
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు నాయుడు నోరు విప్పితే అన్నీ అబద్దాలేనని, అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజే ముద్దన్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురంలో తలపెట్టిన ఎన్నికల ‘సమర శంఖారావం’లో పాల్గొన్న ఆయన మోసపూరిత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.
గత ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా 600కిపైగా హామీలిచ్చారని, కానీ అందులో ఆరు హామీలు కూడా అమలు చేయలేదని ఆరోపించారు. టీడీపీ హామీల గురించి ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే ప్రసక్తే లేదని సాక్షాత్తు మంత్రి పరిటాల సునీతే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు.