
జైలు ‘ఊచలు’ విరిచి...
ఫ్రీడం సిరీస్ ట్రోఫీ తయారీ!
పుణే: ‘మీ జైలు ఊచలు మాకో రెండివ్వండి. దాంతో క్రికెట్ సిరీస్ ట్రోఫీ తయారు చేసుకుంటాం’... సరిగ్గా ఇలాగే కాకపోయినా బీసీసీఐ దాదాపు ఇదే తరహాలో పోలీస్ అధికారులను కోరింది. వివరాల్లోకెళితే... గాంధీ-మండేలా సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ విజేతకు ‘ఫ్రీడం ట్రోఫీ’ని అందజేస్తారు. అయితే ఈ ట్రోఫీని ప్రత్యేకంగా రూపొందించాలని బీసీసీఐ భావించింది.
స్వాతంత్య్రోద్యమం సందర్భంగా గాంధీ బందీ అయిన ఎరవాడ జైలునుంచి, తన పోరాట సమయంలో మండేలా ఉన్న రాబిన్ ఐలాండ్ జైలునుంచి ఊచలను తెచ్చి తయారు చేయాలని బోర్డు నిర్ణయించింది. వారిద్దరు నివసించిన గదుల కొన్ని ఊచలను ఒక చోటికి చేర్చి ‘ఫ్రీడం ట్రోఫీ’కి మెరుగులు దిద్దాలనేది ప్రతిపాదన. దాంతో ఈ విషయాన్ని చెబుతూ తమకు రెండు ఊచలు ఇప్పించాల్సిందిగా బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్వయంగా పుణేలోని జైళ్ల డీజీకి లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ వద్ద ఉంది.