అఖరి పోరాటం
భారత్, దక్షిణాఫ్రికాల ఐదో వన్డే నేడు
సిరీస్ గెలవాలంటే ఇద్దరికీ విజయం అవసరం
మార్పుల్లేకుండానే బరిలోకి భారత్
మ. గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
గాంధీ-మండేలా సిరీస్‌లో వన్డే మ్యాచ్‌లు ఇప్పటి వరకూ అంచనాలకు తగ్గట్లుగానే జరిగాయి. ఇరు జట్లు చెరో రెండు వన్డేలు గెలిచి సిరీస్ ఫలితం విషయంలో ఉత్కంఠను పెంచాయి. బలాబలాల పరంగా రెండు జట్లూ సమానంగా ఉండటం... ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో మరోసారి ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు జరిగే చివరి పోరాటంలో గెలిచిన జట్టు సిరీస్‌ను ఎగరేసుకుపోతుంది.
ముంబై: మూడు రోజుల క్రితం నాలుగో వన్డేకు ముందు భారత జట్టు పరిస్థితి అయోమయంగా ఉంది. ఏ బ్యాట్స్‌మన్ ఎక్కడ ఆడతాడో తెలియదు... ఎవరు విఫలమవుతారో అర్థం కాదు... బౌలింగ్ విభాగం ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాట్స్‌మెన్ పరిస్థితి అగమ్యగోచరం. అలాంటి సమయంలో చెన్నైలో బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై అందరూ సమష్టిగా రాణించి 299 పరుగులు చేశారు. దీంతో ఒక్కసారిగా జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే జోరును కొనసాగిస్తే ఆఖరి వన్డేలోనూ గెలిచి దక్షిణాఫ్రికాపై సిరీస్‌ను కైవసం చేసుకోవడం కష్టం కాదు. అటు దక్షిణాఫ్రికా జట్టు గాయాల కారణంగా, ఫామ్‌లేమితో బాధపడుతున్న ఆటగాళ్ల కారణంగా కాస్త ఇబ్బందుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే నేడు వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.
అదే జోరు కొనసాగాలి
నాలుగో వన్డేలో అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిన భార త్... ఐదో వన్డేలో అదే జోరుతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఇన్నాళ్లూ ఆందోళన కలిగించిన రైనా కూడా చెన్నైలో నిలకడగా ఆడటం ధోని సేనకు ఊరట. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లూ నిలకడగా రాణిస్తున్నందున మరోసారి అదే ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది. భువనేశ్వర్ కూడా తుది జట్టులో ఉంటాడు. వాంఖడే పిచ్ స్వభావం దృష్ట్యా మోహిత్ స్థానంలో శ్రీనాథ్ అరవింద్ జట్టులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మిల్లర్, ఆమ్లాలే సమస్య
దక్షిణాఫ్రికా జట్టుకు ఈ సిరీస్‌లో బ్యాటింగ్ విభాగంలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. కీలక ఆటగాడు ఆమ్లాతో పాటు డేవిడ్ మిల్లర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఆమ్లా నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 66 పరుగులు మాత్రమే చేశాడు. దీనికి తోడు జేపీ డుమిని గాయం కారణంగా మధ్యలో తప్పుకోవడంతో జట్టులో సమతుల్యం దెబ్బతింది. డుమిని ఉంటే ఏడుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాల్సి వస్తోంది. డికాక్, డు ప్లెసిస్, బెహర్దీన్ ఫర్వాలేదనేలా ఆడారు. ఇక కెప్టెన్ డివిలియర్స్ సిరీస్‌లో రెండు సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మిల్లర్ ఫామ్‌లో లేనందున అతని స్థానంలో ఎల్గర్‌ని ఆడించే ప్రతిపాదన కూడా ఉంది. ఎల్గర్ పార్ట్‌టైమ్ బౌలర్‌గానూ పనికొస్తాడు. అయితే కీలకమైన పేసర్ మోర్నీ మోర్కెల్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో చివరి వన్డేలోనూ అతను ఆడటం సందేహమే. మొత్తం మీద సఫారీలు కూడా సమస్యల్లోనే ఉన్నారు.
పిచ్, వాతావరణం
వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. వర్ష సూచన లేదు. వేడి ఎక్కువగా ఉండొచ్చు. మంచు ప్రభావం కూడా పెద్దగా ఉండదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
మూడో స్థానంలో ఆడటం నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని, బౌలర్లపై ఎదురుదాడి చేయొచ్చు. సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్లకు ప్రత్యర్థుల గురించి పూర్తి అవగాహన వచ్చింది. శిఖర్ ధావన్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. -కోహ్లి
డుమిని, మోర్కెల్‌ల గాయాలు మమ్మల్ని ఇబ్బందుల్లో పడేశాయి. మిగిలిన ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది. పరుగులు చేయలేకపోవడం నాకూ అసంతృప్తిగానే ఉంది. ఒక్కసారి కుదురుకుంటే జట్టుకు విజయాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడగలను. - ఆమ్లా
17 ఇప్పటి వరకూ భారత్‌లో దక్షిణాఫ్రికా నాలుగు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడింది. మూడింట్లో భారత్ గెలిస్తే, ఒకటి డ్రాగా ముగిసింది.
3 వాంఖడేలో గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది.
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, సురేశ్ రైనా, అక్షర్ పటేల్, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్, మోహిత్ శర్మ/అరవింద్.
దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డికాక్, డు ప్లెసిస్, ఎల్గర్ / మిల్లర్, బెహర్దీన్, స్టెయిన్, రబడ, మోరిస్, ఫాంగిసో, తాహిర్.