garidepally
-
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
యాదాద్రి: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల ఎల్బీనగర్ శివారు జానపహాడ్ మేజర్ కాలువలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మృతదేహం 2022 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మేజర్ కాలువలో కొట్టుకు వచ్చినట్లు సీఐ చరమందరాజు ఆదివారం తెలిపారు. మృతుడి దేహంపై తెలుపు రంగు లుంగీ, నీలి, తెలుపు రంగు గడులుగల ఫుల్‌షర్ట్ ఉన్నదని, భుజంపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యక్తిని ఎవరో వ్యక్తులు చంపి, చేతులు కట్టి, ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి కాలువలో పడవేసినారని పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు గరిడేపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక సీఐ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఇవి చదవండి: ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ -
కస్తూర్బా పాఠశాలలో బాలిక మృతి.. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత
సాక్షి, నిజామాబాద్: గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థిని మృతిచెందింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమ్లాతండా గ్రామానికి చెందిన గుగులోతు చంద్రు, లలిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె దివ్య(14) గరిడేపల్లిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత దివ్య ఒక్కసారిగా కింద పడిపోయింది. విధుల్లో ఉన్న ఏఎన్ఎం ఇందిర, పీఈటీ ధనమ్మలు వెంటనే దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బైక్‌పై తీసుకెళ్లగా అప్పటికీ ఇంకా తెరువలేదు. దీంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే దివ్య మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కాగా ఆదివారం సెలవు కావటంతో దివ్య తండ్రి చంద్రు పాఠశాలకు వచ్చి కుమార్తెని చూసి తన వెంట తెచ్చిన మిక్చర్(కారా) ఇచ్చి వెళ్లినట్లు తోటి విద్యార్థినులు తెలిపారు. ఉదయం దివ్య తండ్రి తెచ్చిన మిక్చర్ తిన్న అనంతరం కొద్దిసేపటికి ఈ సంఘటన జరిగినట్లు విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ కార్తీక్, మండల విద్యాధికారి చత్రునాయక్, ఎంపీఓ లావణ్య పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దివ్య చనిపోయిన విషయంపై సిబ్బందిని, విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. చదవండి: పిల్లలు పెద్దయ్యారు.. సఖ్యతగా మెలగడం కుదరదని చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై కస్తూర్బా పాఠశాల నిర్వాహకురాలు శైలజ మాట్లాడుతూ.. దివ్య కళ్లు తిరిగి పడిపోయిన వెంటనే హాస్టల్లో ఉన్న సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా తీయకపోవడంతో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే దివ్య చనిపోయినట్లు వైద్యులు తెలిపారని, ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని అభిప్రాయాలను వైద్యులు వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు. అంతకుముందు దివ్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆమె తెలిపారు. చదవండి: మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో.. -
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప
గరిడేపల్లి : ఏసీబీ అధికారుల దాడులతో గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఒక రైతు నుంచి లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్, కార్యాలయంలో పని చేస్తున్న ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలిలా.. మండలంలోని కుతుబ్షాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్యకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన రికార్డులు మార్చి రెవెన్యూ సిబ్బంది పట్టా చేశారు. లింగయ్య బతుకు దెరువు కోసం వెళ్లి కొంతకాలంగా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో నివాసం ఉంటున్నాడు. గత ఏడు సంవత్సరాలుగా కుతుబ్షాపురంలో ఉన్న భూమిని గుడుగుంట్ల వెంకయ్య అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. అయితే రెండేళ్లుగా కౌలు ఇవ్వటం లేదని లింగయ్య తెలిపాడు. కుతుబ్షాపురానికి చెందిన కొంతమంది భూమి పట్టా మార్చుకున్నారని లింగయ్యకు తెలిసింది. దీంతో లింగయ్య గరిడేపల్లిలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాడు. తన పేరు మీద ఉన్న సర్వే నంబర్ 399లోని భూమిని తన అక్క లక్ష్మి, వెంకయ్యల పేరు మీద పట్టా అయినట్లు రికార్డుల్లో ఉండడంతో అవాక్కయ్యాడు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ వద్దకు వెళ్లి అడగగా రూ.20వేల లంచం ఇస్తే నీ పేరు మీద పట్టా ఇస్తానని చెప్పినట్లు బాధితుడు లింగయ్య తెలిపాడు. తన వద్ద డబ్బులు లేవని, పేద వ్యక్తినని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో 1980 నుంచి ఉన్న పాత పహాణీలు ఇవ్వాలని డీటీని కోరినట్లు తెలిపాడు. పహాణీలకు కూడా రూ.15వేల లంచం ఇస్తేనే అందజేస్తానని డీటీ చెప్పటంతో రూ.8వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. లింగయ్య సోమవారం డబ్బులు తీసుకుని కార్యాలయానికి వెళ్లగా అక్కడ పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి పయిడిమర్రి ప్రకాశంకు ఇవ్వాలని డీటీ సూచించాడు. రూ.8వేలు పయిడిమర్రి ప్రకాశానికి అప్పజెప్పగానే పహాణీలు ఇచ్చాడు. అదే సమయంలో అక్కడే కాచుకునివున్న ఏసీబీ అధికారులు ప్రకాశంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కాగా కార్యాలయానికి వచ్చిన రైతుల సమస్యలను ఏసీబీ అధికారులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ నల్లగొండ రేంజ్ అధికారి ఏపీ ఆనంద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ బండారు సత్యనారాయణ సూచన మేరకు కార్యాలయంలో పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి ప్రకాశం కుతుబ్షాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్య అనే రైతు నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా అవినీతికి పాల్పడినా, లంచం అడిగినా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్, సీఐ రఘుబాబు, వెంకటరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చా
సాక్షి, గరిడేపల్లి : నిస్వార్ధంగా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాయినిగూడెం, కీతవారిగూడెం, మంగపురం, కట్టవారిగూడెంలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రజలు ఓడించాలన్నారు. తనను ఓడించేందుకు ఉత్తమ్ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు మాత్రం తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ..చంద్రబాబు లాంటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండడన్నారు. కార్యక్రమంలో నాయకులు త్రిపురం అంజన్‌రెడ్డి, కడియం వెంకట్‌రెడ్డి, గుర్వయ్య, నర్సయ్య, ఆనంద్‌బాబు, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఆశీర్వదించండి.. సమస్యలను పరిష్కరిస్తాం నేరేడుచర్ల : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అశీర్వదించి గెలిపిస్తే గ్రామాల్లో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తామని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆయన మండలంలోని పెంచికల్‌దిన్నెలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పెంచికల్‌దిన్నె గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ సుంకరి క్రాంతికుమార్, మాజీ ఎంపీటీసీ యల్లబోయిన లింగయ్య, పీఏసీఎస్ చైర్మన్ సోమగాని మురళీల ఆధ్వర్యంలో పలువురు సీపీఎం నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి శానంపూడి సైదిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు కర్నాటి శ్యాం, శ్రీకాంత్, హరీష్, సావిత్రి, ప్రదీప్, నర్సయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్‌ను తరిమికొట్టాలి.. పాలకవీడు : గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గ ప్రాంతాన్ని సమస్యల నిలయంగా మార్చారని, గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించని ఉత్తమ్‌ను తరిమి కొట్టాలని, టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని హుజూర్నగర్ నియోజకవర్గ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిని బాధ్యతగా తీసుకుని పాటుపడతానన్నారు. సాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఈ గ్రామాల్లో సాగు, తాగు నీటికి ప్రాధాన్యం కల్పిస్తానన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన 90 మందికి సైదిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యడు మలికంటి దర్గారావు, సై మండలాధ్యక్షుడు తాటికొండ వెంకటరెడ్డి, ఎంపీపీ రమావత్ గీతారాంచందర్, క్రాంతికుమార్, యామిని వీరయ్య, జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణరెడ్డి, సైదులు, మార్కెట్ డైరెక్టర్ టి.వెంకటరెడ్డి, రామారావు, రాఘవరెడ్డి, అచ్చమ్మ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గరిడేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట శివారులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్(19) బైక్‌పై గరిడేపల్లి వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలైన రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కార్డన్ సెర్చ్.. 49 వాహనాలు సీజ్
గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో పోలీసులు కార్డన్‌సెర్చ్ చేపట్టారు. శనివారం వేకువజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు సాగిన ఈ తనిఖీలలో నలుగురు ఎస్సైలతోపాటు 70 మంది పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. స్థానిక తుంబాయిగడ్డ ప్రాంతంలో అన్ని ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు కొందరు అనుమానితులను ప్రశ్నించారు. ఎలాంటి పత్రాలు లేని 47 ద్విచక్రవాహనాలతోపాటు రెండు ఆటోలను సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈదురుగాలుల బీభత్సం
గరిడేపల్లి (నల్లగొండ) : గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శనివారం భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తుండటంతో గ్రామంలోని వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.