నల్గొండ: భూ తగాదాలు, డబ్బు పంపకంలో తేడాలు రావడంతో మామను అల్లుడు హత్య చేసిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గుడిపల్లి ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఆదివారం వివరాలు తెలియజేశారు. పోల్కంపల్లి గ్రామానికి చెందిన జక్కల చినమారయ్య(60), మంగమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. మారయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి తనకున్న భూమిలో ఒక్కొక్కరికి 3.20 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. కుమార్తెలకు పంచగా మిగిలిన భూమిలో ఇటీవల కొంత విక్రయించి వచ్చిన డబ్బును ఇద్దరు కుమార్తెలకు పంచి ఇచ్చాడు. కాగా పెద్దకుమార్తెకు కొంత ఎక్కవ మొత్తంలో డబ్బులు ఇవ్వడంతో చిన్న కుమార్తె భర్త అయిన పెద్దవూర మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన బొబ్బల నారాయణ తరచూ అత్తమామలతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శనివారం పోల్కంపల్లికి వచ్చిన చిన్న అల్లుడు నారాయణ అత్తతో గొడవపడి అప్పటికే గొర్రెలను మేపడానికి పొలం వద్దకు వెళ్లిన మామ చినమారయ్య వద్దకు వెళ్లి గొడవపడ్డాడు.
ఈ క్రమంలో నారాయణ బండరాయితో చినమారయ్య తలపై మోదాడు. దీంతో మారయ్య తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా.. నారాయణ అక్కడి నుంచి పరారయ్యాడు. చినమారయ్య మృతిచెందడంతో గొర్రెలు గ్రామంలోని పలువురి పొలాల్లో మేత మేస్తుండగా గ్రామస్తులు మారయ్య ఇంట్లో సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు చినమారయ్య కోసం శనివారం రాత్రి మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు.
కాగా ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలంలో చినమారయ్య గ్రామస్తులకు విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ పరశురాం, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment