‘చెత్త’ పనికి రూ. లక్ష లంచం
రూ.50 వే లకు కుదిరిన బేరం
డబ్బు తీసుకుంటూ పట్టుబడ్డ మార్కెటింగ్‌శాఖ అధికారులు
చాదర్‌ఘాట్: కూరగాయల మార్కెట్ నుంచి చెత్త తరలింపు పని అనుమతి (వర్క్ అలాట్మెంట్) ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు మార్కెటింగ్‌శాఖ అధికారులు ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ)కి పట్టుబడ్డారు. బుధవారం ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ (ఎస్జీఎస్) కల్పన గుడిమల్కాపూర్ మార్కెట్లోని చెత్త తరలింపునకు సంబంధిత కాంట్రాక్టర్ రాంబాబు నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఈనెల 22న ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఎస్జీఎస్ను పట్టుకొనేందుకు పథకం వేశారు.
కాంట్రాక్టర్ రాంబాబు ఇచ్చిన లంచం డబ్బును సీనియర్ అసిస్టెంట్ మహేశ్ ద్వారా ఎస్జీఎస్ కల్పన తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం పట్టుకుంది. కల్పన, మహేష్‌లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి లంచం డబ్బు రూ. 50 వేలను స్వాధీనం చేసుకుంది. విచారణ అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇదే సమయంలో దోమలగూడలో ఉన్న కల్పన ఇంటి వద్ద కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాడుల్లో సీఐలు మంజుల, సుదర్శన్‌రెడ్డి, రాజేశ్, ఎస్ఐ రాజవర్ధన్ పాల్గొన్నారు.