ganga bavani
-
వీడియో: కూకట్‌పల్లిలో విషాదం.. కరెంట్ షాక్‌తో మహిళ మృతి
-
HYD: స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్‌తో మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోర్ స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్‌తో వివాహిత గంగా భవాని(33) అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్లో గంగాభవాని(33) పని మనిషిగా పనిచేస్తోంది. అయితే, గంగా భవాని అపార్ట్మెంట్లో బోర్వెల్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్‌తో మృతిచెందింది. కరెంట్ షాక్ తగిలిన వెంటనే ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె నేలపై పడి ఉండటాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా, ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్లోనే ఆమె భర్త వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు 11 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి మరియు 9 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి ఉన్నారు. వీరు ఏపీవాసులుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి -
తొమ్మిది భాషల్లో అనువాదమైన తెలుగు బాలల చిత్రం గంగా భవాని
పిచ్చి పుల్లయ్య, చరణదాసి, జయం మనదే, ఇల్లరికం, మైనర్బాబులాంటి చిత్రాలు డెరైక్ట్ చేసిన ప్రసిద్ధ దర్శక నిర్మాత తాతినేని ప్రకాశరావు ఓ బాలల చిత్రం చేశారు. 1979లో విడుదలైన ఆ సినిమా పేరు ‘గంగా భవాని’. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ నిర్మించిన తొలి దక్షిణ భారత చిత్రం ఇదే కావడం విశేషం. తెలుగులో రూపొందిన ఈ చిత్రం 9 భాషల్లో అనువాదం కావడం మరో విశేషం. కథ విషయానికొస్తే - కొంతమంది స్మగ్లర్లు దేవతా విగ్రహాలను తస్కరించి విదేశాలకు తరలిస్తుంటారు. ఓ ఊళ్లో గంగా భవానీ విగ్రహాన్ని ఓ ముఠా తస్కరిస్తే, ముగ్గురు పిల్లలు ఎంతో సాహసంతో వాళ్లను పోలీసులకి పట్టిస్తారు. ఈ ముగ్గురు పిల్లల పాత్రలను రాము, రవిశంకర్, గురుప్రసాద్ పోషించారు. గుమ్మడి, మిక్కిలినేని, పద్మనాభం, బాలయ్య, త్యాగరాజులాంటి హేమాహేమీలు కూడా ఇందులో నటించారు. ఇందులో రెండు పాటలు కూడా ఉన్నాయి. రమేశ్‌నాయుడు స్వరాలందించారు. ఆరుద్ర రచన చేశారు. మల్లీ ఇరానీ ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలల చిత్రం పురస్కారం కూడా లభించింది. అయితే సినిమా నిడివి ఆరు రీళ్లు కావడంతో మామూలు థియేటర్లో విడుదల చేయడానికి ఎవరూ సాహసించలేదు. ఈ సినిమా ప్రింట్ సొసైటీ దగ్గర భద్రపరచి ఉందో లేదో? ఒకవేళ ఉంటే కనుక ఇలాంటి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల సమయంలోనే ప్రదర్శిస్తే సముచితంగానూ, సమయోచితంగానూ ఉంటుంది.