నంబర్ 1 పాఠశాల
పాఠశాల.. ప్రతి ఒక్కరి జీవితాన్నీ మలుపు తిప్పగలిగే విజ్ఞానశాల. ఆటపాటలతో పాటు అచంచల విజ్ఞానాన్ని అందిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని.. అక్షరజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అలా.. అక్షరజ్ఞానం అందించి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఎందరినో ఉన్నత స్థానాలకు చేర్చిందో పాఠశాల. ఉన్నత స్థాయి అధికారులనే కాక.. అత్యుత్తమ స్థాయి ప్రజా ప్రతినిధులను.. సమున్నత స్థాయి నాయకులనూ అందించిందా పాఠశాల. అదే ఆదిలాబాద్‌లోని గజిటెడ్ నంబర్ 1 పాఠశాల. పేరుకు తగ్గట్టే తీరులోనూ ఆ పాఠశాల నంబర్ వన్నే. దీనిపై నేటి సండేస్పెషల్.
పాఠశాలలో చదివిన ప్రముఖులు
1. జస్టిస్ చంద్రకుమార్, హైకోర్టు న్యాయమూర్తి
2. ఉమాకాంత్‌గౌడ్, సర్జికల్ క్యాన్సర్ స్పెషలిస్టు, హైదరాబాద్
3. ఆకుల నారాయణ, రిటైర్డ్ ఏంఈవో
4. సి.రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, మాజీ డీసీసీ అధ్యక్షుడు
5. కారింగుల దామోదర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు
6. సామల శ్రీవర్థన్, రిటైర్డ్ డీటీవో
7. చిల్కూరి వామన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
8. డి.కిష్టు, రిటైర్డ్ ఎంఈవో
9. సర్దార్ అలీ, పీజీ హెచ్ఎం
10. దేవేందర్ పటాస్కర్, స్కూల్ కరస్పాండెంట్
11. గంగారెడ్డి, రిటైర్డ్ డీవీఈవో
హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రకుమార్
జయచంద్రకుమార్ గజిటెడ్ నంబర్-1 పాఠశాలలో చదువుకున్నారు. ఈయన జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆ పాఠశాలను సందర్శించకుండా వెళ్లరు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ ఏడాది నవంబర్‌లో పాఠశాలను సందర్శించారు. చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నగదు రూపంలో అందజేశారు.
రాష్ట్ర మాజీ మంత్రి చిల్కూరి రాంచంద్రారెడ్డి
రాంచంద్రారెడ్డి ఇదే పాఠశాల విద్యార్థి. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో పదవులను చేపట్టారు. ఎమ్మెల్యే నాలుగుసార్లు, రాష్ట్ర చిన్ననీటి పారుదల, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఏడేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తనకు బోధించిన గురువుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగానని ఆయన అంటుంటారు.
తెలంగాణ ఉద్యమంలో చిల్కూరి వామన్‌రెడ్డి
దివంగత ఎమ్మెల్యే వామన్‌రెడ్డి ఈ పాఠశాలోనే చదువుకున్నారు. మూడుసార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ మలి దశ ఉద్యమం తర్వాత చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆదిలాబాద్‌లోని జేఏసీ నిర్వహించి దీక్ష శిబిరంలో తనవంతుగా పాల్గొంటూ అందరినీ ప్రోత్సహించేవారు. గత ఏడు, ఎనిమిది నెలల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు.
కేయూ సెనెట్ సభ్యులుగా డి.కిష్టు
డి.కిష్టు 34 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. పీజీ హెచ్ఎం, ఆదిలాబాద్ ఎంఈవోగా పని చేసి పదవీ విరమణ పొందారు. రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యులుగా పనిచేశారు. తాను గజిటెడ్ నంబర్ వన్ పాఠశాలలో చదవడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
గురువులకు రుణపడి ఉన్నాం
మాకు బోధించిన గురువులు గొప్పవారు. కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత సదాశివ మాస్టరు స్థాయి వారు మాకు పాఠాలు బోధించారు. వారిని ఎన్నటికీ మరవలేము. వారి బోధనలు ఇప్పటికి మా మదిలోనే మెదులుతాయి. వారు మాకు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనిది. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నేను పద్నాలుగేళ్లు ఆదిలాబాద్‌లో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాను. అనంతరం ఖమ్మంలో ఇంటర్మీడియట్ బోర్డులో డీవీఈవోగా పని చేసి రిటైర్డ్ అయ్యాను.
- గంగారెడ్డి, రిటైర్డ్ డీవీఈవో
కార్పొరేట్లాగా బోధన
మేము చదువుకున్నది ప్రభుత్వ పాఠశాల అయినా కార్పొరేట్ పాఠశాల్లో ఎలాంటి బోధన ఉంటుందో.. ఆ స్థాయిలో మాకు బోధన చేశారు. సర్కారు బడిలో చదువుతున్నాననే ఫీలింగ్ వచ్చేది కాదు. వారి ప్రొత్సాహంతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. మా గురువులకు ఇప్పటికీ ఫోన్ చేసి వారి క్షేమ సమాచారం తెలుసుకుంటాను. గజిటెడ్ నంబర్-1 పాఠశాల అంటే చదువుల్లో కూడా నంబర్ వన్నే. అందుకే ఈ పాఠశాల అంటే నేటి తరం వారికి కూడా ఎంతో అభిమానం. ఇది అక్షరాలా నిజం.
- సచిన్ దేశ్‌పాండే, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, హైదరాబాద్
గురువులంటే అభిమానం
నేను గజిటెడ్ నంబర్-1 పాఠశాలలో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదివాను. మంచి నాణ్యమైన విద్య అందించేవారు. ఇదే పాఠశాలలో మా నాన్న హన్మగౌడ్ టీచర్‌గా పనిచేసేవారు. మా గురువులు లకా్ష్మరెడ్డి, గంగాధర్, విజేందర్‌ల ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగాను. నేను చదివిన గజిటెడ్ పాఠశాలను ఎన్నటికీ మరవను. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, రీజినల్ క్యాన్సర్ సెంటర్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సర్జికల్‌గా పని చేస్తున్నాను.
- ఉమాకాంత్‌గౌడ్, సర్జికల్ క్యాన్సర్ స్పెషలిస్టు, హైదరాబాద్
చదివిన చోటే గురువునయ్యా
మాది పెద్ద పాఠశాల. ప్రతి తరగతిలోనూ నాలుగు సెక్షన్లలో తరగతులు జరిగేవి. 1,200ల కంటే ఎక్కువ మంది విద్యార్థుల సంఖ్య ఉండేది. 170 మంది స్టాఫ్‌తో విద్యాబోధన జరిగేది. బాగా చెప్పేవారు. గురువులంటే భయం, భక్తి ఉండేది. వృత్తివిద్య సైతం బోధించేవారు. నేను ఈ పాఠశాలలో చదివి ఇక్కడే ప్రధానోపాధ్యాయుడిగా నియామకం అయ్యాను. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. మరెంతో గర్వంగా కూడా ఉంది. నేను ఆదిలాబాద్ ఎంఈవోగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను.
- ఆకుల నారాయణ, రిటైర్డ్ ఎంఈవో
అటెండర్ టు హైకోర్టు జడ్జి
ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు గుమస్తా నుంచి హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వరకు ఎదిగిన వారే. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జయచంద్రకుమార్ ఈ పాఠశాలలో చదువుకున్న ఒకప్పటి విద్యార్థే. ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజినీర్లు, డాక్టర్లు, అడ్వొకేట్లు, వ్యాపార రంగంలో రాణిం చిన వారే. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఫ్రొఫెసర్లుగా ఎది గారు. తెలంగాణ అంతటా వీరు ఖ్యాతిని ఘడిస్తున్నారు. ప్రజాసేవల్లో ఉండి కూడా ఖ్యాతినార్జిస్తున్నారు.
రాజకీయాల్లో.. చట్టసభల్లో...
గజిటెడ్ నంబర్-1 పాఠశాలో చదివిన విద్యార్థులు గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ వరకు రాణించిన వారే. రాష్ట్ర రాజకీయాలను శాసించే వ్యక్తుల్లో గజిటెడ్ నంబర్-1 విద్యార్థులు ఉండడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన సి.రాంచంద్రారెడ్డి రాష్ట్ర చిన్న నీటి పారుదల, గిడ్డంగుల శాఖ మంత్రిగా, ఆదిలాబాద్ నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వామన్‌రెడ్డి సైతం ఇదే పాఠశాలలో చదివారు. ఈయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. కె.ఆశన్న ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు.
ఉన్నతంగా బోధించేవారు
బాపురావు వైద్య, మాధవరావు, యశ్వంత్‌రావు, సదాశివ మాస్టరు, లక్ష్మణ్‌రావు మాకు గురువులు. మంచి విద్యను బోధించారు. నాలుగు భాషల్లో విద్యా బోధన జరిగేది. ఈ పాఠశాలల్లో మా నాన్నగారు సదాశివ మాస్టరు కూడా ఈ పాఠశాలలోనే విద్యాబోధన చేశారు. వారి ప్రోత్సాహంతో చదివి ఈ స్థాయికి ఎదిగాను. ఆదిలాబాద్‌లో డీటీవోగా, హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ సెంట్రల్ లైబ్రరీలో అకౌంట్ అధికారిగా పని చేసి రిటైర్డ్ అయ్యాను. గజిటెడ్ పాఠశాలను, గురువులను ఎన్నటికీ మరువ.
- సామల శ్రీవర్థన్, రిటైర్డ్ డీటీవో
ఎంతో మంది ఉన్నతులుగా..
గజిటెడ్ నంబర్ 1 పాఠశాలలో చదివిన ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగారు. నేను ఈ పాఠశాలలో 1962 నుంచి పదో తరగతి పూర్తయ్యేవరకు పది సంవత్సరాలు ఇక్కడే చదివా. అప్పటి విద్యాబోధన చాలా బాగుండేది. హన్మగౌడ్, వర్ధచారి, వామన్‌రావు సార్లు పాఠాలు చాలా బాగా చెప్పేవారు. ఒకే భాషలో కాకుండా పలు భాషల్లో విద్యబోధన జరిగేది. విద్యలో మంచి స్థానంలో విద్యార్థులు ఉండాలని, మాకు నిపుణులను పిలిపించి విద్యాబోధనను చేసేవారు. ఆ రోజుల్లో గురువులంటే ఎంతో గౌరవం.
- కారింగుల దామోదర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు
ఎప్పటికీ మరిచిపోలేము
మేము గజిటెడ్ నంబర్ 1 పాఠశాలలో చదివేటప్పుడు నాణ్యమైన విద్య బోధించేవారు. దీంతో పాఠశాలకు డుమ్మా కొట్టేవాళ్లం కాదు. ప్రతీరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేవాళ్లం. సెలవు వస్తే ఎందుకు వచ్చిందని అనుకునేవాళ్లం. మేము 1980-81 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివాం. మా గురువులు చెప్పిన విషయాలు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడు గుర్తుకు వస్తుంటాయి. వారు చేప్పే మంచి మార్గాలతో ఈ స్థాయికి ఎదిగాం. మా గురువులను ఇప్పటికీ కూడా మరిచిపోలేం.
- సబ్దర్ అలీ, పీజీహెచ్ఎం
అన్నింటిలో ప్రావీణ్యం ఉండేది
అన్ని విషయాల్లో, బహుభాషల్లో విద్యబోధన చేసేవారు. పరీక్షలు చాలా స్ట్రిక్ట్‌గా జరిపేవారు. ఎక్కువ మంది పాసయ్యేవారు కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే గడిపేవాళ్లం. గురువులంటే చాలా భయం, భక్తి ఉండేది. నేను పాఠశాల విద్యార్థి లీడర్‌గా పనిచేశాను. వారు చెప్పిన విషయాలను ఇప్పటికీ మరిచిపోకుండా నెమరువేసుకుంటాం. నేను ప్రస్తుతం ఆర్వీఎంలో జీసీడీవోగా, అకౌంట్ అధికారిగా పనిచేస్తున్నాను. నన్ను ఈ స్థాయికి చేర్చిన నా పాఠశాలకు రుణపడి ఉంటా.
- గజేందర్, జీసీడీవో అకౌంట్ అధికారి