మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
సాక్షి, రాప్తాడు: పదవులు ముఖ్యం కాదు..నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమని, ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటానని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం విజయవాడ నుంచి నియోజకవర్గానికి ఎమ్మెల్యే వస్తుండడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకొని స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి 150 వాహనాలతో భారీ కాన్వాయ్‌గా బయల్దేరి సాయంత్రం రాప్తాడుకు చేరుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి పదవి రాలేదని తాను ఎక్కడ బాధపడతానోనని అధైర్యపడొద్దు..మీ వెంట మేమున్నాం..అందరం కలిసి టీడీపీని సమాధి చేద్దాం అని చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు. సామాజిక సమీకరణలు, అనుభవరీత్యా పెద్దలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మనసు నిండా ఎప్పటికీ తాను ఉంటానన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క...నేటి నుంచి ఒక లెక్క...మీరందరూ కోరుకున్నట్లే మీ అందరితో ఉంటా.. మీలో ఒక్కడిలా ఉంటా...మీ కోసం ఎందాకైనా వస్తానని అన్నారు.
అభివృద్ధి విషయంలో తగ్గేదేలే..
నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తగ్గేదేలేదని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో 2024 కల్లా మూడు రిజర్వాయర్లను పూర్తి చేసి, లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో గార్మెంట్స్ పరిశ్రమను రాప్తాడులో 12 ఎకరాల్లోనే స్థాపించి, 6 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. రూ.30 కోట్లతో కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్నారు. జూన్‌లో తోపుదుర్తి సహకార మహిళా డెయిరీని ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉపాధిని కల్పిస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల సునీత 28 ఎకరాల్లో 6 వేల మందికి ఉపాధి అని చెప్పి, ప్రహరీ కూడా కట్టలేదన్నారు. నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని, ఇప్పటికి 14,800 ఇళ్లు మంజూరు చేశామన్నారు.
2024లో టీడీపీని భూస్థాపితం చేస్తాం
జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో నాకు అవకాశం దక్కపోవచ్చని, 2024 ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిస్తామన్నారు.టీడీపీ హయాంలో జాకీ వెళ్లిపోతే దొంగలు పడిన ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు మూడేళ్ల తర్వాత జాకీ పోయిందని అంటున్నారన్నారని ఎమ్మెల్యే విమర్శించారు. టీడీపీకి జనం ఎప్పుడో జాకీలు ఇప్పేశారని, ఇంజిన్ కూడా కూలిపోయిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు, టీడీపీకి ఉనికి ఉంటుందన్నారు. సోషల్‌మీడియా, ఎల్లో మీడియాను ఉపయోగించి, తమ కుటుంబంపై నిందలు వేస్తున్నారని, మీలాగా దోపిడీకి అధికారాన్ని అడ్డం పెట్టుకోలేదన్నారు. 30 ఏళ్లుగా వేలాది కోట్లు సంపాదించారని, ఆక్రమించిన భూమి ఎంతో..సర్వే నంబర్లతో సహా ప్రకటించినా సిగ్గురాలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment