ganja bags
-
పోలీసులపైకి కారు తోలిన స్మగ్లర్లు
సాక్షి, నల్గొండ: జిల్లాలోని నకిరేకల్ హైవేపై స్థానిక సీఐ తనిఖీలు నిర్వహిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ స్కార్పియో వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆ వాహనదారు ఒక్కసారిగా పోలీసులపైకి స్కార్పియోను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ వేగంగా పారిపోయాడు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ MH 16 171 నంబర్ వాహనంగా పోలీసులు గుర్తించారు. ఇక వెంటనే నకిరేకల్ పోలీసు సిబ్బంది వైర్లేస్ సెట్‌తో వాహనాన్ని పట్టుకోవల్సిందిగా కట్టంగూర్ ఎస్ఐకి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఐ కట్టంగూర్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌పై రోడ్డుకు అడ్డంగా పోలీసు వాహనాన్ని నిలిపి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. పోలీసులను చూసి కారులో ఉన్న మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పారిపోయాడు. అనుమానిత వాహనాన్ని కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయగా అందులో నుంచి దాదాపు 32 ప్యాకెట్లలకు పైగా ఒక్కోటి మూడు కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు వారాల్లోనే గంజాయితో పట్టుబడ్డ మూడో వాహనంగా పోలీసులు పేర్కొన్నారు. -
గంజాయితో పట్టుబడ్డ మహారాష్ట్ర స్కార్పియో
-
గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి, హనుమాన్‌జంక్షన్: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలను నియమించామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం ఎ.సీతారామపురం సెంటర్లో వీరవల్లి పోలీసులు శనివారం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. రూ.20 లక్షలు విలువైన గంజాయి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు వీరవల్లి పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై పక్కా సమాచారం రావటంతో వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏపీ 16 యూ 8793 నంబర్ గల లారీలో 200 కేజీల బరువు కలిగిన 100 గంజాయి ప్యాకెట్లు తరలించటాన్ని గుర్తించారు. ఈ లారీతో పాటు డ్రైవర్ కూచిపూడి ఫ్రాన్సిస్, సహాయకుడు బండి నాగరాజులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విశాఖ జిల్లా జె.నాయుడుపాలెం గ్రామం నుంచి ఈ నెల 11వ తేదీన గంజాయి లోడుతో బయలుదేరినట్లు తెలిపారు. ఈ గంజాయి ప్యాకెట్లను గన్నవరం చేర్చేందుకు డ్రైవర్ ఫ్రాన్సిస్‌కు రూ.1.50 లక్షలు, సహాయకుడు బండి నాగరాజుకు రూ.50 వేలు ఇచ్చేట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణా ప్రధాన సూత్రధారులు, ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తున్నారనే వివరాలపై పోలీసులు వీరిద్దరిని తమదైన శైలిలో విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా ప్రధాన సూత్రధారుడిని పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను నియమించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, కాలేజి విద్యార్థులకు వీటిని సరఫరా చేయటంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే నూజివీడులో గంజాయి వ్యసనానికి గురైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశామని, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. కాలేజి విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాపై కూడా నిఘా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 200 కేజీల గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. వీటిని తరలిస్తున్న కూచిపూడి ఫ్రాన్సిస్, బండి నాగరాజులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గన్నవరం మండలం కట్టుబడిపాలెంకు చెందిన ఫ్రాన్సిస్‌కు విశాఖ జిల్లా రోలుకుంట మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన బండి నాగరాజుతో ఏర్పడిన పరిచయంతోనే గంజాయి అక్రమ తరలింపునకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ వివరించారు. రూ.20 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబును నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, హనుమాన్‌జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకట రమణ అభినందించారు. -
గంజాయి విలువ రూ.15 లక్షలు
చౌటుప్పల్ (మునుగోడు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి సోమవారం అక్రమంగా తరలిస్తున్న గంజాయి విలువ రూ. 15 లక్షల విలువైనదిగా పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులను చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో వాహనాల తనిఖీలు నిర్వహించగా ఇద్దరు నింది తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించిన అసలు సూత్రధారి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. నిందితులపై పీడీయాక్టు నమోదు చేసేందుకు సిఫారసు చేశారు. ఈ కేసుకు సంబం ధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి వెల్లడించారు. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం నుంచి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా గోలుగొండ మండలం ఏటిగరిమిపేట గ్రామానికి చెందిన మేడిశెట్టి గణేష్(22) వృత్తి రీత్యా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకి ఆ ప్రాంతంలోని గంజాయి వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి. విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి లభిస్తుంది. ఇక్కడ తక్కువ ధరలో లభించే గంజాయిని హైదరాబాద్‌లో విక్రయిస్తే అధికంగా డబ్బులు వస్తాయని ఇతర వ్యాపారుల ద్వారా తెలుసుకున్నాడు. ఈ క్రమంలో తమ గ్రా మానికి చెందిన పోతల సాయి (19) అనే విద్యార్థికి ఇదే విషయాన్ని చెప్పాడు. కొద్ది పెట్టుబడితో భారీగా లాభాలు వస్తుండడంతో తాను కూడా సరే అన్నాడు. దీంతో ఇద్దరూ కలిసి వ్యాపారం చేయాలని సిద్ధమయ్యారు. అలా మూడు సంవత్సరాలుగా వ్యాపారం సాగిస్తున్నారు. సూత్రధారి రాంప్రసాద్ వద్ద ఏజెంట్లుగా చేరి... విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి గంజాయి కొనుగోలు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్ల క్రితం గణేష్, సాయి ప్రధాన సూత్రధారైన రాంప్రసాద్‌ను కలిశారు. తాము కూడా వ్యాపారం చేస్తామని చెప్పారు. దీంతో సరేనన్న ఆయన వీరిద్దరికీ గంజాయిని విక్రయించేవాడు. అలా వీరు ముగ్గురు కలిసి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున గంజాయిని తరలించి సొమ్ము చేసుకునేవారు. పక్కా సమాచారంతో రంగంలోకి పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయి వస్తున్న విషయం ముందుగా మాల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులకు అందింది. వెంటనే స్థానిక సివిల్ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరూ కలిసి మండల పరిధిలో 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి ప్యాకెట్లు లభించాయి. కారులోని ముగ్గురిని సోదాలు చేసే క్రమంలో ప్రధాన సూత్రధారి రాంప్రసాద్ పరారయ్యాడు. మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకొని సోదా చేయగా ఇద్దరి జేబుల్లోంచి రెండు కత్తులు లభించాయి. వెంటనే వారిద్దరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వీరిపై పీడీ యాక్టుకు సిఫారసు చేశారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు నగదు రివార్డులను అందించారు. పరారీలో ఉన్న సూత్రధారిని త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ జె.సురేందర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్, సివిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ పార్ధసారథి, ఎస్ఐలు నవీన్‌బాబు, నాగేశ్వర్రావు, అవినాష్‌బాబు, కేఎస్ రత్నం సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ రూ.మూడు వేలు...ఇక్కడ రూ.15 వేలు రాంప్రసాద్ ముందుగా గంజాయి కొనుగోలు, రవాణాకు ప్రత్యేక ఏజెంట్లను నియమించుకున్నాడు. ఆ ప్రకారంగా విశాఖపట్టణం, నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో మూడు నుంచి నా లుగు వేలకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసేవాడు. దాన్ని గణేష్, సాయిలకు కిలో రూ. 10వేలకు అమ్మేవాడు. ఆ తర్వాత వీరి ద్దరు, ఒక్కోసారి ముగ్గురు కలిసి హైదరాబా ద్‌కు వెళ్లి అక్కడి వ్యక్తులకు కిలో గంజాయిని కిలో రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. చాక్లెట్ ప్యాకెట్లుగా తయారు చేసి.. ఏజెన్సీ ప్రాంతంలో వీరు ముగ్గురు కలిసి 106 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. యథావిధిగా గంజాయిని తరలిస్తే పట్టుబడతామని గ్రహించిన వీరు దాన్ని రెండు కిలోలకు ఒక ప్యాకెట్‌గా మార్చారు. ఈ ప్యాకెట్‌కు పైనుంచి చాక్లెట్ కవర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం ఎవరికీ కనిపించకుండా తమ స్విఫ్ట్ కారు డిక్కీ కింద పెట్టుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. -
228 కిలోల గంజాయి పట్టివేత
సాక్షి,దేవరపల్లి : విశాఖ జిల్లా పాడేరు నుంచి తమిళనాడుకు రెండు కార్లలో అక్రమంగా రవాణా అవుతున్న 228 కిలోల గంజాయిని సోమవారం ఉదయం దేవరపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని, రెండు కార్లను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కొవ్వూరు రూరల్ సీఐ సి. శరత్‌రాజ్‌కుమార్ ట్రైనీ ఎస్పీ వై.రిషాంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గంజాయి అక్రమ రవాణా గురించి వివరించారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా బట్లగుండు గ్రామానికి చెందిన ఆనందన్‌శివసామి, చల్లపాండి, సంగీతకుమార్, రంజిత్‌లు బొలొరా, షిప్టు కార్లులో విశాఖ జిల్లా పాడేరు నుంచి తమిళనాడులోని బట్లగుండు గ్రామానికి 214 గంజాయి ప్యాకెట్లును రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. -
గంజాయి గుట్టలు
పేరుకుపోతున్న సరుకు రోలుగుంట: పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి పోలీసుస్టేషన్లలో గుట్టలుగా పేరుకుపోయి ఉంది. మూటలుగా కట్టి గదుల్లో పడేసి ఉంచారు. నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణ పరిధిలో ఇప్పటికే 4 వేల కిలోల గంజాయి నిల్వ ఉంది. దీనిని గదుల్లో నిల్వ చేసి కాపలా కాయడం సిబ్బందికి భారంగా మారింది. ఈ గంజాయిని సుదూర అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నతాధికారులకు పోలీసులు నివేదించారు. వాహనాలను ఉంచేందుకు అవస్థలు మరోవైపు గంజాయితో పట్టుబడిన కారులు, ఆటోలు, వ్యాన్లు, ఇతర వాహనాలు గంజాయితో పాటు పెరుగుతున్నాయి. గతేడాది రోలుగుంట మండలంలో సుమారు 15 వాహనాలు పట్టుబడగా, ఈ ఏడాది సుమారు 20 పైబడి దొరికాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 2,100 కిలోల గంజాయి పట్టుబడింది. అయితే వాహనాలను ఎక్కడ ఉంచాలో, గంజాయిని ఎలా భద్రపరచాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులకు పని భారం పెరిగింది. కొట్లాటలు, దోపిడీలు, అల్లర్లు, రోడ్డు ప్రమాదాలు, వాహన తనిఖీలు తదితర కేసులతో సతమతం అవుతున్నారు. వీటితో పాటు హత్యలు, అత్యాచార, అట్రాసిటీ కేసుల నమోదుతో సిబ్బంది తలమునకలై ఉన్నారు. మండలంలో దీర్ఘకాలంగా గంజాయి రవాణా జరుగుతుండడం.. ముఖ్యంగా బీబీ పట్నం గ్రామం దీనికి కేంద్రం అవుతుండడంతో పోలీసులు నిత్యం తనిఖీలు సాగించాల్సి వస్తోంది. రోలుగుంట పోలీసు స్టేషన్లో ఉన్న గదులు గంజాయితోను, ఆవరణ వాహనాలతో నిండిపోయి ఉన్నాయి. పట్టుబడిన వాహనాల్లో కొన్ని కొత్తవి ఉండడం విశేషం. సారా కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్న మాదిరిగానే గంజాయి వాహనాలను కూడా వేలానికి అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తులను కోరుతున్నారు. శీలావతి రకానికి భారీ గిరాకీ స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీలో కిలో రూ.వెయ్యి నుంచి రూ.1500 కొని దానిని ఇతర రాష్ట్రాలకు చేర్చి అక్కడ కిలో రూ. 5000 వరకూ విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో తమిళనాడు, తెలంగాణ , కేరళ, మహారాష్ట్రలకు చెందిన వారు గంజాయి తరలిస్తూ ఎక్కువగా పట్టుబడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో పండించే శీలావతి రకం గంజాయికి ఎక్కువగా గిరాకీ ఉంది. ఇతర రాష్ట్రాలవారు ఇక్కడ నుంచి సరుకు తీసుకెళుతుంటారు. గతంలో తమిళనాడుకు చెందిన కొందరు విశాఖ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేసేవారని చెబుతారు. అయితే ప్రస్తుతం స్థానికులే చేపడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.