gas cylinder accident
-
తీవ్ర విషాదం: వంటింట్లో గ్యాస్ లీక్.. భర్తను పిలుచుకుని వచ్చేలోపే...
పట్నా: ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అయిదుగురు చిన్నారులు మృత్యువాత పడిన విషాద ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బంకా జిల్లా రాజావర్ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన పిల్లలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. మృతుల్లో ఓ బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ పాశ్వాన్‌కు చెందిన ఇంట్లో సాయంత్రం చిన్నారులంతా ఆడుకుంటున్నారు. అదే సమయంలో అతని భార్య సునీత వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగించడంతో గ్యాస్ పైపులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి భయపడిన సునీత వెంటనే భర్తను పిలవడానికి బయటికి పరుగులు తీసింది. ఇంతలోనే సిలిండర్ పేలడంతో ఇంట్లోనే కూర్చున్న అయిదుగురు చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గంటలోనే ఇల్లంతా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అశోక్ పాశ్వాన్ నలుగురు పిల్లలు, సోదరుడు ప్రకాష్ కూతురు మరణించారు. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన మరో ఇద్దరికి కూడా గాయాలవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత ప్రమాదం జరిగిన సమయంలో ప్రకాష్‌కు చెందిన కుమారుడు, కుమార్తె ఇంటి బయట ఉండడంతో వారిద్దరి ప్రాణాలు దక్కాయి. అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఉజ్వల పథకం కింద అతని ఇంటికి గ్యాస్ స్టవ్ వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. సంఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారి మొయినుద్దీన్ తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యోగి, ఆర్ఎస్ఎస్ పేరు చెప్పమని ఏటీఎస్ బెదిరించింది -
ఒకే సిలిండర్‌కు 3 గ్యాస్ కనెక్షన్లు.. నానక్‌రామ్‌గూడలో భారీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్ గూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే సిలిండర్‌కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఒక కనెక్షన్లో గ్యాస్ లీకేజీ కావడంతో.. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో లైట్స్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంగా యూపీ, బీహార్‌కు చెందినవారు. పొట్టకూటి కోసం నగరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. -
ప్రొద్దుటూరు: ప్రైవేట్ అంబులెన్స్‌లో పేలుడు
-
ప్రొద్దుటూరు: ప్రైవేట్ అంబులెన్స్‌లో పేలుడు
వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఒక ప్రైవేటు అంబులెన్స్‌లో గ్యాస్ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ క్రమంలో స్థానికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. -
ఢిల్లీలో సిలిండర్ పేలుడు.. నలుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్ష్ బజార్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి త్రీవ గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో నలుగురు మరణించారని, మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. చదవండి: ట్విట్టర్‌పై కేసుల వెల్లువ -
గ్యాస్ సిలిండర్ పేలుళ్లు : జాగ్రత్తలు తీసుకోండిలా..
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, గ్యాస్ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల నిమిత్తం టెక్నికల్ సిబ్బందిని నియమించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎజెన్సీల వద్ద గ్యాస్ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్ కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతున్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి ప్రైవేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఒకవైపు ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకు దారి తీస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని ఒక గుడిసెలో గురువారం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి గుడిసె దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్‌బోయిన్‌పల్లి ఈద్గా సమీపంలోని రామకష్ణ పాఠశాల వద్ద ఒక ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. మంటల ధాటికి ఇళ్లల్లోని ఫర్నిచర్సహా ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ రెండు సంఘటనలను బట్టిచూస్తే వంటింట్లో వంట గ్యాస్ విస్ఫోటంగా తయారైంది. పరీక్షలో నిర్లక్ష్యం... ► వంట గ్యాస్ సిలిండర్ పరీక్షల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సిలిండర్ జీవిత కాలపరిమితి పదేళ్లు. ఆ తర్వాత తిరిగి పరిశీలించి సిలిండర్ ప్రమాణాల ను బట్టి మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయడమా? లేదా తుప్పు కింద పడేయడం చేయాల్సి ఉంటుంది. ► రీఫిల్లింగ్ జరిగే ప్రతిసారి సిలిండర్ రీఫిల్ బాడీ ఇతరత్రా వాటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయిల్ కంపెనీలు టెర్మినల్‌కు వచ్చిన సిలిండర్‌ను మొక్కుబడి పరిశీలనతో రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిలిండర్ పై డ్యూడేట్... ► వంట గ్యాస్ సిలిండర్ భద్రత ప్రమాణాలను కాలపరిమితి (డ్యూ డేట్) బట్టి గుర్తించవచ్చు. ► సిలిండర్‌పై త్రైమాసాకానికి ఒక కేటగిరిగా అక్షరాలు డ్యూ డేట్‌గా ఉంటాయి. అక్షరంతో పాటు అంకె అంటే కాలపరిమితి గడువు సంవత్సరం కూడా ఉంటుంది. ► ఉదాహరణకు సిలిండర్ పై ఏ-21 బీ-21, సీ-21, డీ-21 అనే అక్షరాలు ఉంటాయి. ఏ-అంటే జనవరి నుంచి మార్చి వరకు, బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పరిగణించాలి. పక్కన ఉన్న అంకెను సంవత్సరంగా గుర్తించాలి. ఇవీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦సిలిండర్ డోర్ డెలివరీ కాగానే సీల్ కరెక్టుగా ఉందా, లేదా చూసుకోవాలి. సిలిండర్ కాలపరిమితి పరిశీలించాలి. ♦సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా...గ్యాస్ వాసన వచ్చినా తిరిగి సిలిండర్ వెనక్కి పంపాలి. రెగ్యులేటర్, బర్నర్‌ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి స్టవ్‌ను మార్చు కోవాలి. ♦ వంట గ్యాస్ స్టౌ వినియోగించని సమయంలో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. రాత్రి పూట తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్‌లో ఉంచాలి. ♦వంట గది తలుపుల కింద కనీసం ఒక అంగుళం ఖాళీగా ఉండే విధంగా చూడాలి. ♦ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తప్పనిసరిగా వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఏమరుపాటు పనికి రాదు. ♦ విద్యుత్ స్విచ్‌లు ముట్టుకోవడం, అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు. విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయవద్దు. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చే చిన్నపాటి స్పార్క్(మెరుపు) ప్రమాదానికి దారితీస్తోంది. ♦ గ్యాస్ వాసన పసిగట్టగానే తక్షణం వంటింటి తలుపులు, కిటికీలు బార్లా తెరిచి గ్యాస్‌ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ♦ ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే సిలిండర్‌ను బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశంలో సేఫ్టీ పిన్ బిగించి ఉంచాలి. ♦ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండాలి. సిలిండర్‌ను నిలువుగానే పెట్టాలి. ♦ వంట గదిలో ఫ్రిజ్ పెట్టవద్దు. అందులో ఉండే థర్మోస్టాట్ వల్ల ఆటో కటాఫ్ అవుతోంది. గ్యాస్ లీకైన సమయంలో ఇటువంటి ప్రమాదానికి దారితీస్తోంది. గుడిసెలో పేలిన సిలిండర్లు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని ఉదయ్‌నగర్ బస్తీలో గురువారం ఉదయం తాళం వేసిన గుడిసెలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.... ఉదయ్‌నగర్ బస్తీలో సావిత్రి అనే మహిళ తన ఇంటిపై గుడిసెలు వేసి అద్దెకిచ్చింది. గోపాల్–మంగమ్మ దంపతులు ఓ గుడిసెలో, నర్సింహ అనే వ్యక్తి మరో గుడిసెలో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వారు గుడిసెకు తాళం వేసి పనికి వెళ్లిపోయారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో ఇంటి యజమాని సావిత్రికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గుడిసెలో ఉన్న సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో రూ. లక్ష నగదు కాలిపోయినట్లు మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కళ్లముందే డబ్బు, సామగ్రి, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు బోరున విలపించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిలిండర్ పేలుళ్లకు పరిహారమేదీ?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా ప్రమాదవశాత్తూ వంటగ్యాస్ సిలిండర్ పేలుళ్లకు వందలాది మంది బలవుతున్నా, భారీగా ఆస్తినష్టం సంభవిస్తున్నా బాధిత కుటుంబాలు చట్ట ప్రకారం పొందాల్సిన బీమా పరిహారానికి నోచుకోవడంలేదు. ప్రమాదాలకు గురయ్యే ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. దీనిపై వినియోగదారులకు కనీస అవగాహన లేకపోవడం, చమురు సంస్థలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు సైతం పెద్దగా ప్రచారం చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదాలకు బీమా సదుపాయం ఉందని తెలిసిన అతికొద్ది మందికే తూతూమంత్రంగా పరిహారం దక్కుతోంది. గత పదేళ్లలో గ్యాస్ సిలిండర్ పేలుళ్ల కారణంగా తెలంగాణలో 657 మంది మృతిచెందగా కేవలం 25 మందికే బీమా పరిహారం అందగా దాదాపు 2,300 మంది క్షతగాత్రుల్లో ఏ ఒక్కరికీ పరిహారం లభించలేదు. అలాగే ఈ ప్రమాదాల్లో 1,100కుపైగా ఇళ్లు ధ్వంసమైతే ఆస్తి నష్టం కింద బాధితులకు పైసా పరిహారం కూడా దక్కలేదు. చమురు సంస్థలు ప్రీమియం చెల్లిస్తున్నా... ఏదైనా కారణం చేత వంటగ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఎవరైనా మరణించినా, ఆస్తులకు నష్టం వాటిల్లినా బీమా పరిహారం తప్పనిసరి. ప్రభుత్వరంగ చమురు సంస్థలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు తమ పబ్లిక్ లయబిలిటీ పాలసీని అనుసరించి (పాలసీ నంబర్ 021700/ 46/14/37/0000041) ఒక్కో వ్యక్తి మరణానికి రూ. 5 లక్షల చొప్పున, ఒక్కో క్షతగాత్రుడికి గరిష్టంగా రూ. లక్ష చొప్పున, ప్రమాదం మొత్తంమీద గరిష్టంగా రూ. 15 లక్షలను వైద్య ఖర్చుల కింద బీమా పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అలాగే ఆస్తి నష్టానికి గరిష్టంగా రూ. లక్ష పరిహారం అందించాల్సి ఉంది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు బీమా కంపెనీలకు ప్రీమియం (పర్ సిలిండర్) చెల్లిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. 2010 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల వాడకం 28 శాతం ఉండగా ఇప్పుడది 83 శాతానికి పెరిగింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఏటేటా 11 శాతం నుంచి 13 శాతం మేర కనెక్షన్లు పెరుగుతున్నాయి. దాంతోపాటే సిలిండర్ పేలుడు ప్రమాదాలూ ఎక్కువవుతున్నాయి. వినియోగదారులు, డీలర్లలో అవగాహనలేమి... ఎల్పీజీ వినియోగదారుల్లో అత్యధిక శాతం మందికి బీమా సదుపాయం ఉందన్న సంగతే తెలియదు. పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మంది వినియోగదారులు, 60 శాతం మంది డీలర్లకు బీమా సదుపాయం గురించి అవగాహన లేదని విస్తరణ మాస్ కమ్యూనికేషన్ సొసైటీ పరిశీలనలో బయటపడింది. ఈ విషయంలో వినియోగదారులు, డీలర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాలేవీ ఆయిల్ కంపెనీలు చేపట్టడం లేదు. ఆయిల్ కంపెనీలు తమ నుంచి సరఫరా అయ్యే ప్రతి సిలిండర్‌కు ప్రీమియం చెల్లిస్తున్నా ప్రచారం చేయకపోవడంతో వినియోగదారులు, డీలర్లకు దీని గురించి తెలియడంలేదు. తమిళనాడు, కేరళ మినహా దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సిలిండర్ పేలుళ్లు ఎక్కువగా జరుగుతున్న విషయం గమనించిన పరివర్తన్ మరఠ్వాడా అనే స్వచ్ఛంద సంస్థ బాధిత కుటుంబాల చేత స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయించి మరీ బీమా కంపెనీల నుంచి పరిహారం ఇప్పిస్తోంది. వీరెవరికీ పరిహారం రాలేదు గతేడాది నవంబర్ 19న హైదరాబాద్‌లోని తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఉన్న అడ్డగుట్టలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి దినేష్ అనే టీనేజర్ మరణించడంతోపాటు ఇల్లు ధ్వంసమైంది. నిబంధన ల ప్రకారం అతని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల మేర బీమా పరిహారం, ఇల్లు ధ్వంసమైనందుకు మరో రూ. లక్ష అందాల్సి ఉన్నా అందలేదు. 2017 మార్చి 27న హిమాయత్‌నగర్‌లోని శ్యామల బుచ్చమ్మ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఇల్లు సగభాగం ధ్వంసమైంది. దాదాపు రూ. 25 లక్షల మేర నష్టం వాటిల్లినా నిబంధనల మేరకు రావాల్సిన లక్ష పరిహారం కూడా రాలేదు. గతేడాది జూలై 26న కుల్సుంపురాలో సిలిండర్ పేలుడు ప్రమాదంలో రామకృష్ణ (55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎవరికీ పైసా బీమా పరిహారం అందలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో గతేడాది సెప్టెంబర్ 4న సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి రూ. 10 లక్షల మేర బీమా రావాల్సి ఉన్నా ఆయిల్ కంపెనీగానీ, ఎల్పీజీ డీలర్గానీ పట్టించుకోలేదు. డీలర్ల నిర్లక్ష్యమే... వినియోగదారులు లేదా గోడౌన్లలో పని చేసే సిబ్బంది ప్రమాదవశాత్తూ మరణించినా లేదా గాయపడినా బీమా సదుపాయం ఉంటుందని మేము కచ్చితంగా డీలర్లకు వివరిస్తాం. ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పాలని సూచిస్తున్నా వారు పట్టించుకోవడంలేదు. వినియోగదారులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న నిబంధననూ గాలికి వదిలేస్తున్నారు. అయితే ఎవరైనా వచ్చి ప్రమాద ఘటన వివరాలు మా దృష్టికి తెస్తే పరిహారం ఇప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సీనియర్ మేనేజర్, బీపీసీఎల్ -
ఇంట్లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కార్వాన్‌పేట ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో జయశ్రీ (30), ఆమె కుమారుడు సాయి కార్తీక్ (6)కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో జయశ్రీ భర్త కర్నూలులో ఉన్నారు. ఆయన ఎస్బీఐ ఉద్యోగి. -
సిలిండర్ లీకై భారీ ప్రమాదం
తగరపువలస: విశాఖ నగరం తగరపువలస ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ లీకై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిట్టివలస జెడ్పీ హైస్కూల్ వెనుక భాగంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. రెగ్యులేటర్ పెట్టేందుకు సిలిండర్‌కు ఉన్న క్యాప్ తీయగా, వెంటనే గ్యాస్ అధిక ఒత్తిడితో బయటకు వచ్చింది. ఆ సమయంలో ఇంటి ముందు కట్టెల పొయ్యి వెలిగించి ఉండడంతో గ్యాస్ అక్కడకు వ్యాపించి అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఇళ్లంతా కాలిపోగా అక్కడున్న పడిమి వెంకటరామారావు (47), నూలు భాస్కర్ రావు (51), నూలు రామ్మూర్తి (59) అనే ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని కేజీహెచ్‌కు తరలించారు. నూలు భాస్కర్‌రావు పరిస్థితి విషమంగా ఉంది.