వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి
చౌటుప్పల్ (మునుగోడు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి సోమవారం అక్రమంగా తరలిస్తున్న గంజాయి విలువ రూ. 15 లక్షల విలువైనదిగా పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులను చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో వాహనాల తనిఖీలు నిర్వహించగా ఇద్దరు నింది తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించిన అసలు సూత్రధారి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. నిందితులపై పీడీయాక్టు నమోదు చేసేందుకు సిఫారసు చేశారు. ఈ కేసుకు సంబం ధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి వెల్లడించారు.
విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం నుంచి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా గోలుగొండ మండలం ఏటిగరిమిపేట గ్రామానికి చెందిన మేడిశెట్టి గణేష్(22) వృత్తి రీత్యా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకి ఆ ప్రాంతంలోని గంజాయి వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి. విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి లభిస్తుంది. ఇక్కడ తక్కువ ధరలో లభించే గంజాయిని హైదరాబాద్‌లో విక్రయిస్తే అధికంగా డబ్బులు వస్తాయని ఇతర వ్యాపారుల ద్వారా తెలుసుకున్నాడు. ఈ క్రమంలో తమ గ్రా మానికి చెందిన పోతల సాయి (19) అనే విద్యార్థికి ఇదే విషయాన్ని చెప్పాడు. కొద్ది పెట్టుబడితో భారీగా లాభాలు వస్తుండడంతో తాను కూడా సరే అన్నాడు. దీంతో ఇద్దరూ కలిసి వ్యాపారం చేయాలని సిద్ధమయ్యారు. అలా మూడు సంవత్సరాలుగా వ్యాపారం సాగిస్తున్నారు.
సూత్రధారి రాంప్రసాద్ వద్ద ఏజెంట్లుగా చేరి...
విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి గంజాయి కొనుగోలు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్ల క్రితం గణేష్, సాయి ప్రధాన సూత్రధారైన రాంప్రసాద్‌ను కలిశారు. తాము కూడా వ్యాపారం చేస్తామని చెప్పారు. దీంతో సరేనన్న ఆయన వీరిద్దరికీ గంజాయిని విక్రయించేవాడు. అలా వీరు ముగ్గురు కలిసి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున గంజాయిని తరలించి సొమ్ము చేసుకునేవారు.
పక్కా సమాచారంతో రంగంలోకి పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయి వస్తున్న విషయం ముందుగా మాల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులకు అందింది. వెంటనే స్థానిక సివిల్ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరూ కలిసి మండల పరిధిలో 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి ప్యాకెట్లు లభించాయి. కారులోని ముగ్గురిని సోదాలు చేసే క్రమంలో ప్రధాన సూత్రధారి రాంప్రసాద్ పరారయ్యాడు. మిగతా ఇద్దరిని
అదుపులోకి తీసుకొని సోదా చేయగా ఇద్దరి జేబుల్లోంచి రెండు కత్తులు లభించాయి. వెంటనే వారిద్దరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వీరిపై పీడీ యాక్టుకు సిఫారసు చేశారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు నగదు రివార్డులను అందించారు. పరారీలో ఉన్న సూత్రధారిని త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ జె.సురేందర్‌రెడ్డి, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, సివిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ పార్ధసారథి, ఎస్‌ఐలు నవీన్‌బాబు, నాగేశ్వర్‌రావు, అవినాష్‌బాబు, కేఎస్ రత్నం సిబ్బంది పాల్గొన్నారు.
అక్కడ రూ.మూడు వేలు...ఇక్కడ రూ.15 వేలు
రాంప్రసాద్ ముందుగా గంజాయి కొనుగోలు, రవాణాకు ప్రత్యేక ఏజెంట్లను నియమించుకున్నాడు. ఆ ప్రకారంగా విశాఖపట్టణం, నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో మూడు నుంచి నా లుగు వేలకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసేవాడు. దాన్ని గణేష్, సాయిలకు కిలో రూ. 10వేలకు అమ్మేవాడు. ఆ తర్వాత వీరి ద్దరు, ఒక్కోసారి ముగ్గురు కలిసి హైదరాబా ద్‌కు వెళ్లి అక్కడి వ్యక్తులకు కిలో గంజాయిని కిలో రూ.15 వేలకు విక్రయిస్తున్నారు.
చాక్లెట్ ప్యాకెట్లుగా తయారు చేసి..
ఏజెన్సీ ప్రాంతంలో వీరు ముగ్గురు కలిసి 106 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. యథావిధిగా గంజాయిని తరలిస్తే పట్టుబడతామని గ్రహించిన వీరు దాన్ని రెండు కిలోలకు ఒక ప్యాకెట్‌గా మార్చారు. ఈ ప్యాకెట్‌కు పైనుంచి చాక్లెట్ కవర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం ఎవరికీ కనిపించకుండా తమ స్విఫ్ట్ కారు డిక్కీ కింద పెట్టుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment