Ganesh councils
-
జై బోలో గణేశ్ మహారాజ్‌కీ..
దాదర్, న్యూస్‌లైన్ : నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకొంటున్నారు. వినాయకుడి విగ్రాహాల వద్ద ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వీధులన్నీ జైబోలో గణేష్ నామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ప్రజలను వివిధ సామాజిక అంశాలపై కూడా ప్రజలను చైతన్యం చేస్తున్నాయి. గణేష్ మండళ్లు ప్రత్యేక చొరవ తీసుకొని వివిధ అంశాలపై పోస్టర్లు, మ్యానిక్వీన్లు, లైట్ అండ్ సౌండ్ షోలను ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు. పెద్దలను ఎలా గౌరవించాలి, వృద్ధులైన తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోంలకు తరలించ కూడదు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సెల్ ఫోన్, సెల్ టవర్లపట్ల పొంచి ఉన్న ప్రమాదాన్నికూడా షోల ద్వారా తెలియజేస్తున్నారు. వినూత్న సెట్టింగ్‌లు కేత్వాడి ఖమ్బాతా లేన్ సార్వజనిక్ గణేషోత్సవ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేయడానికి 20 అడుగుల గణేష్ విగ్రహాన్ని పచ్చని చెట్టుపై ఉండేలా వినూత్నంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల జరిగే అనర్థాలపై 6 నిమిషాల పాటు భక్తులకు కళ్లకు కట్టినట్లు ఆడియో విజువల్స్ ద్వారా లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. మిమిక్రీ కళాకారుడు ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను ఆయా మండళ్లు ఏర్పాటు చేశాయి. శివ్డి మధ్య విభాగ్ గణపతి సార్వజనిక్ గణేషోత్సవ్ మండలి ఆధ్వరం్యలో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా కలిగే అనర్థాలను ప్రదర్శనల ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. యువతను వీటి వల్ల అప్రమత్తం చేస్తున్నామని మండలి సభ్యులు పేర్కొన్నారు. సెల్ టవర్ల ద్వారా కూడా ముప్పు పొంచి ఉన్నదనే అంశాన్ని తెలియజేస్తున్నామన్నారు. అవినీతి, వరకట్న దురాచారంపై అంధేరీకి చెందిన ఈశ్వర్ తరూణ్ మిత్ర మండలి వారు అవినీతికి , వరకట్నం దురాచారానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బాల్ గోపాల్ మిత్ర మండలి వారు వృద్ధులైన తమ తల్లిదండ్రులను చూసుకోవాలని వారిని ఆశ్రమాలకు పంపకూడదని సూచిస్తున్నారు. పౌరాణిక పాత్రలైన శ్రావణ్ బాల్, రాముడు, భక్త పుండరీకుడు ఇంకా తదితరులనూ స్ఫూర్తిగా తీసుకోవాలిని తెలియజేస్తున్నారు. ఫైబర్‌తో తయారు చేసిన విగ్రహాల ద్వారా పెద్దలను ఎలా గౌరవించాలన్న అంశాన్ని చాటి చెబుతున్నారు. డోంబివలిలో ..... ముంబై శివారు ప్రాంతమైన డోంబివలి పట్టణంలో గణపతి ఉత్సవాలు జోరందుకున్నాయి. పలు యువ సేవా మండళ్లు గణపయ్య విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి భక్తులకు కనువిందు కలిగిస్తున్నారు. ఒకటిన్నర రోజు, ఐదు రోజుల గణపతి నిమజ్జనం చేశారు. పట్టణంలోని మండళ్లలో ఏర్పాటు చేసిన స్వామివారి సందర్శనార్థం భక్తుల తరలివస్తున్నారు. డోంబివలిలోని సాయినాథ్ మిత్రమడల్, అచానక్ సార్వజనీక మిత్ర మండల్, ఆటో రిక్షా చాలక్ సంఘటన, యువ మిత్ర మండలి తదితర యువసేన మండళ్లు ప్రతి రోజు స్వామివారికి నిత్య పూజల నిర్వహిస్తున్నారు. సందర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని మండళ్లు భక్తి సంగీత భజనలు, నృత్య పోటీలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక అవతారాలతో కొలువుదీరిన గణపయ్యను కనులారా తిలకించి భక్తులు పులకించిపోతున్నారు. -
ఎన్నికలొస్తే డబ్బులు రావు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సెప్టెంబరు లో లేదా అక్టోబరులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల సంఘం సూచనాప్రాయంగా ప్రకటించింది. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) వచ్చే వారంలో ఎప్పుడైనా అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లపై ఎన్నికల కోడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉత్సవాల సమయంలో మండళ్లు వెచ్చించే ఖర్చులో 35-40 శాతం నిధులు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఈ నిధులకు పూర్తిగా కళ్లెం పడనుంది. నగరంలో సుమారు 11 వేల సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయి. నిధులు ఆగిపోవడం వల్ల వీరి ఆర్థిక అంచనాలు పూర్తిగా తారుమారయ్యే ప్రమాదం ఉంది. విగ్రహం ప్రతిష్ఠించే వేదిక మొదలుకుని వివిధ అలంకరణ పనులకు అయ్యే వ్యయాన్ని కొన్ని రాజకీయ పార్టీలే భరిస్తాయి. సోమవారం తరువాత ఎన్నికల కోడ్ ఎప్పుడైన అమలులోకి వచ్చే సూచనలున్నాయి. తదనంతరం వెచ్చించే డబ్బును ఎన్నికల ఖర్చులో చూపించాల్సి ఉంటుంది. దీంతో రాజకీయ నాయకులు సార్వజని క గణేశ్ ఉత్సవ మండళ్లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు టికెట్ల కోసం పార్టీ కార్యాలయాలు, నాయకుల చుట్టూ తిరుగుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు. తమ శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నాయకులకు మండళ్లపై దృష్టి సారించేందుకు తగినంత సమయం దొరకడం లేదు. సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు తమ పరిధిలోని నివాసాలు, దుకాణాల నుంచి సేకరించిన విరాళాలు ఎటూ సరి పోవు. ఈ మండళ్లకు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తాయి. వీరికి కావల్సిన నిధులు స్థానిక నాయకుల నుంచి అందుతాయి. ఈసారి ఉత్సవాలకు ముందు శాసనసభ ఎన్నికల కోడ్ అమలయ్యే సూచనలు ఉండడంతో ఇరకాటంలో పడిపోయా రు. ఉత్సవాల సమయంలో ఈ భారీ వ్యయాన్ని భరించేందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీ ముందుకు రాకపోవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్దపెద్ద మండళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి కార్పొరేటర్ సంస్థలు, విద్యాసంస్థలు, వ్యాపార, పారిశ్రామిక వేత్తల నుంచి విరాళాలు సేకరిస్తాయి. చిన్న చిన్న మండళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఈ ఎన్నికలు వీటికి శాపంగా పరిణమించాయి. వీరిపైన ఆశలు పెట్టుకున్న ఈ మండళ్ల ఆర్థిక అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇప్పటికే కొందరు నాయకులు మండళ్ల ఎదుట ప్రవేశద్వారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఈసారి రద్దు చేసుకున్నారు. గణేశ్ ఉత్సవాల తరువాత ఎన్నికల కోడ్ అమలుచేయాలని గతంలోనే బృహన్ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్ల నిర్వాహకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి కూడా చేశారు. సెప్టెంబరు, అక్టోబరు లేదా నవంబరులో మహా రాష్ట్ర, హర్యానా, జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రెండు విడతల్లో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచి స్తోంది. ఆ మేరకు మహారాష్ట్రలో సెప్టెంబరు లేదా అక్టోబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. దీంతో సార్వజనిక మండళ్లుచేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. తగినన్ని నిధులు లేక ఉత్సవాలు ఘనంగా ఎలా నిర్వహించేదని మండళ్ల పదాధికారులు ఆందోళనలో పడిపోయారు. ఇక రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీజేపీ త్వరలో తొలి జాబి తా విడుదల చేయాలని భావిస్తోంది. ఎన్సీపీ- కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేన, ఎమ్మెన్నెస్ కూడా ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.