నేడు మూడు జిల్లాల్లో గణేష్ నిమజ్జనం
సాక్షి, వరంగల్/నల్గొండ, కరీంనగర్ : నేడు ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో గణేష్ నిమజ్జనం జరగనుంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో పోలీసు అధికారులు డ్రోన్లు, సీసీ కెమెరాలతో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. వరంగల్ సిటీలో 10 చెరువుల్లో నిమజ్జన కార్యక్రమం జరుగనుంది. నగరంలోని రహదారులపై వాహనాలకు అంతరాయం కలగకుండా ఉండటానికి పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. నల్గొండ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీసు అధికారులు నిమజ్జన కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. మద్యం దుకాణాలను మూసివేయటంతో పాటు డీజేలు, హానికర రంగులను నిషేదించారు. పోలీసులు సూచించిన ప్రాంతాల్లో మాత్రమే నిమజ్జనానికి అనుమతిస్తున్నారు.
వైద్య, విద్యుత్, మున్సిపల్, రెవెన్యూ శాఖల సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ నగరంలోని పదివేల విగ్రహాల నిమజ్జనానికి మానకొండూర్, కొత్తపల్లి చెరువులతోపాటు చింతకుంట వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి శోభాయాత్ర సాగే దారిలో 360 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం నుంచే గణేష్‌ల శోభాయాత్ర ప్రారంభించి అర్థరాత్రి లోగా నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయాలని ఉత్సవాల కమిటీలకు కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్ రెడ్డి సూచించారు.