వినాయక బకెట్ చాలెంజ్
ఈసారి ఆగస్టులోనే శిశిరం వచ్చేసింది. చవితి వినాయకుడి పూజకు పత్రి కోసం కొమ్మలు, రెమ్మలు కోసేస్తాం కదా.. బోసిపోయిన కొమ్మలు శిశిరాన్ని తలపిస్తూ.. ఆ మోదకప్రియుడికి స్వాగతం పలుకుతాయి. సెప్టెంబర్‌లో చెరువులు కొత్తగా కనిపిస్తాయి. వినాయక పందిళ్లు.. సందళ్లు.. ఉండ్రాళ్లు.. ఊరేగింపులు.. ఆరగింపులు.. అన్నీ కలగలసిన వినాయక చవితికి స్వాగతం.
నాకప్పుడు పదేళ్లు ఉంటాయేమో. గణేశ్ నిమజ్జనం ఊరేగింపు చూడ్డానికి అమీర్‌పేట సెంటర్లో నా చిట్టి గణపతిని పట్టుకుని నిల్చున్నా. రకరకాల ఆకారాల చిన్నా పెద్దా గణ నాథుల విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు తరలి వెళ్తున్నాయి. వాటి వెనకాలే మా బావతో కలసి నేనూ బయల్దేరా. క్రేన్ల సహాయంతో హుస్సేన్‌సాగర్‌లో భారంగా మునకేస్తున్న పెద్ద వినాయకుల విగ్రహాలను చూస్తే బాధనిపించింది. నా పొట్టి గణపయ్యను ట్యాంక్‌బండ్ పైనుంచి లోనికి విసరాలంటే మనసొప్పలేదు. నేను అలా వెయ్యనని భీష్మించా. చేసేది లేక మా చిన్నబావ నన్ను సంజీవయ్య పార్క్ దగ్గరకు తీసుకెళ్లాడు. మెల్లగా, మర్యాదగా నిమజ్జనం చేయాలని ముందుకెళ్తే ఒకటే దుర్వాసన.. ఆ కంపు నేనే భరించలేకపోయా.. వాటిలో నా గణేశుడు ఎలా ఉండగలడని.. ఇంటికి తెచ్చేశా. అప్పటి నా చిట్టిబుర్రకి అంతే తోచింది మరి. పెద్దయ్యాక కూడా వినాయక చవితి చుట్టూ అల్లుకున్న బిజినెస్ నాకిప్పటికీ అర్థం కాదు.
నేటివిటీని కోల్పోతున్నాం...
వినాయక ప్రతిమలు రూపాయికి అచ్చుపోసి ఇచ్చే అంగళ్లు కనుమరుగైపోయాయి. ప్యారిస్‌లో పుట్టిన ప్లాస్టర్ ఉచ్చులో మహాకాయుడు బిగుసుకుపోయాడు. గౌరీతనయుడ్ని ఆయనకు సంబంధంలేని కథల్లో.. ఇతివృత్తాల్లో.. అవతారాల్లో ఇరికించేస్తున్నాం.. ఇదే క్రియేటివిటీ.. మట్టి విగ్రహం అందంగా కనబడదేమోనని.. సీజన్‌కో రంగుతో బొమ్మలను తీర్చిదిద్దుతున్నాం. ఈసారి నియాన్ ఫ్యాషన్‌లో విఘ్నేశ్వరుడు జిగేల్మంటాడేమో చూడాలి. ఇదే వెరైటీ. క్రియేటివిటీ, వెరైటీల మధ్య నేటివిటీ కోల్పోతున్నాం. పూజ కోసం పత్రి కోసుకురావడం మరచిపోయాం. మూడు రోజులకే మనింటి వినాయకుడిని పందిట్లో అప్పగించి నిమజ్జనం శ్రమ నుంచి తప్పించుకుంటున్నాం. ఇక పందిళ్ల దగ్గర సందడి సరేసరి. కిందటేడు కంటే ఈసారి విగ్రహం ఎత్తు ఒక్కడుగైనా పెంచాలనే ఆచారం పాకిన తర్వాత.. ఆ ఆరాటంలో మనం కొని తెచ్చుకుంటున్న ముప్పు గమనించడం ఎప్పుడో మానేశాం.
మట్టితోనూ సమస్యలు రావొచ్చు...
ఇక నిమజ్జనోత్సవం అంటే జీహెచ్ఎంసీకి పెద్ద కసరత్తు. భారీ ఉరేగింపు సిటీ పోలీస్‌కు పెద్ద సవాలు. ఇవన్నీ నిమజ్జనం పూర్తయ్యే వరకే అనుకుంటే పొరపాటే. అనంతరం ప్రక్షాళ న మరో భారీ కార్య క్రమం. విగ్రహాలు నీట మునగక ముందే విగ్రహాలను తొలగించే ప్రక్రియ మొదలవుతుంది. పెద్ద విగ్రహాలు బయటపడతాయి. కానీ.. చిన్న ప్రతిమలే నీటి అడుగుకు చేరుకుని కరిగిపోతాయి. వాటికి వేసే రంగుల్లో క్యాడ్మియమ్, లెడ్ వంటి రసాయనాలు నీళ్లను కలుషితం చేస్తాయి. మన ఇళ్ల నుంచి వెళ్తున్నవి చిన్న ప్రతిమలే కావొచ్చు.. సంఖ్యాపరంగా భారీగా ఉండటంతో మనమూ కాలుష్య కారకులం అవుతున్నాం. ఈ మధ్య కాలంలో మట్టి వినాయకుడిపై అవగాహన బాగా పెరిగింది. అయితే పెరిగిన ఈ విగ్రహాల నిమజ్జనం వల్ల మరో ప్రమాదం పొంచి ఉంది. కెమికల్ కాలుష్యం తగ్గినా.. మట్టి అధికంగా చెరువుల్లో చేరితే కొత్త సమస్యలు రావొచ్చు. ఈ మట్టి పేరుకుని చెరువులో నీరు ఇంకకపోవడం, ఊట చెరువైతే ఊట రాకపోవడం లాంటి ప్రమాదాలున్నాయి.
పత్రి ప్రాజెక్టుకు శ్రీకారం చుడదాం...
పుణ్యం కోసం వెళ్లి పాపం మూటగట్టుకోవడం ఏంటని భావిస్తే.. మనమందరం ఓ చిన్న ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడదాం. ఈ పాటికే చాలామంది మట్టి గణపతులకు మారిపోవడం శుభ పరిణామం. సహజ రంగుల్లో రూపుదిద్దుకున్న మట్టి విగ్రహాన్ని తీసుకోండి. మీరే తయారు చేస్తే మరీ మంచిది. స్వయంగా వెళ్లి ఆకులు తెచ్చుకోండి. కనీసం మార్కెట్లో పత్రిగా కట్టగట్టి ఇస్తున్న ఆకుల్లో కావాల్సినవి ఉన్నాయో లేదో సరి చూసుకోండి. వాటిలో తులసి, మామిడి, మారేడు, నేరేడు, దవనం, మరువం, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, విష్ణుకాంతం, దేవకాంచన, దానిమ్మ, దేవదారు, వావిలి, గన్నేరు, జాజి, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు.. ఇవే అవి. వీటిలో మీరెన్ని గుర్తించగలరో చూడండి..? పిల్లలతో కలసి ఈ ప్రాజెక్ట్ చేయండి.. పండుగ సందడే సందడి.
బకెట్ నిమజ్జనం చాలెంజ్...
చివరిగా వెబ్ ప్రపంచంలో దుమారం రేపుతున్న ఐస్ బకెట్ చాలెంజ్లా మనమూ ఓ కొత్త చాలెంజ్ ప్రారంభిద్దాం. మన ఇంట్లో పూజించిన గణపతిని మన వాకిట్లోనే శాస్త్రోక్తంగా ఓ బకెట్ నీటిలో నిమజ్జనం చేద్దాం. ఒక గంటలో విగ్రహం కరిగిపోతే ఆ నీటిని మొక్కలకు పోసి అడుగున ఉన్న మట్టిని తులసి కోటలోనో.. పూల మొక్కల్లోనో వేసుకుందాం. మన చిట్టి గణపతి మనతోనే మనకు తోడుగా ఉంటాడు. ఈ బకెట్ నిమజ్జనం ఫొటోని కానీ వీడియో కానీ ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో అప్లోడ్ చేయండి. మరెందరికో స్ఫూర్తిని చాటండి. బకెట్ నిమజ్జనంతో మన చెరువులను కాపాడుకునే ఉద్యమం చేద్దాం రండి.