ఫైల్ ఫోటో
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, గ్యాస్ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల నిమిత్తం టెక్నికల్ సిబ్బందిని నియమించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎజెన్సీల వద్ద గ్యాస్ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్ కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతున్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి ప్రైవేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఒకవైపు ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకు దారి తీస్తున్నాయి.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని ఒక గుడిసెలో గురువారం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి గుడిసె దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్‌బోయిన్‌పల్లి ఈద్గా సమీపంలోని రామకష్ణ పాఠశాల వద్ద ఒక ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. మంటల ధాటికి ఇళ్లల్లోని ఫర్నిచర్‌సహా ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ రెండు సంఘటనలను బట్టిచూస్తే వంటింట్లో వంట గ్యాస్ విస్ఫోటంగా తయారైంది.
పరీక్షలో నిర్లక్ష్యం...
► వంట గ్యాస్ సిలిండర్ పరీక్షల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సిలిండర్ జీవిత కాలపరిమితి పదేళ్లు. ఆ తర్వాత తిరిగి పరిశీలించి సిలిండర్ ప్రమాణాల ను బట్టి మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయడమా? లేదా తుప్పు కింద పడేయడం చేయాల్సి ఉంటుంది.
► రీఫిల్లింగ్ జరిగే ప్రతిసారి సిలిండర్ రీఫిల్ బాడీ ఇతరత్రా వాటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయిల్ కంపెనీలు టెర్మినల్‌కు వచ్చిన సిలిండర్‌ను మొక్కుబడి పరిశీలనతో రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సిలిండర్ పై డ్యూడేట్...
► వంట గ్యాస్ సిలిండర్ భద్రత ప్రమాణాలను కాలపరిమితి (డ్యూ డేట్) బట్టి గుర్తించవచ్చు.
► సిలిండర్‌పై త్రైమాసాకానికి ఒక కేటగిరిగా అక్షరాలు డ్యూ డేట్‌గా ఉంటాయి. అక్షరంతో పాటు అంకె అంటే కాలపరిమితి గడువు సంవత్సరం కూడా ఉంటుంది.
► ఉదాహరణకు సిలిండర్ పై ఏ-21 బీ-21, సీ-21, డీ-21 అనే అక్షరాలు ఉంటాయి. ఏ-అంటే జనవరి నుంచి మార్చి వరకు, బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పరిగణించాలి. పక్కన ఉన్న అంకెను సంవత్సరంగా గుర్తించాలి.
ఇవీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦సిలిండర్ డోర్ డెలివరీ కాగానే సీల్ కరెక్టుగా ఉందా, లేదా చూసుకోవాలి. సిలిండర్ కాలపరిమితి పరిశీలించాలి.
♦సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా...గ్యాస్ వాసన వచ్చినా తిరిగి సిలిండర్ వెనక్కి పంపాలి. రెగ్యులేటర్, బర్నర్‌ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి స్టవ్‌ను మార్చు కోవాలి.
♦ వంట గ్యాస్ స్టౌ వినియోగించని సమయంలో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. రాత్రి పూట తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్‌లో ఉంచాలి.
♦వంట గది తలుపుల కింద కనీసం ఒక అంగుళం ఖాళీగా ఉండే విధంగా చూడాలి.
♦ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తప్పనిసరిగా వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఏమరుపాటు పనికి రాదు.
♦ విద్యుత్ స్విచ్‌లు ముట్టుకోవడం, అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు. విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయవద్దు. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చే చిన్నపాటి స్పార్క్(మెరుపు) ప్రమాదానికి దారితీస్తోంది.
♦ గ్యాస్ వాసన పసిగట్టగానే తక్షణం వంటింటి తలుపులు, కిటికీలు బార్లా తెరిచి గ్యాస్‌ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి.
♦ ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే సిలిండర్‌ను బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశంలో సేఫ్టీ పిన్ బిగించి ఉంచాలి.
♦ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండాలి. సిలిండర్‌ను నిలువుగానే పెట్టాలి.
♦ వంట గదిలో ఫ్రిజ్ పెట్టవద్దు. అందులో ఉండే థర్మోస్టాట్ వల్ల ఆటో కటాఫ్ అవుతోంది. గ్యాస్ లీకైన సమయంలో ఇటువంటి ప్రమాదానికి దారితీస్తోంది.
గుడిసెలో పేలిన సిలిండర్లు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని ఉదయ్‌నగర్ బస్తీలో గురువారం ఉదయం తాళం వేసిన గుడిసెలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.... ఉదయ్‌నగర్ బస్తీలో సావిత్రి అనే మహిళ తన ఇంటిపై గుడిసెలు వేసి అద్దెకిచ్చింది. గోపాల్–మంగమ్మ దంపతులు ఓ గుడిసెలో, నర్సింహ అనే వ్యక్తి మరో గుడిసెలో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వారు గుడిసెకు తాళం వేసి పనికి వెళ్లిపోయారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.
ఈ ఘటనలో ఇంటి యజమాని సావిత్రికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గుడిసెలో ఉన్న సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో రూ. లక్ష నగదు కాలిపోయినట్లు మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కళ్లముందే డబ్బు, సామగ్రి, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు బోరున విలపించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment