ఔత్సాహిక పారిశ్రామికవేత్త మేకా శిరీష
యూరో క్లోతింగ్ కంపెనీ. అతి పెద్ద గార్మెంట్ ఫ్యాక్టరీల్లో ఇదొకటి. ఒక యూనిట్ కర్ణాటక రాష్ట్రం, మాండ్యా జిల్లా, శ్రీరంగపట్టణంలో ఉంది. కోవిడ్ కారణంగా లే ఆఫ్ ప్రకటించింది. 1300 మంది ఉద్యోగాలు రోడ్డున పడ్డాయి. వస్త్రపరిశ్రమలకు కొత్త ఆర్డర్‌లు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, ఉన్న ఆర్డర్‌లు కూడా రద్దవుతున్నాయి. ప్రస్తుతానికి పని ఆపేయడం ఒక్కటే మార్గం అనుకుంటున్న కంపెనీలు ఇలా లే ఆఫ్ ప్రకటించేస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఇలా ఉంటే... చిన్న పరిశ్రమ నడిపే మేకా శిరీష మాత్రం తన ఉద్యోగులకు పని భద్రత కల్పించి ఆదర్శంగా నిలిచారు.
చేయి చాచనివ్వలేదు
హైదరాబాద్‌లో ఓ చిన్న గార్మెంట్ యూనిట్ నడుపుతున్న శిరీష లాక్‌డౌన్ కష్టకాలంలో తన ఉద్యోగుల సంపాదన మార్గాన్ని సంరక్షించగలిగారు. ఆమె గార్మెంట్ యూనిట్‌ని కరోనా పోరాటంలో భాగం చేశారు. అప్పటివరకు యూనిఫామ్‌లు కుడుతున్న తన ఉద్యోగులకు పీపీఈ కిట్‌లు కుట్టడంలో శిక్షణ ఇప్పించారు. ‘‘పీపీఈ కిట్‌ల మెటీరియల్ కోసం, ఆర్డర్‌ల కోసం రోజుకు పదహారు గంటలు పని చేశాను. నాతో పనిచేసే మహిళలకు రోజుకు ఐదు వందల రూపాయలు రాబడిని చూపించగలిగాను. సంస్థ నిర్వహణలో ఎప్పుడూ అవసరానికి తగినట్లు మార్పులు చేసుకుంటూ ఉద్యోగులకు పని కల్పించాలి. ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించాల్సింది ఈ పీపీఈ కిట్‌ల తయారీలో నాకు లాభాలు వస్తాయా లేదా అని కాదు. పరిశ్రమ నడక సజావుగా సాగాలి. తమకు పని ఉందనే భావనే ఉద్యోగులకు ధైర్యాన్నిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. యజమాని ఉద్యోగుల్లో ఆ ధైర్యాన్ని పాదుకొల్పగలగాలి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గర్వంగా చెప్పగలను. చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఎంతోమంది ఈ కష్టకాలంలో ఉపాధి కోల్పోయి, దాతలిచ్చే విరాళాల కోసం క్యూలో నిలబడ్డారు. నా యూనిట్‌లో పని చేస్తున్న మహిళలకు విరాళాల కోసం చేయి చాచాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోగలిగాను’’ అన్నారు శిరీష.
తెనాలమ్మాయి
పాతికేళ్ల కిందట హైదరాబాద్, కూకట్‌పల్లిలో సొంతంగా పరిశ్రమ పెట్టిన శిరీష సొంతూరు గుంటూరు జిల్లా, తెనాలికి సమీపంలో ఉన్న మున్నంగి. తెనాలికి ఆంధ్రాపారిస్ అని పేరు. శిరీష ఫ్యాషన్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి, అప్పటికి తెలుగురాష్ట్రాల్లో నడుస్తున్న ఫ్యాషన్‌కంటే రెండడుగులు ముందుగా ఉండడానికి కారణం ఆ నేల ప్రభావం కూడా ఉన్నట్లుంది. ఆమె 1996లో బొటీక్ స్థాపించి విజయవంతంగా నడిపించారు. ‘‘వస్త్రవ్యాపారం ప్రధానంగా మగవాళ్ల చేతుల్లోనే ఉన్న రోజులవి. మగవాళ్లు టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలు తయారు చేసిన దుస్తులను యదాతథంగా తెచ్చి షోరూమ్‌లో అమ్మేవాళ్లు. నేను ప్రయోగాలు చేశాను. నా తొలి ప్రయోగం మా గుంటూరు మంగళగిరి కాటన్‌తోనే. బెనారస్ నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల చేనేతలనూ నా బొటీక్‌కు తెచ్చాను. ప్రతిదీ కస్టమైజ్‌డ్ పీస్ కావడంతో బాగా క్లిక్ అయింది. తర్వాత మగ్గం వర్క్ కూడా చేర్చాను. నా బొటీక్ ప్రచారం కోసం ఒక్క పాంప్లెట్ కూడా వేయించలేదు. ప్రతి మోడల్‌నీ, ప్రతి డిజైన్‌నీ నేను ఒక పీస్ చేయించుకుని ధరించడమే నా ప్రచారం. నాకు నేనే అంబాసిడర్‌ని’’ నవ్వుతూ అన్నారామె.
యజమానికి పరీక్ష
‘నాకు ఆస్తులున్నాయి. నాకు వచ్చే నష్టం ఏమీ లేదు... కాబట్టి లాక్‌డౌన్ నుంచి పరిస్థితి చక్కబడే వరకు యూనిట్‌ను మూసేస్తాను. ఉద్యోగులు రోడ్డున పడితే నాకేంటి’ అనుకునే మనస్తత్వం పరిశ్రమ నిర్వహణకు ఏ మాత్రం పనికి రాదు. అలాంటి వాళ్లు పరిశ్రమ బాధ్యతను తలకెత్తుకోక పోవడమే మంచిది. వ్యాపారం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల ఉపాధికి భరోసా కలిగించాలి. యజమాని తనను తాను నిరూపించుకోగలిగేది ఇలాంటి కష్టకాలంలోనే.– మేకా శిరీష
గెలిపించిన అసంతృప్తి
పరిశ్రమ నిర్వహణ గురించి ఇంత చక్కగా పండు వలిచి చేతిలో పెట్టినట్లు వివరిస్తున్న శిరీష మున్నంగి నుంచి హైదరాబాద్‌కు సాగిన తన ప్రస్థానాన్ని వివరించారు. ‘‘మా నాన్న చిన్నప్పుడే పోవడంతో నన్ను, అన్నయ్యను పెంచి పెద్దచేసే బాధ్యత అమ్మదే అయింది. మా ఊళ్లో కాలేజ్ లేకపోవడంతో నేను టెన్త్‌తోనే చదువాపేయాల్సి వచ్చింది. పెళ్లయిన తర్వాత 1988లో మున్నంగి నుంచి హైదరాబాద్‌కి వచ్చాను. నాకు ఏదో ఒకటి చేయాలని, నన్ను నేను నిరూపించుకోవాలని ఉండేది. చదువుకోలేకపోయాననే అసంతృప్తితో వారపత్రికలతోపాటు ఎన్ని పుస్తకాలు చదివానో లెక్కేలేదు. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పత్రికల పాత్ర చాలా పెద్దది. నాకంటూ ఉన్న లక్ష్యాలను చేరాలంటే సొంతంగా పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. పక్కింటి ఆంటీ దగ్గర టైలరింగ్ నేర్చుకుని ‘సఖి బొటీక్’ పెట్టాను. రెండేళ్ల కిందట షాపూర్‌లో యూనిఫామ్‌లు కుట్టే గార్మెంట్ యూనిట్ చేపట్టాను. లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు ప్రారంభమయ్యే టైమ్‌టేబుల్‌లో అనిశ్చితి ఉంది. యూనిఫామ్ కుట్టే పని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. యూనిట్‌లో పని చేసే వాళ్లకు పని కల్పించడం కోసం పీపీఈ కిట్‌లకు మారిపోయాం. డాక్టర్లు, హాస్పిటళ్లతో నాకున్న పరిచయాలే నా మార్కెట్. మోడల్ పీస్ ఒక్కొక్కటి ఇచ్చి వాళ్లు ధరించిన తర్వాత వాళ్లకు తగినట్లు మార్పులు సూచించమని అడిగాను. అలా సౌకర్యవంతంగా మార్పులు చేయగలిగాం. స్కూళ్లు తెరిచి పరిస్థితులు గాడిన పడేవరకు పీపీఈ కిట్‌ల అవసరం ఉండనే ఉంటుంది’’ అన్నారు శిరీష.
వ్యాపారంలో విజేతగా నిలబెట్టే లక్షణం ఒకటి ఉంటుంది. అది సమాజంలో ఎదురయ్యే అవసరాన్ని మిగిలిన వారికంటే ముందుగా గుర్తించగలిగిన నైపుణ్యం. ఇందుకు పెద్ద కోర్సులేవీ అక్కరలేదని నిరూపిస్తోంది శిరీష. అలాగే తన ఉద్యోగులు ఆకలితో ఉండకూడదనే అమ్మతనం మగవాళ్లలో కంటే మహిళల్లోనే ఎక్కువని చెప్పడానికి కూడా ప్రతీక ఆమె.– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment