అదానీ టోటల్ గ్యాస్‌కు ఆడిటర్ రాజీనామా.. కానీ..!
న్యూఢిల్లీ: అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ ఆడిటర్ సేవల నుంచి ‘షా దందారియా’ అనూహ్యంగా తప్పుకుంది. ఇతర బాధ్యతల కారణంగా స్టాట్యుటరీ ఆడిటర్ బాధ్యతలకు షా దందారియా అండ్ కో రాజీనామా సమర్పించినట్టు అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరి 24న నివేదిక విడుదల చేయగా, అందులో షా దందారియా పేరు కూడా ఉండడం గమనార్హం. అదానీ గ్రూపులో పెద్ద కంపెనీల ఖాతాలను, పెద్దగా అనుభవం లేని ఓ చిన్న ఆడిటింగ్ సంస్థ సేవలు అందించడాన్ని హిండెన్‌బర్గ్ సంస్థ ప్రశ్నించింది.
హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తుండడం తెలిసిందే. ఈ తరుణంలో అదానీ గ్రూపు కంపెనీకి ఆడిటర్‌గా షా దందారియా తప్పుకోవడం యాధృచ్చికం. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న చిన్న చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థయే షా దందారియా. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు సైతం ఈ సంస్థ ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. అయితే, ఒక్క అదానీ టోటల్ గ్యాస్ ఆడిటింగ్ సేవలకే ప్రస్తుతం రాజీనామా సమర్పించింది. ముందుగా ఒప్పుకున్న ఇతర బాధ్యతలు మినహా, తమ రాజీనామాకు మరే ఇతర కారణం లేదని షా దందారియా స్పష్టం చేసింది.