గణేశ్ ఉత్సవాల తర్వాతే కోడ్
ఎన్నికల సంఘానికి ఉత్సవ మండళ్ల విజ్ఞప్తి
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల తర్వాతే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేయాలని సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు నిర్ణయించాయి. ఒకవేళ అంతకు ముందే కోడ్ అమల్లోకి వస్తే రాజకీయ పార్టీల నుంచి గణేశ్ ఉత్సవ మండళ్లకు రావల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతుందని ఉత్సవ కమిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో మండళ్లు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఉత్సవాల తరువాత ఎన్నికల కోడ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నాయి. ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు జరుగనున్నాయి.
అదే సమయంలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గణేశ్ మండళ్లకు ఆర్థికంగా నష్టపోతామేమోననే దిగులు పట్టుకుంది. ఏటా ఉత్సవాలు నిర్వహించే మండళ్లు తమ పరిధిలోకి వచ్చే చాల్స్, భవనాలు, సొసైటీల ఇళ్లు, షాపుల నుంచి చందా రూపంలో డబ్బును పోగు చేస్తాయి. అయితే ఉత్సవాలు ఘనంగా నిర్వహించే మండళ్లకు ఈ నిధులు ఎటూ సరిపోవు. రాజకీయ నాయకులు అందజేసే భారీ విరాళాలతో ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఉత్సవాలు జరిగే పరిసరాల్లో, మండపం ఆవరణలో ఏర్పాటుచేసే బ్యానర్లు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలు, ఇతర ప్రకటనలు ఏర్పాటు చేసినందుకు వచ్చే ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే వీటిని ఏర్పాటు చేయడానికి వీలుండదు.
అంతేకాక రాజకీయ నాయకులు మండళ్లకు చందా రూపంలో అందజేస్తే డబ్బు పంపిణీ కేసు నమోదవుతుంది. ఇక మండళ్లు ప్రచురించే సావనీర్లో కూడా నాయకుల ఫొటోలు ముద్రించినందుకు కూడా కొంత ఆదాయం వస్తుంది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంవల్ల ఇలా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవడం తోపాటు అనేక రకాలుగా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు నష్టపోతాయి. ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే కాకుండా నిమజ్జనోత్సవాలపై కూడా దీని ప్రభావం పడుతుంది.
ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటుచేసే వేదికపై ముఖ్యమంత్రితోసహా ఇతర శాఖల మంత్రులు, మేయర్, వివిధ పార్టీల ప్రతినిధులు నిలబడి గణేశ్ విగ్రహాలపై పూలుచల్లడం, భక్తులకు ధన్యవాదాలు తెలుపడం వంటివి చేస్తారు. కోడ్ అమల్లోకి వస్తే ఇలాంటి వాటికి కూడా నేతలు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని నిర్ణయించినట్లు బృహన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్వొకేట్ నరేశ్ దహిబావ్కర్ తెలిపారు.