Gandhi-Mandela series
-
దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు
ధర్మశాల: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని మెక్లాయిడ్ గంజ్‌లో శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పురస్కారం ప్రదానం చేశారు. యుద్ధం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని దలైలామా అన్నారు. గాంధీ, నెల్సన్ మండేలా ఆశయసాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్ 2019 నుంచి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. -
జైలు ‘ఊచలు’ విరిచి...
ఫ్రీడం సిరీస్ ట్రోఫీ తయారీ! పుణే: ‘మీ జైలు ఊచలు మాకో రెండివ్వండి. దాంతో క్రికెట్ సిరీస్ ట్రోఫీ తయారు చేసుకుంటాం’... సరిగ్గా ఇలాగే కాకపోయినా బీసీసీఐ దాదాపు ఇదే తరహాలో పోలీస్ అధికారులను కోరింది. వివరాల్లోకెళితే... గాంధీ-మండేలా సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ విజేతకు ‘ఫ్రీడం ట్రోఫీ’ని అందజేస్తారు. అయితే ఈ ట్రోఫీని ప్రత్యేకంగా రూపొందించాలని బీసీసీఐ భావించింది. స్వాతంత్య్రోద్యమం సందర్భంగా గాంధీ బందీ అయిన ఎరవాడ జైలునుంచి, తన పోరాట సమయంలో మండేలా ఉన్న రాబిన్ ఐలాండ్ జైలునుంచి ఊచలను తెచ్చి తయారు చేయాలని బోర్డు నిర్ణయించింది. వారిద్దరు నివసించిన గదుల కొన్ని ఊచలను ఒక చోటికి చేర్చి ‘ఫ్రీడం ట్రోఫీ’కి మెరుగులు దిద్దాలనేది ప్రతిపాదన. దాంతో ఈ విషయాన్ని చెబుతూ తమకు రెండు ఊచలు ఇప్పించాల్సిందిగా బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్వయంగా పుణేలోని జైళ్ల డీజీకి లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ వద్ద ఉంది. -
భారత్, దక్షిణాఫ్రికాల ఐదో వన్డే నేడు
-
అఖరి పోరాటం
భారత్, దక్షిణాఫ్రికాల ఐదో వన్డే నేడు సిరీస్ గెలవాలంటే ఇద్దరికీ విజయం అవసరం మార్పుల్లేకుండానే బరిలోకి భారత్ మ. గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం గాంధీ-మండేలా సిరీస్‌లో వన్డే మ్యాచ్‌లు ఇప్పటి వరకూ అంచనాలకు తగ్గట్లుగానే జరిగాయి. ఇరు జట్లు చెరో రెండు వన్డేలు గెలిచి సిరీస్ ఫలితం విషయంలో ఉత్కంఠను పెంచాయి. బలాబలాల పరంగా రెండు జట్లూ సమానంగా ఉండటం... ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో మరోసారి ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు జరిగే చివరి పోరాటంలో గెలిచిన జట్టు సిరీస్‌ను ఎగరేసుకుపోతుంది. ముంబై: మూడు రోజుల క్రితం నాలుగో వన్డేకు ముందు భారత జట్టు పరిస్థితి అయోమయంగా ఉంది. ఏ బ్యాట్స్‌మన్ ఎక్కడ ఆడతాడో తెలియదు... ఎవరు విఫలమవుతారో అర్థం కాదు... బౌలింగ్ విభాగం ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాట్స్‌మెన్ పరిస్థితి అగమ్యగోచరం. అలాంటి సమయంలో చెన్నైలో బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై అందరూ సమష్టిగా రాణించి 299 పరుగులు చేశారు. దీంతో ఒక్కసారిగా జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే జోరును కొనసాగిస్తే ఆఖరి వన్డేలోనూ గెలిచి దక్షిణాఫ్రికాపై సిరీస్‌ను కైవసం చేసుకోవడం కష్టం కాదు. అటు దక్షిణాఫ్రికా జట్టు గాయాల కారణంగా, ఫామ్‌లేమితో బాధపడుతున్న ఆటగాళ్ల కారణంగా కాస్త ఇబ్బందుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే నేడు వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. అదే జోరు కొనసాగాలి నాలుగో వన్డేలో అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిన భార త్... ఐదో వన్డేలో అదే జోరుతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఇన్నాళ్లూ ఆందోళన కలిగించిన రైనా కూడా చెన్నైలో నిలకడగా ఆడటం ధోని సేనకు ఊరట. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లూ నిలకడగా రాణిస్తున్నందున మరోసారి అదే ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది. భువనేశ్వర్ కూడా తుది జట్టులో ఉంటాడు. వాంఖడే పిచ్ స్వభావం దృష్ట్యా మోహిత్ స్థానంలో శ్రీనాథ్ అరవింద్ జట్టులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిల్లర్, ఆమ్లాలే సమస్య దక్షిణాఫ్రికా జట్టుకు ఈ సిరీస్‌లో బ్యాటింగ్ విభాగంలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. కీలక ఆటగాడు ఆమ్లాతో పాటు డేవిడ్ మిల్లర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఆమ్లా నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 66 పరుగులు మాత్రమే చేశాడు. దీనికి తోడు జేపీ డుమిని గాయం కారణంగా మధ్యలో తప్పుకోవడంతో జట్టులో సమతుల్యం దెబ్బతింది. డుమిని ఉంటే ఏడుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాల్సి వస్తోంది. డికాక్, డు ప్లెసిస్, బెహర్దీన్ ఫర్వాలేదనేలా ఆడారు. ఇక కెప్టెన్ డివిలియర్స్ సిరీస్‌లో రెండు సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మిల్లర్ ఫామ్‌లో లేనందున అతని స్థానంలో ఎల్గర్‌ని ఆడించే ప్రతిపాదన కూడా ఉంది. ఎల్గర్ పార్ట్‌టైమ్ బౌలర్‌గానూ పనికొస్తాడు. అయితే కీలకమైన పేసర్ మోర్నీ మోర్కెల్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో చివరి వన్డేలోనూ అతను ఆడటం సందేహమే. మొత్తం మీద సఫారీలు కూడా సమస్యల్లోనే ఉన్నారు. పిచ్, వాతావరణం వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. వర్ష సూచన లేదు. వేడి ఎక్కువగా ఉండొచ్చు. మంచు ప్రభావం కూడా పెద్దగా ఉండదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఆడటం నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని, బౌలర్లపై ఎదురుదాడి చేయొచ్చు. సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్లకు ప్రత్యర్థుల గురించి పూర్తి అవగాహన వచ్చింది. శిఖర్ ధావన్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. -కోహ్లి డుమిని, మోర్కెల్‌ల గాయాలు మమ్మల్ని ఇబ్బందుల్లో పడేశాయి. మిగిలిన ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది. పరుగులు చేయలేకపోవడం నాకూ అసంతృప్తిగానే ఉంది. ఒక్కసారి కుదురుకుంటే జట్టుకు విజయాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడగలను. - ఆమ్లా 17 ఇప్పటి వరకూ భారత్‌లో దక్షిణాఫ్రికా నాలుగు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడింది. మూడింట్లో భారత్ గెలిస్తే, ఒకటి డ్రాగా ముగిసింది. 3 వాంఖడేలో గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, సురేశ్ రైనా, అక్షర్ పటేల్, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్, మోహిత్ శర్మ/అరవింద్. దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డికాక్, డు ప్లెసిస్, ఎల్గర్ / మిల్లర్, బెహర్దీన్, స్టెయిన్, రబడ, మోరిస్, ఫాంగిసో, తాహిర్. -
ఇద్దరూ ఇద్దరే...
వాళ్లిద్దరూ ఆ రెండు జట్లకు వెన్నెముకలాంటి వాళ్లు. ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఒకరు నెమ్మదిగా ‘క్లాసికల్’ తరహాలో తమ ఆటతీరుతో అలరిస్తే... మరొకరు ‘రాక్‌స్టార్’లా చిందేయిస్తాడు. దాదాపుగా ఒకేసారి వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కెరీర్ పోటాపోటీగా సాగుతోంది. ఒకరి రికార్డును మరొకరు అధిగమిస్తూ పోటీలు పడి పరుగుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రస్తుత క్రికెట్లో నిలకడకు మారుపేరుగా మారారు. ఈసారి గాంధీ-మండేలా సిరీస్‌లోనూ ఈ ఇద్దరే కీలకం. * పోటాపోటీగా సాగుతున్న కోహ్లి, ఆమ్లాల కెరీర్ * గాంధీ-మండేలా సిరీస్‌లోనూ ఈ ఇద్దరే కీలకం సాక్షి క్రీడావిభాగం: ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల పేర్లు చెప్పమంటే ఎవరైనా ముందుగా కోహ్లి, ఆమ్లాల పేర్లు చెప్పాల్సిందే. ఈ ఇద్దరూ తమ జట్లకు ఎన్నో సంచలన విజయాలు అందించారు. 50కి పైగా సగటుతో పరుగులు చేయడం, తరచూ సెంచరీలు సాధించడం, చిరస్మరణీయ విజయాలు అందించడం ద్వారా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే దక్షిణాఫ్రికా జట్టు ఆడుతుందంటే అటు అభిమానుల దృష్టి, ఇటు ప్రత్యర్థుల లక్ష్యం ఆమ్లానే. అలాగే భారత్ తరఫున కోహ్లిది కూడా అదే పాత్ర. అతను ఒక్కసారి కుదురుకుని ఆడాడంటే పరుగుల ప్రవాహమే. ఈసారి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్‌కు బాగా క్రేజ్ పెరిగింది. జాతీయ నేతల పేర్లతో సిరీస్ ఏర్పాటు కావడం, ఇటీవల కాలంలో రెండు జట్లు కూడా బలమైన ప్రత్యర్థులతో ఆడకపోవడం వల్ల ఈ సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సహజంగానే ఈ సిరీస్ సందర్భంగా కోహ్లి, ఆమ్లాల గురించి చర్చ మొదలైంది. ఇద్దరి ఆటశైలి భిన్నం... దక్షిణాఫ్రికా స్టార్ ఆమ్లా ఆటతీరు పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. క్రికెట్ పుస్తకాల్లో ఉండే షాట్లు ఆడి చూపిస్తాడు. అధికంగా ప్రయోగాలు చేయడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ పరుగులు సాధిస్తాడు. అతను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఇక అవుట్ చేయడం చాలా కష్టం. అన్ని ఫార్మాట్లలో కలిపి 13 వేలకు పైగా పరుగులు చేసినా... ఇప్పటివరకూ కెరీర్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 56 మాత్రమే. అటు కోహ్లి ఆట దీనికి భిన్నం. షాట్లలో ప్రయోగాలు చేయడానికి వెనుకాడడు. అదే విధంగా బలమైన షాట్లతో బౌండరీలు, సిక్సర్లతో పరుగులు సాధిస్తాడు. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేలకుపైగా పరుగులు చేస్తే అందులో 91 సిక్సర్లు ఉన్నాయి. ఆమ్లా కెరీర్ అంతటా టాప్ ఆర్డర్‌లోనే ఆడాడు. కోహ్లి మాత్రం ఫార్మాట్‌ను బట్టి టాప్ ఆర్డర్‌తో పాటు మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్లోనూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. నిలకడ విషయంలో ఇద్దరూ సమానంగా ఉన్నా... ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విరాట్ కోహ్లి ముందుంటాడు. ఆమ్లానే సీనియర్... ఇద్దరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి ముందుగా వచ్చింది మాత్రం ఆమ్లానే. 2004లో భారత్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు ద్వారా ఆమ్లా అరంగేట్రం చేశాడు. టెస్టు స్పెషలిస్ట్‌గా జట్టులోకి వచ్చిన అతను... వన్డేల్లో 2008లో అరంగేట్రం చేశాడు. దీనికి భిన్నంగా కోహ్లి తొలుత 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసి ... మూడేళ్ల తర్వాత 2011లో టెస్టు జట్టులో స్థానం సంపాదించగలిగాడు. ఇద్దరూ వన్డేల్లో ఒకే ఏడాది అరంగేట్రం చేసినా కోహ్లి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడేళ్ల కాలంలో భారత్ ఎక్కువగా వన్డేలు ఆడటం వల్ల సహజంగానే కోహ్లి ఇందులో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఇద్దరి కెరీర్ అప్పటి నుంచి కూడా పోటాపోటీగానే సాగుతోంది. కోహ్లి 22 సెంచరీలు చేస్తే... ఆమ్లా 21 శతకాలు కొట్టాడు. కోహ్లి అనేక రికార్డులు సాధించాడు. అయితే వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి కోహ్లి ఘనతలన్నింటినీ ఆమ్లా అధిగమిస్తూ వస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ... ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో అనేక మంది క్రికెటర్లు ఏదో ఒక ఫార్మాట్‌కు లేదా రెండు ఫార్మాట్లకు పరిమితమవుతున్నారు. ప్రతి జట్టులోనూ అన్ని రకాల ఫార్మాట్లలో ఆడే నైపుణ్యం ఉన్న క్రికెటర్ల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ ఇద్దరూ మాత్రం మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అలాగే తమ తమ టెస్టు జట్లకు ఈ ఇద్దరూ ప్రస్తుతం కెప్టెన్లు. ఆమ్లా వయసు 33 ఏళ్లు. కోహ్లి తనకంటే ఆరేళ్లు చిన్నోడు. కాబట్టి ఆమ్లాతో పోలిస్తే విరాట్ ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగుతాడు. కాబట్టి భవిష్యత్తులో ఆమ్లా కంటే కోహ్లి ఎక్కువ రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. అయితే ఆమ్లా రిటైరయ్యే వరకు మాత్రం కోహ్లికి గట్టి పోటీయే ఉంటుంది. ఎందుకు కీలకమంటే... ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు క్రికెటర్లు తమ జట్లకు ప్రధాన బలం. దక్షిణాఫ్రికా జట్టు ఒకప్పుడు స్పిన్ ఆడటానికి చాలా ఇబ్బంది పడేది. ముఖ్యంగా ఉపఖండం పిచ్‌లపై స్పిన్నర్లు ఆ జట్టును కకావికలు చేసేవారు. ఆమ్లా రంగప్రవేశం తర్వాత ఈ పరిస్థితి మారింది. మిగిలిన క్రికెటర్లు కూడా స్పిన్ ఆడటంలో మెరుగుపడ్డా... ఆమ్లా మాత్రం స్పిన్నర్లకు గోడలా నిలబడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఇన్నింగ్స్‌కు యాంకర్ పాత్ర పోషించే ఆమ్లా... ప్రస్తుత సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు కీలకం. ఇక కోహ్లి విషయానికొస్తే స్వదేశంలో అతను తిరుగులేని క్రికెటర్. వన్డేల్లో అతను చేసిన 22 సెంచరీల్లో 14 భారత్, బంగ్లాదేశ్‌లలో చేసినవే. మందకొడి పిచ్‌ల మీద విరాట్ జోరుకు ఈ గణాంకాలు నిదర్శనం. దక్షిణాఫ్రికా జట్టులో ఇమ్రాన్ తాహిర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ ఉన్నా... స్టెయిన్ నేతృత్వంలోని పేసర్లు కూడా చాలా కీలకం. కొత్త బంతితో బౌన్స్‌ను, పాత బంతితో రివర్స్ స్వింగ్నూ రాబడతారు. ఈ రెండింటిని ఎదుర్కొనే సత్తా కోహ్లిలో ఉంది. ఇటీవల కాలంలో ఒకట్రెండు ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే ఏడాది కాలంగా కోహ్లి ఆటతీరు అతని స్థాయికి తగ్గట్లుగా లేదు. మళ్లీ దక్షిణాఫ్రికాతో సిరీస్ ద్వారా తన ముద్రను చూపించాలని విరాట్ పట్టుదలతో ఉన్నాడు. -
గాంధీ - మండేలా సిరీస్
-
గాంధీ-మండేలా సిరీస్!
జొహన్నెస్‌బర్గ్: అంతా అనుకున్నట్లు జరిగితే మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని త్వరలోనే చూడొచ్చు. ఇకపై భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్‌కు ఈ మహాత్ముల పేర్లతో ట్రోఫీని ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) భావిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా జట్టు భారత్ వచ్చి నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత 2018లో భారత జట్టు అక్కడికి వెళ్లి నాలుగు టెస్టులు ఆడుతుంది. ‘రెండు జట్ల మధ్య సిరీస్‌కు ఆ మహాత్ముల పేర్లతో ట్రోఫీ ఏర్పాటు చేయాలనే ఆలోచన భారత్ నుంచి వచ్చింది. మేం కూడా సంతోషంగా అంగీకరించాం. అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది’ అని సీఎస్ఏ సీఈ లోర్గాట్ చెప్పారు.