కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని వస్త్ర రంగానికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ (ఐఐజీఎఫ్)లో పాల్గొని మాట్లాడారు.
‘జౌళి రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా రూ.10,000 కోట్లు అందిస్తున్న కేంద్రం..దీన్ని గార్మెంట్స్ రంగానికి విస్తరించాలని యోచిస్తోంది. వస్త్ర రంగంలో ఎగుమతులను పెంచుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.13 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులను పరిశ్రమ లక్ష్యంగా నిర్ణయించింది. దేశంలో మ్యాన్ మేడ్ ఫైబర్(ఎంఎంఎఫ్) అపెరల్, ఫ్యాబ్రిక్స్ అండ్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఐదేళ్ల వ్యవధికిగాను 2021లో పీఎల్‌ఐలో భాగంగా రూ.10,683 కోట్ల ఇచ్చేందుకు ఆమోదించింది. పరిశ్రమ తన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకాన్ని గార్మెంట్స్(వస్త్ర) రంగానికి విస్తరించాలని యోచిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ టెక్స్‌టైల్స్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం సుమారు 165 బిలియన్ డాలర్లుగా(రూ.13 లక్షల కోట్లు) ఉంది. దాన్ని రానున్న రోజుల్లో 350 బిలియన్ డాలర్ల(సుమారు రూ.27 లక్షల కోట్లు)కు పెంచాల్సి ఉంది. ఈ రంగంలో చైనా కంటే ముందుండేందుకు మంత్రిత్వ శాఖ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోంది’ అన్నారు.
ఇదీ చదవండి: ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈకామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచే అవకాశాలను అన్వేషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ‘గ్రీన్ టెక్స్‌టైల్స్, రీసైక్లింగ్‌పై దృష్టి సారించాలి. గ్లోబల్ బ్రాండ్‌లకు సరఫరాదారులుగా మారకుండా దేశీయ కంపెనీలు తమ సొంత బ్రాండ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కుల పథకం(ఎస్‌ఐటీపీ)ను పునరుద్ధరించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త టెక్స్‌టైల్ పార్కులను రూపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటికే 54 టెక్స్‌టైల్ పార్కులు మంజూరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment