20కి చేరిన మృతులు
కాకినాడ: నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కె.చిన్నా శనివారం అర్ధరాత్రి, తాటికాయల రాజ్యలక్ష్మి (25) చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. రాజ్యలక్ష్మి భర్త సత్యనారాయణ, చిన్న కుమార్తె సజీవ దహనం కాగా పెద్ద కుమార్తె లక్ష్మీ జ్యోత్స్నదేవి (4) శుక్రవారం అర్ధరాత్రి మరణించింది. ఆ కుటుంబంలో మిగిలి ఉన్న రాజ్యలక్ష్మి కూడా మరణించడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా మరో ఏడుగురు చికిత్స పొందుతూ మరణించారు.
చిరు, బొత్సలకు నిరసనల సెగ
అమలాపురం: గెయిల్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు నగరం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ‘మాయదారి పరామర్శలు మాకొద్దు.. న్యాయం చేసేవారే రండి. లీడర్స్ గో బ్యాక్, యూపీఏ వల్లే మాకీ దుర్గతి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. బాధితులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.