ఇవాళే నాగ్ బర్త్‌డే... ‘సాక్షి’ సమ్‌థింగ్ స్పెషల్‌గా నాగ్‌తో ముచ్చటించింది... | Nagarjuna festival special interview | Sakshi
Sakshi News home page

ఇవాళే నాగ్ బర్త్‌డే... ‘సాక్షి’ సమ్‌థింగ్ స్పెషల్‌గా నాగ్‌తో ముచ్చటించింది...

Published Thu, Aug 28 2014 10:41 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Nagarjuna festival special interview

నాగ్ కెరీర్‌కి నో నీడ్ ఆఫ్ ఇంట్రో!
 నాగ్ స్టయిల్‌కి నో రిమార్క్!
 నాగ్ పర్సనాలిటీకి నో మ్యాచింగ్!
 నాగ్ అంటేనే...
 ఆడియన్స్‌కి ఓ ఫెస్టివల్ మూడ్!
 ఇవాళ గణేశ్ ఫెస్టివల్...
 అనుకోకుండా ఇవాళే నాగ్ బర్త్‌డే...
 ఈ అకేషన్‌లో ‘సాక్షి’ సమ్‌థింగ్ స్పెషల్‌గా నాగ్‌తో ముచ్చటించింది...

 
సాక్షి: ఇది మీరు మర్చిపోలేని ఇయర్ కదా. మీ నాన్నగారి మరణం... అక్కినేని మూడు తరాలు నటించిన ‘మనం’ సినిమా... బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో... ఇవన్నీ మీపై గాఢంగా ప్రభావం చూపించి ఉంటాయి కదూ?
 నాగ్: అవును. నాన్నగారు ఇంకా మా మధ్య ఉన్నారనే ఫీలింగే ఉంది. ఆయన ఉన్నప్పుడు దాదాపు ప్రతి ఆదివారం కుటుంబం అంతా కలుసుకునేవాళ్లం. ఇప్పుడూ అదే పాటిస్తున్నాం. ఒక ఆదివారం మా అక్క వాళ్లింట్లో, ఒకసారి మా ఇంట్లో.. ఇలా అందరం కలుసుకుంటున్నాం. అది ఎప్పటికీ పాటించాలని ఉంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా ఎంతోమంది జీవితాలను తెలుసుకోగలిగాను. అమ్మా, నాన్న ఉండి ఉంటే.. చక్కగా ఇద్దరూ కలిసి ఈ షో చూసేవాళ్లు కదా అనిపిస్తుంటుంది.
 

సాక్షి: ప్రతి ఏడాది ఇచ్చే ఏయన్నార్ జాతీయ అవార్డుని కొనసాగిస్తారా?
నాగ్: ఆ ప్రయత్నంలోనే ఉన్నా. వచ్చే నెల 20న నాన్నగారి పుట్టినరోజుకి ఇవ్వాలనుకున్నాం. కానీ, టైమ్ తక్కువగా ఉంది కాబట్టి, సాధ్యపడుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఆ రోజు కుదరకపోయినా ఈ ఏడాదే అవార్డు వేడుక చేస్తాం. ప్రతి ఏడాదీ చాలా భారీగా అవార్డు వేడుక చేయాలన్నది మా సంకల్పం.
 
సాక్షి: ఐదు పదుల వయసులో కూడా చాలా హ్యాండ్‌సమ్‌గా, ఫిట్‌గా కనిపిస్తున్నారు... ఆ సీక్రెట్స్ ఏంటో చెప్పొచ్చుగా?
నాగ్: రహస్యాలేం లేవు. చక్కటి ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామాలు... ఇంతకు మించి ఏమీ చేయను.
 
సాక్షి:  రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడంవల్లే ఇలా ఫిట్‌గా ఉంటున్నారా?
నాగ్: ఈ విషయంలో నేను రామ్‌గోపాల్‌వర్మకే ధన్యవాదాలు చెప్పాలి. ‘శివ’ సినిమా చేద్దామనుకున్నాక ‘ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అందుకని ఇంకా ఫిట్‌గా ఉండాలి. కండలు కనిపించాలి’ అన్నారు. దాంతో వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాను. అది ఇప్పటికీ కొనసాగుతోంది. నేనిలా ఉన్నానంటే దానికి కారణం కొన్ని రోజులు, కొన్ని నెలలు కాదు. 25, 30 ఏళ్ల హార్డ్‌వర్క్‌కి లభించిన ఫలితం ఇది.
 
సాక్షి: అంటే.. ‘శివ’కు ముందు వ్యాయామాలు పట్టించుకునేవారు కాదా?
నాగ్: చేసేవాణ్ణి. కానీ, తేలికపాటివి. ‘శివ’ ఒప్పుకున్న తర్వాత మొదలుపెట్టిన వ్యాయామాలు, డైట్ వల్ల బయటికి ఇలా స్లిమ్‌గా ఉండటం అందరికీ కనిపిస్తోంది. కానీ, లోపల ఎంత మార్పు వచ్చిందో నాకే తెలుసు. అంతకు ముందుకన్నా ఉత్సాహం పెరిగింది. ఉదయం నిద్రలేచేటప్పుడు ఓ మంచి ఫీల్ కలుగుతుంది. రోజంతా శరీరం తేలికగా, హాయిగా ఉంటుంది. మైండ్ అంతా హ్యాపీగా ఉంటుంది. దాంతో ఆ వ్యాయామాలు, డైట్‌కి బానిస అయ్యాను.  జీవితాంతం శారీరకంగా, మానసికంగా ఇలా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అని అనుకుని, కొన్ని నియమాలు పాటించడం మొదలుపెట్టాను.
 
సాక్షి: ఏంటా నియమాలు?
నాగ్: మొదటి పది సంవత్సరాలు ‘వెయిట్ లిఫ్టింగ్’ బాగా చేశాను. ఆ తర్వాత బాడీ బాగా ఫిట్‌గా ఉండాలంటే ‘యోగా’ చేస్తే మంచిదనిపించింది. దాంతో స్ట్రెచ్చింగ్ ఆసనాలు మొదలుపెట్టాను. హాలీడే ట్రిప్ నిమిత్తం ఎక్కడికైనా వెళితే, ఆ వారం, పది రోజులు వర్కవుట్లకు దూరం అవుతానేమో. ఎక్సర్‌సైజ్, యోగా అనేవి నా  జీవితంలో భాగం అయిపోయాయి. ఇప్పుడు నేనిలా ఉన్నానంటే కారణం 50 శాతం వ్యాయామాలు, 50 శాతం డైట్.

సాక్షి:  ఎలాంటి ఆహారం తీసుకుంటారు?
నాగ్: ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉంటాను. మసాలాలు ఎక్కువగా వాడను. ముఖ్యంగా గరమ్ మసాలా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను.
 
సాక్షి:  గరమ్ మసాలాతో ఏంటి సమస్య?
నాగ్: ఆ మసాలాని ఎక్కువగా మాడ్చేస్తే కేన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఎక్కువగా ఫ్రై చేస్తే.. దాదాపు విషం అనే చెప్పాలి. నేను అప్పుడప్పుడూ వంట చేస్తుంటాను. అప్పుడు గరమ్ మసాలాని చాలా స్లయిట్‌గా వేయించుతా. నేను వండే వంటకాల్లో తాలింపు ఉంటుంది కానీ, మసాలాలు చాలా తక్కువ.
 
సాక్షి:  కారం తక్కువగా తింటారా?
నాగ్: అలా ఏం లేదు. విపరీతంగా తింటా. పచ్చిమిరపకాయలు నూరి, రోటి పచ్చళ్లు చేస్తారే... అవంటే చాలా ఇష్టం. బీరకాయ, వంకాయ, బీట్‌రూట్ పచ్చళ్లు బాగా తింటాను. బీరకాయ తొక్కులతో చేస్తారు కదా.. ఆ పచ్చడి కూడా చేయించుకుంటాను. ఆ తొక్కల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. వేడి వేడి అన్నంలో పచ్చడేసుకుని, రెండు స్పూన్లు నెయ్యేసుకుని తింటే ఉంటుందీ...
 
సాక్షి:  ఊరగాయ పచ్చళ్లు తింటారా?
నాగ్: పచ్చళ్లు చేసిన తర్వాత ఒకటి, రెండు నెలల వరకు తింటాను. ఆ తర్వాత నిలవ పచ్చళ్ల జోలికి వెళ్లను.
 
సాక్షి:  నెక్ట్స్ మీరు చేయబోయే సినిమా ఏంటి?
నాగ్: కొత్త దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చే నెలలో ఓ సినిమా మొదలుపెట్టబోతున్నా. నిర్మాత రామ్మోహన్ కథ ఇచ్చారు. ఇందులో నాది డ్యూయల్ రోల్. రమ్యకృష్ణ ఒక హీరోయిన్. ఇంకో హీరోయిన్‌ని ఎంపిక చేయాలి. ‘హలో బ్రదర్’ తరహాలో సాగే ఎంటర్‌టైనర్ ఇది.
 
సాక్షి:  ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నారట?
నాగ్: దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన కథ కొత్తగా ఉంది. ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది. రామారావుగారు, నాగేశ్వరరావుగారు నటించిన ‘మిస్సమ్మ’ తరహాలో ఉండే సినిమా అది.
 
సాక్షి: రెండువేల ఎకరాల్లో ఫిలింసిటీ నిర్మిస్తామనితెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై మీ స్పందన?
నాగ్: దీనివల్ల కొత్తవాళ్లు రావడానికి ఆస్కా రం ఉంది. అది పరిశ్రమకు మంచిది.
 
సాక్షి:  తెలంగాణ నుంచి చిత్రసీమలోకి రావాలనుకునేవారికి మీరిచ్చే సలహా?
నాగ్: స్క్రిప్ట్ రైటింగ్, డెరైక్షన్, యాక్టింగ్.. ఇలా ఏ శాఖలోకైనా రావొచ్చు. కానీ, కొంత శిక్షణ తీసుకున్న తర్వాత అయితేనే మంచిది. బాలీవుడ్ బాగా అభివృద్ధి చెందడానికి కారణం.. అక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక శాఖలో డిప్లమో కోర్స్ చేసి రావడమే. మనక్కూడా అలా రావాలి.
 
సాక్షి:   రాష్ర్టం విడిపోయిన నేపథ్యంలో చిత్రపరిశ్రమ ఇక్కణ్ణుంచి వెళ్లిపోయే అవకాశం ఉందనే వార్త వినిపిస్తోంది...
నాగ్: నేను హైదరాబాద్ వచ్చి 52 ఏళ్లయ్యింది. ఇక్కడ చక్కగా సెటిలయ్యాను. ఇలానే హాయిగా ఉండాలనుకుంటున్నాను.
 
సాక్షి:  వ్యక్తిగతంగా ఇప్పటివరకూ మీ జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం?
నాగ్: ఇంకేముంటుంది? అమలను పెళ్లి చేసుకోవడమే. తను చాలా చాలా మంచి వైఫ్.
 
సాక్షి:  మీ మీద మన్మథుడు ట్యాగ్ ఉన్నప్పటికీ ఆమె తేలికగా తీసుకుంటున్నారు కాబట్టే, చాలా చాలా మంచి వైఫ్ అంటున్నారా?
నాగ్: (నవ్వుతూ).. మా వైవాహిక జీవితం వయసు 22 ఏళ్లు. ఇన్నేళ్ల నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. అమలను పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కారణం కావాలి. ఇక, నా మీద మన్మథుడు ట్యాగ్ ఉన్నా, ఇంకే ట్యాగులున్నా.. ‘నా మైండ్... నా హార్ట్ తనదే’ అని తనకు బాగా తెలుసు. ఏ భార్యకైనా అంతన్నా ఏం కావాలి?
 
సాక్షి:   {పతి ఏడాదీ జరుపుకున్నట్లుగా ఈ ఏడాది కూడా పుట్టినరోజు వేడుక చేసుకుంటారా?
నాగ్: బర్త్‌డే చేసుకునే మూడ్‌లో లేను. కాబట్టి ఫ్యాన్స్‌ని హైదరాబాద్ రావద్దని కోరుకుంటున్నాను.
 
- డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement