వెయ్యి కోట్ల భారీ పెట్టుబడి | Kitex Garments to invest Rs 1,000 crore in Telangana | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్ల భారీ పెట్టుబడి

Jul 10 2021 2:28 AM | Updated on Jul 10 2021 3:54 AM

Kitex Garments to invest Rs 1,000 crore in Telangana  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గీసుకొండ: చిన్నపిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంస్థ ‘కిటెక్స్‌’ (కిటెక్స్‌ గ్రూప్‌) తెలంగాణలో పెట్టుబ డులు పెట్టనుంది. తొలిదశలో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ (కేఎంటీపీ)లో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కిటెక్స్‌ సంస్థ ఎమ్‌డీ సాబు ఎం. జాకబ్‌ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వస్త్ర పరిశ్రమకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అరుదని ప్రశంసించారు. సాబు జాకబ్‌తో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శుక్రవారం కొచ్చి నుంచి హైదరాబాద్‌ చేరుకుంది. అనంతరం టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సిం హారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందంతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌లోని కేఎంటీపీని సందర్శించింది. 

అనంతరం హైదరాబాద్‌ తిరిగొచ్చి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రత్యే కంగా భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు, పారిశ్రామిక విధానం ప్రత్యేకతల గురించి కిటెక్స్‌ బృందానికి మంత్రి కేటీఆర్‌ వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు, పారిశ్రామిక అవసరాలకు నిరంతర విద్యుత్, పత్తిసాగులో రాష్ట్రం ప్రత్యేకత తదితర అంశాల గురించి విపులంగా తెలియజేశారు. కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటిది దేశంలో ఎక్కడా లేదన్న కిటెక్స్‌ ప్రతినిధి బృందం.. ప్రభుత్వ విధానాలపై, తమ ప్రతిపాదనలకు సర్కారు స్పందించిన తీరుపై  ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా కిటెక్స్‌ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్‌కు వివరించింది. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీయస్‌ ఐపాస్‌ చట్టం మేరకు మెగా ప్రాజెక్ట్‌ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్‌ మేడ్‌ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ అధికారులు శైలజా రామయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సర్కారు సత్వర చొరవతో..
కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్‌.. తాజాగా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ సహా 9 రాష్ట్రాలు ఆ సంస్థను ఆహ్వానించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది. సాబు జాకబ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు కిటెక్స్‌ ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. సంస్థ ప్రతినిధులు వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ను సందర్శించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement