ట్రిపుల్ మర్డర్ కిల్లర్స్‌ను తీసుకొచ్చిన పోలీసులు
విజయవాడ/పెనమలూరు: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెదఅవుటుపల్లి ట్రిపుల మర్డర్ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో కమిషనరేట్‌కు తీసుకొచ్చారు. గురువారం రాత్రి 7గంటల సమయంలో విజయవాడ నగరానికి తీసుకొచ్చిన వీరిని పెనమలూరులోని తూర్పు డివిజన్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. వీరిని శుక్రవారం కోర్టు ద్వారా జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. గత నెల 24వ తేదీన కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి గ్రామం సమీపంలోని 5వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఆగంతుకుల కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, ఇతని కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పినకడిమి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే వీరి హత్యలు జరిగినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని కళ్యాణిపురా ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులు ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్ వీరు అలియాస్ సల్లు, నితిన్, నీరజ్‌తో పాటు హత్యలకు కుట్రదారులైన మంజీత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాశ్‌ను మంగళవారం ఢిల్లీ పోలీసుల సహకారంతో డిప్యూటీ పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ నేతృత్వంలోని బృందం అరెస్టు చేసింది. వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పిటి(ప్రిజనర్స్ ట్రాన్సిట్) వారెంట్‌పై ఇక్కడికి తీసుకొచ్చారు.