ఊపందుకున్న గణేశ్ నిమజ్జనం
హైదరాబాద్: జంట నగరాల్లో గణేశ్ నిమజ్జనం ఊపందుకుంది. తొలుత వినాయక నిమజ్జనం మందకొడిగా సాగినా.. మధ్యాహ్న సమయానికి ఊపందుకుంది. ఇప్పటివరకూ దాదాపు 26 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. అయితే ఇంకా భారీ స్థాయిలో విగ్రహాలు నిమజ్జనానికి వేచి ఉన్నాయి. తొమ్మిది ప్రధాన మార్గాల నుండి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నాయి. కాగా, క్రేన్ ల వద్ద నిమజ్జనం ఆలస్యం కావడం పై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సాయంత్రానికి భారీ సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ వచ్చి చేరుతాయని... ఈ లోపు ఇప్పటికే వచ్చిన విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనం సోమవారం ఉదయానికి పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి... నిమజ్జనం దారిలోని ప్రతి కూడాలిలో సీసీ కెమెరాలు అమర్చారు. ఎలాంటి ఘటన జరగకుండా కమాండింగ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నారు.
గణేశ్ సామూహిక నిమజ్జనాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ జంట నగరాల్లో పలుప్రాంతాల్లో సందర్శించి ఏర్పాట్లును సమీక్షించారు.