సాక్షి, ముంబై: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సెప్టెంబరు లో లేదా అక్టోబరులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల సంఘం సూచనాప్రాయంగా ప్రకటించింది. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) వచ్చే వారంలో ఎప్పుడైనా అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లపై ఎన్నికల కోడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉత్సవాల సమయంలో మండళ్లు వెచ్చించే ఖర్చులో 35-40 శాతం నిధులు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తాయి.
ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఈ నిధులకు పూర్తిగా కళ్లెం పడనుంది. నగరంలో సుమారు 11 వేల సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయి. నిధులు ఆగిపోవడం వల్ల వీరి ఆర్థిక అంచనాలు పూర్తిగా తారుమారయ్యే ప్రమాదం ఉంది. విగ్రహం ప్రతిష్ఠించే వేదిక మొదలుకుని వివిధ అలంకరణ పనులకు అయ్యే వ్యయాన్ని కొన్ని రాజకీయ పార్టీలే భరిస్తాయి. సోమవారం తరువాత ఎన్నికల కోడ్ ఎప్పుడైన అమలులోకి వచ్చే సూచనలున్నాయి. తదనంతరం వెచ్చించే డబ్బును ఎన్నికల ఖర్చులో చూపించాల్సి ఉంటుంది. దీంతో రాజకీయ నాయకులు సార్వజని క గణేశ్ ఉత్సవ మండళ్లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోపక్క శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు టికెట్ల కోసం పార్టీ కార్యాలయాలు, నాయకుల చుట్టూ తిరుగుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు. తమ శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నాయకులకు మండళ్లపై దృష్టి సారించేందుకు తగినంత సమయం దొరకడం లేదు. సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు తమ పరిధిలోని నివాసాలు, దుకాణాల నుంచి సేకరించిన విరాళాలు ఎటూ సరి పోవు. ఈ మండళ్లకు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తాయి. వీరికి కావల్సిన నిధులు స్థానిక నాయకుల నుంచి అందుతాయి.
ఈసారి ఉత్సవాలకు ముందు శాసనసభ ఎన్నికల కోడ్ అమలయ్యే సూచనలు ఉండడంతో ఇరకాటంలో పడిపోయా రు. ఉత్సవాల సమయంలో ఈ భారీ వ్యయాన్ని భరించేందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీ ముందుకు రాకపోవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్దపెద్ద మండళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి కార్పొరేటర్ సంస్థలు, విద్యాసంస్థలు, వ్యాపార, పారిశ్రామిక వేత్తల నుంచి విరాళాలు సేకరిస్తాయి.
చిన్న చిన్న మండళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఈ ఎన్నికలు వీటికి శాపంగా పరిణమించాయి. వీరిపైన ఆశలు పెట్టుకున్న ఈ మండళ్ల ఆర్థిక అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇప్పటికే కొందరు నాయకులు మండళ్ల ఎదుట ప్రవేశద్వారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఈసారి రద్దు చేసుకున్నారు. గణేశ్ ఉత్సవాల తరువాత ఎన్నికల కోడ్ అమలుచేయాలని గతంలోనే బృహన్‌ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్ల నిర్వాహకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి కూడా చేశారు.
సెప్టెంబరు, అక్టోబరు లేదా నవంబరులో మహా రాష్ట్ర, హర్యానా, జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రెండు విడతల్లో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచి స్తోంది. ఆ మేరకు మహారాష్ట్రలో సెప్టెంబరు లేదా అక్టోబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
దీంతో సార్వజనిక మండళ్లుచేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. తగినన్ని నిధులు లేక ఉత్సవాలు ఘనంగా ఎలా నిర్వహించేదని మండళ్ల పదాధికారులు ఆందోళనలో పడిపోయారు. ఇక రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీజేపీ త్వరలో తొలి జాబి తా విడుదల చేయాలని భావిస్తోంది. ఎన్సీపీ- కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేన, ఎమ్మెన్నెస్ కూడా ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఎన్నికలొస్తే డబ్బులు రావు
Published Sun, Aug 24 2014 11:33 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement