garments industry
-
‘పీఎల్ఐ పథకం విస్తరణ’... ఏ రంగానికి.. ??
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వస్త్ర రంగానికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ (ఐఐజీఎఫ్)లో పాల్గొని మాట్లాడారు.‘జౌళి రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో భాగంగా రూ.10,000 కోట్లు అందిస్తున్న కేంద్రం..దీన్ని గార్మెంట్స్ రంగానికి విస్తరించాలని యోచిస్తోంది. వస్త్ర రంగంలో ఎగుమతులను పెంచుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.13 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులను పరిశ్రమ లక్ష్యంగా నిర్ణయించింది. దేశంలో మ్యాన్ మేడ్ ఫైబర్(ఎంఎంఎఫ్) అపెరల్, ఫ్యాబ్రిక్స్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఐదేళ్ల వ్యవధికిగాను 2021లో పీఎల్ఐలో భాగంగా రూ.10,683 కోట్ల ఇచ్చేందుకు ఆమోదించింది. పరిశ్రమ తన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకాన్ని గార్మెంట్స్(వస్త్ర) రంగానికి విస్తరించాలని యోచిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ టెక్స్టైల్స్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం సుమారు 165 బిలియన్ డాలర్లుగా(రూ.13 లక్షల కోట్లు) ఉంది. దాన్ని రానున్న రోజుల్లో 350 బిలియన్ డాలర్ల(సుమారు రూ.27 లక్షల కోట్లు)కు పెంచాల్సి ఉంది. ఈ రంగంలో చైనా కంటే ముందుండేందుకు మంత్రిత్వ శాఖ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈకామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచే అవకాశాలను అన్వేషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ‘గ్రీన్ టెక్స్టైల్స్, రీసైక్లింగ్‌పై దృష్టి సారించాలి. గ్లోబల్ బ్రాండ్లకు సరఫరాదారులుగా మారకుండా దేశీయ కంపెనీలు తమ సొంత బ్రాండ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కుల పథకం(ఎస్ఐటీపీ)ను పునరుద్ధరించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త టెక్స్టైల్ పార్కులను రూపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటికే 54 టెక్స్టైల్ పార్కులు మంజూరయ్యాయి. -
11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత
బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తమ వేతనాలు పెంచాలని నిరసన తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా గత రెండు వారాలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గార్మెంట్ ఇండస్ట్రీలోని దాదాపు 40లక్షల మంది కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడెక్కారు. దాంతో అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. ఫలితంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల వల్ల ముగ్గురు కార్మికులు మరణించినట్లు సమాచారం. అక్కడి పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. నిరసనకు పాల్పడిన 11,000 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. దాంతో దేశంలోని 150 ఫ్యాక్టరీలు నిరవధికంగా మూసివేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. కార్మికుల సమస్యలు ఇవే.. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో గార్మెంట్ పరిశ్రమ పాత్ర కీలకం. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో 84% వాటాను కలిగి ఉంది. కరోనా సమయంలో దుస్తుల డిమాండ్ మందగించింది. దానివల్ల దేశంలో 2020లో దాదాపు 17% వస్త్ర ఎగుమతులు తగ్గాయి. ముడిచమురు ధరలు పెరగడంతో బంగ్లాదేశ్ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లతో పాటు ప్రధానంగా అక్కడి కార్మికులకు అరకొర జీతాలిచ్చి సరిపెడుతున్నారు. నెలకు కనీస వేతనం కింద రూ.9458(12,500 టాకాలు) చెల్లిస్తున్నారు. అయితే దాన్ని రూ.17400(23,000 టాకాలు)కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి పనిప్రదేశాల్లో సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పరిశ్రమల్లోని విషపూరిత వాయువులను పీల్చి చాలామంది కార్మికులు వివిధ వ్యాధుల బారినపడుతున్నట్లు కార్మికసంఘాలు తెలిపాయి. అక్కడి కార్మికుల్లో మహిళలు ఎక్కువగా పనిచేస్తుంటారు. కానీ వారికి సరైన మౌలికవసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒక పరిశ్రమలో మహిళలు లైంగికహింసకు గురవుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే.. బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పద్దెనిమిది గ్లోబల్ కంపెనీలు అక్కడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రధానికి లేఖ రాశాయి. వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కొత్త కనీస వేతనం నిర్ణయించాలని కోరాయి. హెచ్ అండ్ ఎం, లెవీస్, గ్యాప్, పూమా.. వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు అక్కడ పరిశ్రమలు నెలకొల్పాయి. -
మీలో ఒక్కడిలా ఉంటా...మీ కోసం ఎందాకైనా వస్తా: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి, రాప్తాడు: పదవులు ముఖ్యం కాదు..నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమని, ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటానని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం విజయవాడ నుంచి నియోజకవర్గానికి ఎమ్మెల్యే వస్తుండడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకొని స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి 150 వాహనాలతో భారీ కాన్వాయ్‌గా బయల్దేరి సాయంత్రం రాప్తాడుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి పదవి రాలేదని తాను ఎక్కడ బాధపడతానోనని అధైర్యపడొద్దు..మీ వెంట మేమున్నాం..అందరం కలిసి టీడీపీని సమాధి చేద్దాం అని చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు. సామాజిక సమీకరణలు, అనుభవరీత్యా పెద్దలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. జగన్మోహన్రెడ్డి మనసు నిండా ఎప్పటికీ తాను ఉంటానన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క...నేటి నుంచి ఒక లెక్క...మీరందరూ కోరుకున్నట్లే మీ అందరితో ఉంటా.. మీలో ఒక్కడిలా ఉంటా...మీ కోసం ఎందాకైనా వస్తానని అన్నారు. అభివృద్ధి విషయంలో తగ్గేదేలే.. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తగ్గేదేలేదని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో 2024 కల్లా మూడు రిజర్వాయర్లను పూర్తి చేసి, లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో గార్మెంట్స్ పరిశ్రమను రాప్తాడులో 12 ఎకరాల్లోనే స్థాపించి, 6 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. రూ.30 కోట్లతో కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్నారు. జూన్‌లో తోపుదుర్తి సహకార మహిళా డెయిరీని ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉపాధిని కల్పిస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల సునీత 28 ఎకరాల్లో 6 వేల మందికి ఉపాధి అని చెప్పి, ప్రహరీ కూడా కట్టలేదన్నారు. నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని, ఇప్పటికి 14,800 ఇళ్లు మంజూరు చేశామన్నారు. 2024లో టీడీపీని భూస్థాపితం చేస్తాం జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో నాకు అవకాశం దక్కపోవచ్చని, 2024 ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిస్తామన్నారు.టీడీపీ హయాంలో జాకీ వెళ్లిపోతే దొంగలు పడిన ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు మూడేళ్ల తర్వాత జాకీ పోయిందని అంటున్నారన్నారని ఎమ్మెల్యే విమర్శించారు. టీడీపీకి జనం ఎప్పుడో జాకీలు ఇప్పేశారని, ఇంజిన్ కూడా కూలిపోయిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు, టీడీపీకి ఉనికి ఉంటుందన్నారు. సోషల్‌మీడియా, ఎల్లో మీడియాను ఉపయోగించి, తమ కుటుంబంపై నిందలు వేస్తున్నారని, మీలాగా దోపిడీకి అధికారాన్ని అడ్డం పెట్టుకోలేదన్నారు. 30 ఏళ్లుగా వేలాది కోట్లు సంపాదించారని, ఆక్రమించిన భూమి ఎంతో..సర్వే నంబర్లతో సహా ప్రకటించినా సిగ్గురాలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్మాల్-ఎల్-ఎక్స్ఎల్.. కొలిక్కి రానున్న మన ‘సైజు’లు
Indian Body Measurements Survey: స్మాల్, మీడియం, ఎల్, ఎక్స్ఎల్.. ఇలా దుస్తులు, చెప్పులు, షూస్ విషయంలో కొలమానాలు ఉంటాయి. అయితే అవి యూకే, యూఎస్, మెక్సికన్ అంటూ విదేశీ కొలతలు ఉండడం తెలుసుకదా!. ఆన్లైన్లో ఈ కొలతలతో పాటుగా సెంటీమీటర్ కొలతలు ఉండడం వల్ల కొనుగోలుదారులు ఓ క్లారిటీకి వస్తుంటారు. కానీ, కోట్ల మంది వస్త్ర వ్యాపారులకు మాత్రం కొన్నేళ్లుగా ఈ కొలతలు ఇబ్బందిగానే పరిణమిస్తున్నాయి. అందుకే ఈ కొలతల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బట్టల దుకాణానికి వెళ్లినప్పుడు ఒక్కోసారి సైజుల విషయంలో తేడాలు కనిపిస్తుంటాయి. రెగ్యులర్‌గా ‘ఎల్’ సైజ్ ఉపయోగించేవాళ్లకు.. వేరే బ్రాండ్‌లో ‘ఎక్స్ఎల్’ సరిపోతుంటుంది. అది చూసి బ్రాండ్‌ను బట్టి తేడాలుంటాయని చాలామంది పొరపడుతుంటారు. కానీ, విషయం అది కాదు. విదేశీ సైజుల కొలమానం ప్రకారం ఉండడం మూలంగానే అందులో తేడాలు వస్తున్నాయి. ప్రత్యేకించి మన దేశానికి ప్రత్యేకించి క్లోతింగ్ మెజర్మెంట్(కొలతల కొలమానం) అంటూ ఒకటి లేకుండా పోయింది. అందుకే ఇంకా యూకే, యూఎస్ అంటూ వస్త్ర, శాండల్స్ తయారీ పరిశ్రమలు విదేశీ కొలతలపైనే ఆధారపడుతున్నాయి. అందదా కొలతలతోనే దుస్తులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దీనికి చెక్ పెట్టేందుకు మొదలైందే ‘ఇండియాసైజ్’ సర్వే. సర్వే ఉద్దేశం ‘INDIAsize’.. కేంద్ర వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) సహకారంతో ఈ సర్వేను మొదలుపెట్టింది. కొత్త ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, షిల్లాంగ్.. ఇలా ప్రధాన నగరాలను ఆరు జోన్లుగా విభజించి సర్వేను చేస్తున్నారు. సుమారు పాతిక వేలమంది కొలతలను తీసుకుని దుస్తుల కోసం ఒక కొలతల చార్ట్‌ను రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టారు. 15 నుంచి 65 ఏళ్ల వయసు వాళ్ల బాడీ కొలతల ఆధారంగా ఈ సర్వేను కొనసాగించనున్నారు. క్లోతింగ్ మ్యానుఫ్యాక్చర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో 2019లో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టు.. కరోనా వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు గత గురువారం ఢిల్లీలో ఇండియాసైజ్ సర్వే మొదలైంది. తొలి రౌండ్లో 5,700 మంది పాల్గొననున్నారు. 2022 చివరికల్లా సర్వేను ముగించి.. మన సైజులపై ఓ కొలిక్కి రానున్నారు. ఏం ఉపయోగమంటే.. దేశంలోనే ఎక్కువమంది ఉద్యోగులున్న రెండో పరిశ్రమ.. వస్త్ర పరిశ్రమ. ఏటా 140 బిలియన్ల రూపాయలు ఆదాయం వస్తే.. అందులో 100 బిలియన్ల రూపాయలు లోకల్ కన్జూమర్ల నుంచే వస్తోంది. కొలతల గందరగోళం నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. ఆఫ్‌లైన్ షాపింగ్‌లో ఈ కొలతలు కీలకంగా వ్యవహరించనున్నాయి. రిటర్న్ పాలసీలో భాగంగా స్టాఫ్కానీ, కస్టమర్కానీ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. తయారీదారులకు సైతం ఈ సర్వే ఉపయోగపడనుంది. సేల్స్ పెంచుకోవడానికి, రిటర్న్ గూడ్స్ లాంటి సమస్యలను అధిగమించడానికి తయారీదారులకు సాయపడనుంది. ఎలా చేస్తారంటే.. ఆంత్రోపోమెట్రిక్ డేటా(శరీరాకృతి కొలతల) ఆధారంగా ఈ సర్వే కొనసాగనుంది. 100 డేటా పాయింట్స్ ఆధారంగా కొలతల్ని నిర్ధారిస్తారు. ఎంపిక చేసినవాళ్లపై ‘హ్యూమన్ సేఫ్ 3డీ వోల్ బాడీ స్కానర్’ టెక్నాలజీ ఉపయోగించి కొలతలను సేకరిస్తామని నిఫ్ట్ డైరెక్టర్ జనరల్ శాంతమను వెల్లడించారు. ఒక్కో వ్యక్తిని స్కాన్ చేయడానికి 15 నిమిషాల టైం పడుతుంది. తద్వారా టైలర్, ఎక్స్‌పర్ట్‌ల అవసరం లేకుండానే సర్వే వేగంగా పూర్తి కానుంది. ఈలోపు చెప్పులు, షూలకు సంబంధించిన సర్వే ప్రక్రియను మొదలుపెడతామని ఆయన తెలిపారు. గార్మెంట్స్ పరిశ్రమల చరిత్రలో ఫస్ట్ రికార్డెడ్ ఇన్‌స్టాన్స్ సైజింగ్ సర్వే.. 1921లో అది కేవలం పురుషుల కోసమే జరిగింది. అయితే అంత్రోపోమెట్రిక్(మనిషి బాడీ కొలతల ప్రకారం) మాత్రం 1939 నుంచి మొదలైంది. ఆ టైంలో పదిహేను వేలమంది అమెరికన్ మహిళల కొలతల ఆధారంగా దుస్తుల్ని రూపొందించారు. ఆ తర్వాత కొన్ని దేశాలు ప్రత్యేకంగా తమ దేశ ప్రజల శరీరాకృతి కొలతల ఆధారంగా దుస్తులు, చెప్పులు రూపొందిస్తూ వస్తున్నాయి. చదవండి: ఆడవాళ్లు.. ఈ యాప్‌తో జాగ్రత్త! -
వెయ్యి కోట్ల భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్/గీసుకొండ: చిన్నపిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంస్థ ‘కిటెక్స్’ (కిటెక్స్ గ్రూప్) తెలంగాణలో పెట్టుబ డులు పెట్టనుంది. తొలిదశలో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కిటెక్స్ సంస్థ ఎమ్డీ సాబు ఎం. జాకబ్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వస్త్ర పరిశ్రమకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అరుదని ప్రశంసించారు. సాబు జాకబ్‌తో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శుక్రవారం కొచ్చి నుంచి హైదరాబాద్ చేరుకుంది. అనంతరం టీఎస్ఐఐసీ ఎండీ నర్సిం హారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందంతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్‌లోని కేఎంటీపీని సందర్శించింది. అనంతరం హైదరాబాద్ తిరిగొచ్చి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రత్యే కంగా భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు, పారిశ్రామిక విధానం ప్రత్యేకతల గురించి కిటెక్స్ బృందానికి మంత్రి కేటీఆర్ వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు, పారిశ్రామిక అవసరాలకు నిరంతర విద్యుత్, పత్తిసాగులో రాష్ట్రం ప్రత్యేకత తదితర అంశాల గురించి విపులంగా తెలియజేశారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ వంటిది దేశంలో ఎక్కడా లేదన్న కిటెక్స్ ప్రతినిధి బృందం.. ప్రభుత్వ విధానాలపై, తమ ప్రతిపాదనలకు సర్కారు స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా కిటెక్స్ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్‌కు వివరించింది. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీయస్ ఐపాస్ చట్టం మేరకు మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ అధికారులు శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కారు సత్వర చొరవతో.. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్.. తాజాగా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ సహా 9 రాష్ట్రాలు ఆ సంస్థను ఆహ్వానించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది. సాబు జాకబ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు కిటెక్స్ ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. సంస్థ ప్రతినిధులు వరంగల్ టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్తంగా మూతపడ్డ 50శాతం చిన్న బట్టలషాపులు
-
లాక్డౌన్ విజేత
యూరో క్లోతింగ్ కంపెనీ. అతి పెద్ద గార్మెంట్ ఫ్యాక్టరీల్లో ఇదొకటి. ఒక యూనిట్ కర్ణాటక రాష్ట్రం, మాండ్యా జిల్లా, శ్రీరంగపట్టణంలో ఉంది. కోవిడ్ కారణంగా లే ఆఫ్ ప్రకటించింది. 1300 మంది ఉద్యోగాలు రోడ్డున పడ్డాయి. వస్త్రపరిశ్రమలకు కొత్త ఆర్డర్లు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, ఉన్న ఆర్డర్లు కూడా రద్దవుతున్నాయి. ప్రస్తుతానికి పని ఆపేయడం ఒక్కటే మార్గం అనుకుంటున్న కంపెనీలు ఇలా లే ఆఫ్ ప్రకటించేస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఇలా ఉంటే... చిన్న పరిశ్రమ నడిపే మేకా శిరీష మాత్రం తన ఉద్యోగులకు పని భద్రత కల్పించి ఆదర్శంగా నిలిచారు. చేయి చాచనివ్వలేదు హైదరాబాద్‌లో ఓ చిన్న గార్మెంట్ యూనిట్ నడుపుతున్న శిరీష లాక్డౌన్ కష్టకాలంలో తన ఉద్యోగుల సంపాదన మార్గాన్ని సంరక్షించగలిగారు. ఆమె గార్మెంట్ యూనిట్‌ని కరోనా పోరాటంలో భాగం చేశారు. అప్పటివరకు యూనిఫామ్‌లు కుడుతున్న తన ఉద్యోగులకు పీపీఈ కిట్లు కుట్టడంలో శిక్షణ ఇప్పించారు. ‘‘పీపీఈ కిట్ల మెటీరియల్ కోసం, ఆర్డర్ల కోసం రోజుకు పదహారు గంటలు పని చేశాను. నాతో పనిచేసే మహిళలకు రోజుకు ఐదు వందల రూపాయలు రాబడిని చూపించగలిగాను. సంస్థ నిర్వహణలో ఎప్పుడూ అవసరానికి తగినట్లు మార్పులు చేసుకుంటూ ఉద్యోగులకు పని కల్పించాలి. ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించాల్సింది ఈ పీపీఈ కిట్ల తయారీలో నాకు లాభాలు వస్తాయా లేదా అని కాదు. పరిశ్రమ నడక సజావుగా సాగాలి. తమకు పని ఉందనే భావనే ఉద్యోగులకు ధైర్యాన్నిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. యజమాని ఉద్యోగుల్లో ఆ ధైర్యాన్ని పాదుకొల్పగలగాలి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గర్వంగా చెప్పగలను. చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఎంతోమంది ఈ కష్టకాలంలో ఉపాధి కోల్పోయి, దాతలిచ్చే విరాళాల కోసం క్యూలో నిలబడ్డారు. నా యూనిట్లో పని చేస్తున్న మహిళలకు విరాళాల కోసం చేయి చాచాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోగలిగాను’’ అన్నారు శిరీష. తెనాలమ్మాయి పాతికేళ్ల కిందట హైదరాబాద్, కూకట్‌పల్లిలో సొంతంగా పరిశ్రమ పెట్టిన శిరీష సొంతూరు గుంటూరు జిల్లా, తెనాలికి సమీపంలో ఉన్న మున్నంగి. తెనాలికి ఆంధ్రాపారిస్ అని పేరు. శిరీష ఫ్యాషన్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి, అప్పటికి తెలుగురాష్ట్రాల్లో నడుస్తున్న ఫ్యాషన్కంటే రెండడుగులు ముందుగా ఉండడానికి కారణం ఆ నేల ప్రభావం కూడా ఉన్నట్లుంది. ఆమె 1996లో బొటీక్ స్థాపించి విజయవంతంగా నడిపించారు. ‘‘వస్త్రవ్యాపారం ప్రధానంగా మగవాళ్ల చేతుల్లోనే ఉన్న రోజులవి. మగవాళ్లు టెక్స్టైల్ ఫ్యాక్టరీలు తయారు చేసిన దుస్తులను యదాతథంగా తెచ్చి షోరూమ్‌లో అమ్మేవాళ్లు. నేను ప్రయోగాలు చేశాను. నా తొలి ప్రయోగం మా గుంటూరు మంగళగిరి కాటన్‌తోనే. బెనారస్ నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల చేనేతలనూ నా బొటీక్‌కు తెచ్చాను. ప్రతిదీ కస్టమైజ్డ్ పీస్ కావడంతో బాగా క్లిక్ అయింది. తర్వాత మగ్గం వర్క్ కూడా చేర్చాను. నా బొటీక్ ప్రచారం కోసం ఒక్క పాంప్లెట్ కూడా వేయించలేదు. ప్రతి మోడల్‌నీ, ప్రతి డిజైన్‌నీ నేను ఒక పీస్ చేయించుకుని ధరించడమే నా ప్రచారం. నాకు నేనే అంబాసిడర్‌ని’’ నవ్వుతూ అన్నారామె. యజమానికి పరీక్ష ‘నాకు ఆస్తులున్నాయి. నాకు వచ్చే నష్టం ఏమీ లేదు... కాబట్టి లాక్డౌన్ నుంచి పరిస్థితి చక్కబడే వరకు యూనిట్‌ను మూసేస్తాను. ఉద్యోగులు రోడ్డున పడితే నాకేంటి’ అనుకునే మనస్తత్వం పరిశ్రమ నిర్వహణకు ఏ మాత్రం పనికి రాదు. అలాంటి వాళ్లు పరిశ్రమ బాధ్యతను తలకెత్తుకోక పోవడమే మంచిది. వ్యాపారం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల ఉపాధికి భరోసా కలిగించాలి. యజమాని తనను తాను నిరూపించుకోగలిగేది ఇలాంటి కష్టకాలంలోనే.– మేకా శిరీష గెలిపించిన అసంతృప్తి పరిశ్రమ నిర్వహణ గురించి ఇంత చక్కగా పండు వలిచి చేతిలో పెట్టినట్లు వివరిస్తున్న శిరీష మున్నంగి నుంచి హైదరాబాద్‌కు సాగిన తన ప్రస్థానాన్ని వివరించారు. ‘‘మా నాన్న చిన్నప్పుడే పోవడంతో నన్ను, అన్నయ్యను పెంచి పెద్దచేసే బాధ్యత అమ్మదే అయింది. మా ఊళ్లో కాలేజ్ లేకపోవడంతో నేను టెన్త్‌తోనే చదువాపేయాల్సి వచ్చింది. పెళ్లయిన తర్వాత 1988లో మున్నంగి నుంచి హైదరాబాద్‌కి వచ్చాను. నాకు ఏదో ఒకటి చేయాలని, నన్ను నేను నిరూపించుకోవాలని ఉండేది. చదువుకోలేకపోయాననే అసంతృప్తితో వారపత్రికలతోపాటు ఎన్ని పుస్తకాలు చదివానో లెక్కేలేదు. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పత్రికల పాత్ర చాలా పెద్దది. నాకంటూ ఉన్న లక్ష్యాలను చేరాలంటే సొంతంగా పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. పక్కింటి ఆంటీ దగ్గర టైలరింగ్ నేర్చుకుని ‘సఖి బొటీక్’ పెట్టాను. రెండేళ్ల కిందట షాపూర్లో యూనిఫామ్‌లు కుట్టే గార్మెంట్ యూనిట్ చేపట్టాను. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు ప్రారంభమయ్యే టైమ్‌టేబుల్‌లో అనిశ్చితి ఉంది. యూనిఫామ్ కుట్టే పని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. యూనిట్లో పని చేసే వాళ్లకు పని కల్పించడం కోసం పీపీఈ కిట్లకు మారిపోయాం. డాక్టర్లు, హాస్పిటళ్లతో నాకున్న పరిచయాలే నా మార్కెట్. మోడల్ పీస్ ఒక్కొక్కటి ఇచ్చి వాళ్లు ధరించిన తర్వాత వాళ్లకు తగినట్లు మార్పులు సూచించమని అడిగాను. అలా సౌకర్యవంతంగా మార్పులు చేయగలిగాం. స్కూళ్లు తెరిచి పరిస్థితులు గాడిన పడేవరకు పీపీఈ కిట్ల అవసరం ఉండనే ఉంటుంది’’ అన్నారు శిరీష. వ్యాపారంలో విజేతగా నిలబెట్టే లక్షణం ఒకటి ఉంటుంది. అది సమాజంలో ఎదురయ్యే అవసరాన్ని మిగిలిన వారికంటే ముందుగా గుర్తించగలిగిన నైపుణ్యం. ఇందుకు పెద్ద కోర్సులేవీ అక్కరలేదని నిరూపిస్తోంది శిరీష. అలాగే తన ఉద్యోగులు ఆకలితో ఉండకూడదనే అమ్మతనం మగవాళ్లలో కంటే మహిళల్లోనే ఎక్కువని చెప్పడానికి కూడా ప్రతీక ఆమె.– వాకా మంజులారెడ్డి -
మహిళల శ్రమ దోపిడీకి ‘పిల్స్’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిలోనే వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో దాదాపు నాలుగువేల ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు ఉండగా, వాటిల్లో దాదాపు మూడు లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. వారు రోజంతా పది గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తేనే వారికి పూర్తి వేతనం వస్తుంది. మహిళలు రుతుస్రావం సమయంలో కనీసం మూడు రోజులపాటు సెలవు పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే ఉద్యోగాలే పోతాయి. అందుకని వారు ఆ సమయాల్లో కూడా ఫ్యాక్టరీల్లో పనికి హాజరవుతున్నారు. రుతుస్రావం సందర్భంగా వచ్చే నీరసం, బలహీనత పది గంటల పాటు పనిచేయనీయదు. వారి పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ‘టైమ్‌కీపర్’ వారికి గంట విశ్రాంతి కూడా ఇవ్వరు. మూత్రానికి వెళ్లిన పది నిమిషాల్లో తిరిగి రావాలి. మూత్రానికి కూడా ఎక్కువ సార్లు పోనీయరు. పోతే గంటకింతా, అరగంటకింతా అని వేతనాలు కట్ చేస్తారు. మరి రుతుస్రావం సమయంలో మహిళలు పనిచేసేది ఎలా ? దీనికి సులభమైన మార్గాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలే కనిపెట్టాయి. రుతుస్రావం సమయంలో మహిళలకు పెయిన్ కిల్లర్స్ లాంటి మాత్రలను టైమ్ కీపర్ల ద్వారా యాజమాన్యాలే సరఫరా చేస్తున్నాయి. ‘థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్’ ఇటీవల వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తోన్న వంద మందికి పైగా మహిళా కార్మికులను ఇంటర్వ్యూ చేయగా వారిలో 90 శాతం మంది ఇలాంటి పిల్స్ తీసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా భయంకరమైన విషయం. తరచుగా ఈ పిల్స్‌ను వాడడం వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి, గాబరా పెరుగుతుంది. గర్భాశయం వద్ద క్యాన్సర్ రహిత కణతులు ఏర్పడతాయి. ఇతర ఇన్ఫెక్షన్లూ వస్తాయి. కొందరిలో గర్భస్రావం కూడా జరుగుతుంది. ఫ్యాక్టరీలు సరఫరా చేస్తున్న ఈ పిల్స్‌పై ఓ కాగితంగానీ, బ్రాండ్ నేమ్‌గానీ, ఆఖరికి అది ఎక్స్పైర్ అయిందా, లేదా కూడా తెలియడం లేదని దర్యాప్తులో తేలింది. ఈ పిల్స్ కారణంగా తాను తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సుధా అనే 17 ఏళ్ల యువతి తెలిపింది. చిత్తు కాగితాలు ఏరుకుని బతికే తన తల్లికి తోడుగా ఉండేందుకు తానీ పనిలో చేరానని, నెలకు ఆరు వేల రూపాయలు వస్తాయని, వారానికి ఒక్క రోజు మినహా ఎలాంటి సెలవులు ఉండవని, సెలవు పెడితే జీతం కట్ చేస్తారని తెలిపింది. తమ కుటుంబానికి లక్షన్నర రూపాయల అప్పు ఉండడం వల్ల తప్పనిసరిగా తానీ పనిలో కొనసాగాల్సి వస్తోందని వాపోయారు. మరో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కనగ మరిముత్తు అనే 21 ఏళ్ల యువతి పిల్స్ కారణంగా తన ఆరోగ్యం పాడవుతోందని, తీసుకోకపోతే పనిచేసే పరిస్థితి ఉండడం లేదని చెప్పారు. ఈ పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తెలియదని, తమకు ఎవరు ఆ విషయం తెలపలేదని చెప్పారు. ఐబ్రూఫెన్, అడ్విల్ లాంటి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్‌ను మహిళలకు ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. రుతుస్రావాన్ని అరికట్టేందుకు మందులు ఇస్తున్న మాట వాస్తవమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ టైమ్ కీపర్ తెలిపారు. యాజమాన్యమే వాటిని తమకు సరఫరా చేస్తోందని, అయితే వాటి పేరేమిటో, వాటి వల్ల లాభమా, నష్టమా కూడా తనకు తెలియదని, తాను వాటిని వాడాల్సిన అవసరం రాలేదని మధ్యవయస్కురాలైన ఆమె చెప్పారు. తమ దృష్టికి ఈ విషయం రాలేదని, ఇలాంటి అనైతిక చర్యలకు తాము పాల్పడమని 500 వస్త్ర కంపెనీలకు సభ్యత్వం కలిగిన ‘సదరన్ మిల్లర్స్ అసోసియేషన్’ ప్రధాన కార్యదర్శి సెల్వరాజు కందస్వామి చెప్పారు. ఈ డ్రగ్స్ తీసుకొని బాధ పడుతున్న వస్త్ర ఫ్యాక్టరీల మహిళలు తమ వద్దకు పదుల సంఖ్యలో వస్తున్నారని దిండిగుల్లో క్లినిక్ నడుపుతున్న డాక్టర్ పీ. నళిన కుమారి తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం అర్హులైన నర్సులు, డాక్టర్లతో కంపెనీలే స్వయంగా డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలి. ఎక్కువ ఫ్యాక్టరీలను కలిగిన అతికొద్ది మంది మాత్రమే డిస్పెన్సరీలను నడుపుతున్నారు. చాలా కంపెనీలు ఫ్యాక్టరీల్లో టైమ్ కీపర్ల ద్వారా కడుపు నొప్పికి, తల నొప్పికి, నడుము నొప్పులకు సాధారణ మాత్రలను సరఫరా చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. -
గార్మెంట్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
తాడిపత్రి రూరల్ : పట్టణంలోని గన్నెవారిపల్లికాలనీలో గల శ్రీ కాశీవిశ్వనాథ్ రెడిమేడ్ గార్మెంట్స్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున అగ్రిపమాదం సంభవించింది. 70 కుట్టుమిషన్లతోపాటు దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. పరిశ్రమలో నుంచి మంటలు రావడంతో స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు తెలిపారు. పోలీసులు గార్మెంట్స్ యజమానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన పరిశ్రమ వద్దకు వచ్చారు. అప్పటికే మంటలు చెలరేగుతుండటంతో అగ్నిమాపక సిబ్బందిని రప్పించి అదుపు చేయించారు. దాదాపు రూ.80 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు పెద్దన్న ఆవేదన వ్యక్తం చేశాడు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని బాధితుడు వాపోయాడు.