుగురూ అత్యంత సామాన్యులు. జీవితంలో వారు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న కష్టాలు విన్న తర్వాత నాలో తెలీని మార్పు వచ్చేసింది. వారిలో ఓ లేడీ ఆటోడ్రైవర్ గురించి చెప్పాలి. ఆమెకు పద్ధెనిమిదేళ్ల వయసులో పెళ్లయ్యింది.  ఇరవై ఏళ్ల వయసు వచ్చే సరికే భర్త పోయాడు. కారణం ‘ఎయిడ్స్’. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక బిడ్డ కడుపులో ఉన్నాడు. భర్తకు ఎయిడ్స్ వచ్చినట్లు ఆమెకు అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలుసు. ఎలా అంటే... తనకూ ఇప్పుడు హెచ్‌ఐవీ. అదృష్టం ఏంటంటే... ఆమె పిల్లలకు ఆ వ్యాధి సోకలేదు. పెద్ద కొడుకును తనే కష్టపడి సి.ఎ. చదివిస్తోంది. బిడ్డ చదువు కోసమే సాహసం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. తాను హెచ్‌ఐవీ పేషెంట్ కావడంతో నేను దగ్గరకు తీసుకోబోయినా... ఆమె దూరంగా జరిగిన ఆ సంఘటన ఇప్పుడు గుర్తొచ్చినా నా హృదయం బరువెక్కుతుంది. అలాగే... ఈ కార్యక్రమంలో మొట్టమొదట పాల్గొన్న వ్యక్తి అయిన మోచీ గురించి కూడా చెప్పాలి. చెప్పులు కుట్టడం వాళ్ల నాన్న వృత్తి. అలాగే... అతణ్ణి చదివించాడు. ఇప్పుడు మోచీ కల ఒక్కటే... ఓ నాలుగు లక్షలు పెట్టి ఓ ఇల్లు కట్టాలి. అందులో వాళ్ల నాన్నను కూర్చోబెట్టాలి.
 
 ఈ వ్యథలన్నీ వింటుంటే వాళ్లను గెలిపించేయాలనిపిస్తుంది కదా!
 అవును... నిజంగా ఆ సీట్‌పై కూర్చున్న తర్వాత నా బాధ దేవుడెరుగు. వాళ్లు తప్పులు చెబుతుంటే... నాకు ప్రాణం పోయినంత పనవుతుంది. ఎలాగైనా వారి ఆన్సర్ కరెక్ట్ చేయాలని ప్రయత్నించాలనిపిస్తుంది. కానీ... పద్ధతి ప్రకారం వెళ్లాలి కాబట్టి తప్పదు. నిజంగా వీరి బాధలు విన్న తర్వాత మానసికంగా నాకున్న చిన్న చిన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయి. అసలు ప్రపంచం అంటే ఏంటో, ఎలా ఉందో తెలుస్తోంది. తొలుత సాధారణమైన గేమ్‌షోగా చేద్దామనుకున్నాం. కానీ పోను పోను ఇది ఎమోషనల్ షోగా మారింది. ప్రజల్లో చైతన్యం, ఆశావాహ దృక్పథం పెంచడానికి ఈ కార్యక్రమం ద్వారా మరో పని కూడా చేస్తున్నాం. వీరుంటున్న ప్రదేశాలకెళ్లి, వీరి దైనందిన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించే ఓ కొత్త ప్రక్రియకు ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టాం.
 
 కొన్ని కార్యక్రమాల్లో ప్రశ్నలు వింటుంటే సిల్లీగా అనిపిస్తుంటాయి. ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
 మొదట్లోనే కష్టమైన ప్రశ్నలు అడక్కూడదు. 30-40 ఏళ్ల మధ్య వాళ్లను పురాణాల గురించి అడిగితే... ఠకీమని చెప్పేస్తున్నారు. 18 ఏళ్ల వాళ్లను పురాణాల గురించి అడిగితే... కళ్లు తేలేస్తున్నారు. మన దేశ రాజధాని పేరు అడిగితే కూడా ఆలోచించేవాళ్లు ఉన్నారు. ఒక్క తప్పు చెబితే అరు లక్షలు పోతాయి. దీని వల్ల మానసికంగా ఒత్తిడి ఎక్కువై పోతుంది. ఒకటి మాత్రం నిజం... ఈ కార్యక్రమం వల్ల నాకు తెలీని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి.
 
 ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గురించి అమితాబ్ ఏమన్నారు?
 మొన్ననే కలిశా. ‘ఈ షో ఎంజాయ్ చేయ్. కచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ హాట్ సీట్‌లో కూర్చుంటే టైమే తెలీదు’ అన్నారు.
 
 ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’లో అమితాబ్ ప్రశ్న అడిగే తీరు చూస్తే ఉత్కంఠ తట్టుకోలేక బీపీ వచ్చేస్తుంది. మరి మీరెలా చేస్తున్నారు?
 ఎవరికుండే ప్రత్యేకతలు వారికుంటాయి. నేను చేసింది ఆరు ఎపిసోడ్సే. ఆయన ఏకంగా ఏడో సీజన్‌కి వచ్చారు. పైగా ఆయన లెజెండ్. ఆయన గంభీరమైన ఉచ్చారణ వింటే ఎవరికైనా ఆటోమేటిగ్గా బీపీ పెరిగిపోతుంది. ఆ డైలాగ్ డిక్షన్, ఆ క్లారిటీ... అసాధారణమైనవి.  
 
 పెద్ద తెరకీ, బుల్లి తెరకీ మధ్య వ్యత్యాసం ఎలా అనిపించింది?
 దేని ప్రత్యేకత దానిదే. ఇది మాత్రం నాకు ఓ కొత్త అనుభవం. తొమ్మిది కెమెరాలతో సెటప్. ఆడియన్స్ రియాక్షన్, పార్టిసిపెంట్స్ రియాక్షన్, నా రియాక్షన్ ఇలా... అన్నీ ఒకేసారి క్యాప్చర్ చేయడం నిజంగా అద్భుతం. సాధ్యమైనంతవకూ పోస్ట్ ప్రొడక్షన్ కూడా సెట్‌లోనే అయిపోతుంది. హాట్‌సీట్‌లో కూర్చున్న తర్వాత అందర్నీ మరిచిపోవాలి. నేనూ, నా ఎదుటి పార్టిసిపెంట్... అంతే. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక్క సెకన్ కూడా రిలీఫ్ ఉండదు.  
 
 మరి సినిమాల సంగతి?
 ‘మనం’ తర్వాత ఈ షో చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నా. చేస్తున్నాను అంతే. జరిగిపోయిన ఆరు నెలలు నా జీవితంలో మరచిపోలేనివి. ‘మనం’ పంచిన అనుభవం మాటల్లో చెప్పలేను.
 
 మీ పాతికేళ్ల అనుభవం ‘మనం’లో కనిపించింది. సినిమాలో కొత్త నాగార్జున కనిపించాడు. ఏం జాగ్రత్తలు తీసుకున్నారు?
 ప్రత్యేకించి ఏమీ చేయలేదు. పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేశానంతే. కమర్షియాలిటీని పట్టించుకోలేదు. నచ్చిన స్నేహితుడితో గడిపినట్లుగా ఇష్టంగా పనిచేశాను. నేనే కాదు అందరూ ప్రేమలో పడిపోయి ఈ సినిమాకు పనిచేశారు. సమంత ఎంతబాగా చేసిందో. ఇక శ్రీయ అయితే... తన కెరీర్‌లో ఇంత బాగా ఏ సినిమాలోనూ చేయలేదు. ఓ కావ్యనాయికలా, కవితాత్మకంగా అనిపించింది.
 
 మీ తదుపరి సినిమా?
 నేనూ, ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేస్తున్నాం. పైడిపల్లి వంశీ దర్శకుడు. అందులో నాది మంచి పాత్ర.
  - బుర్రా నరసింహ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement