Gazetted Officers Association
-
పీఆర్సీపై ప్రభుత్వ వైఖరి సరైనదే
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సంతోషాన్ని నింపుతోందని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. పీఆర్సీ కాలపరిమితిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించటం, ఐఆర్ రికవరీ నిబంధన తొలగింపు, హెచ్ఆర్ఏ పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, మంత్రుల కమిటీకి అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ రమణ మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎంతమేరకు చేయాలో అంతవరకూ చేసిందన్నారు. బంద్‌లు, సమ్మెలు చేస్తే ఎక్కువగా నష్టపోయేది బడుగు, బలహీన వర్గాలేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్ముతున్నామన్నారు. అవకాశం ఉన్నంత మేరకు ఉద్యోగులకు భవిష్యత్‌లో కూడా మంచి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రుల కమిటీ చెప్పిన మాటను విశ్వసిస్తున్నామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సునిల్‌కుమార్ మాట్లాడుతూ.. 23 శాతం ఫిట్‌మెంట్‌ను తమ అసోసియేషన్ స్వాగతిస్తోందన్నారు. అమరావతి ఏరియా అధ్యక్షుడు సుధాకర్, కృష్ణా జిల్లా కార్యదర్శి రాఘవ, ఉపాధ్యక్షుడు శశిభూషణ్, అసోసియేషన్ నేతలు ఎం.రాఘవులు, యు.నవీన్, డాక్టర్ నాగరాజు, కె.రమణ, కొత్తపల్లి వెంకటరమణ పాల్గొన్నారు. -
పన్నుల శాఖలో ఎన్నికల లొల్లి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్ర పన్నుల శాఖలో కూడా ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్ర పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం సారథ్యం కోసం జరగనున్న ఈ ఎన్నికలు ఆ శాఖలో అసలైన ఎన్నికల సెగ పుట్టిస్తున్నాయి. సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే ఆనవాయితీ ఉన్నా ఈ దఫా గెజిటెడ్ అధికారులు రెండుగా చీలిపోవడంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. తూకుంట్ల వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, సమస్యల పరిష్కారంలో తాత్సారం వహిస్తోందని ఆరోపిస్తూ కొందరు ప్రస్తుత కార్యవర్గాన్ని వ్యతిరేకించి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు. దీంతో కేవలం 350 ఓట్లే ఉన్నా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం (టీసీటీజీవోఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే, ప్రస్తుత కార్యవర్గం తమ పనితీరును సమర్థించుకుంటోంది. అటు ప్రభుత్వంతో, ఇటు ఉన్నతాధికారులతో సానుకూల దృక్పథంతో వెళ్తూనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామని, కొన్నింటిని పూర్తిస్థాయిలో పరిష్కరించే దశకు చేరుకున్నామని సంఘం నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలు పన్నుల శాఖలో వేడి పుట్టిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులే ఎజెండా.. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు జరిగేందుకు శాఖ పరిధిలోని ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరించలేదని, బదిలీలు సక్రమంగా జరగకపోవడంతో పదోన్నతులు కూడా నిలిచిపోయాయనే చర్చ శాఖలో జరుగుతోంది. అయితే టీసీటీజీవోఏ కార్యవర్గం మాత్రం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో చేయాల్సిందంతా చేశామని చెబుతోంది. డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ ఇవ్వనన్ని పదోన్నతులు సాధించామని, రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని కేటగిరీల్లో 75 శాతం మంది ఉద్యోగులు కనీసం ఒక్క పదోన్నతి అయినా తీసుకున్నారని, గతం కంటే పారదర్శకంగా వ్యవహరించడం ద్వారానే ఇది సాధ్యమైందని అంటోంది. అసోసియేషన్ ఎన్నికలకు ఇప్పటికే 2 ప్యానెళ్లు నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ల ఉపసంహరణకు నేడు తుది గడువు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ జరగకపోతే ఈ నెల 13న ఎన్నికలు అనివార్యం కానున్నాయి. పద్ధతిలో తేడా తప్ప పోరాటం ఆగదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010లో మా అసోసియేషన్ ఏర్పడింది. రాష్ట్ర అస్తిత్వం, మనుగడ, పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించాం. అధిక పనిభారం, ఒత్తిడితోపాటు శాఖాపరంగా ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు. కొత్త రాష్ట్రంపై తీవ్ర పోరాటాలు చేయలేం. శాంతియుత, ప్రజాస్వామిక, సమన్వయ పద్ధతుల్లోనే ఇది సాధ్యమవుతుంది. పోరాట పద్ధతుల్లో తేడా ఉంటుంది తప్ప పోరాటం ఆగదు. – తూకుంట్ల వెంకటేశ్వర్లు,టీసీటీజీవోఏ అధ్యక్షుడు -
కొత్త జిల్లాల్లో రెండు రకాల కేడర్లుండాలి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కాకుండా రెండు రకాల కేడర్లుగానే ఉద్యోగులను భర్తీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం టీజీవో భవన్లో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత అధ్యక్షతన ‘కొత్త జిల్లాల ప్రతిపాదనలు- ఉద్యోగుల విభజన, రాష్ట్రపతి ఉత్తర్వులు’ అనే అంశంపై చర్చ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు. ప్రస్తుతం జోనల్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలను నియామకాల సమయంలో జిల్లాస్థాయిలో చేపట్టి, తుది కేటాయింపులు మాత్రం రాష్ట్రస్థాయిలో చేపట్టాలని కోరారు. ఇందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి, అందులో టీజీవోలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కొత్త జిల్లాల్లో ఆయా జిల్లాల అధికారులను, వారి అధికారాలను తగ్గించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకువచ్చి కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను వెనక్కి పంపాలన్నారు. కమల్‌నాథన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పునస్సమీక్షించి, జరిగిన అవకతవకలను సరిదిద్దాలన్నారు. కాంపెన్సేటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు చెల్లించే మొత్తం గిట్టుబాటు కాకుంటే ప్రీమియం చెల్లించేం దుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఎస్‌ను కలసి ఇదే విషయాన్ని తెలియజేశామన్నారు. సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నేతలు జి.విష్ణువర్ధన్ రావు, పురుషోత్తం రెడ్డి, జి.రామేశ్వర రావు, ఎస్.సహదేవ్, ఎం.మోహన్ నారాయణ, టి.రవీం దర్ రావు, మధుసూదన్ గౌడ్, పి.రవీందర్ రావు, జి.వెంకటేశ్వర్లు, ఎం.బి.కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి జిల్లా గజిటెడ్ అధికారుల సమస్యలు
ఒంగోలు టూటౌన్ : జిల్లా గజిటెడ్ అధికారుల అసోసియేషన్ సమస్యలను ఈ నెల 12న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అసోసియేషన్ జిల్లా చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ చెప్పారు. అసోసియేషన్ స్థానిక కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజిటెడ్ అధికారుల సంఘం ఆవశ్యకత, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 12న విజయవాడలోని లయోల కళాశాలలో సీఎంను కలిసి వివరించనున్నట్లు తెలిపారు. అనంతరం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఎంను సన్మానిస్తామన్నారు. సంఘ కన్వీనర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ నాయకులు అశోక్‌బాబు నాయకత్వంలో విజయవాడలో జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఉద్యోగులందరూ తమ సేవలందించే విషయంలో ముందుంటారని సంఘ కో-చైర్మన్ కె.రాజ్ కుమార్ తెలిపారు. సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడుప్రసాద్కు ఘన సన్మానం రాష్ర్ట గజిటెడ్ అధికారుల సంఘ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వీజీకే ప్రసాద్‌ను అసోసియేషన్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కే రాజ్‌కుమార్, జీఆర్ రాజశేఖర్, డాక్టర్ వెంకయ్య, కే కృపారావు, వై ధనలక్ష్మి, హసీనాబేగం, చిత్తరంజన్ శర్మ, సీహెచ్ పద్మజ, వై వెంకట్రావు, సీఐ వెలమూరి శ్రీరామ్, డాక్టర్ వెంకటసుబ్బయ్య, కే నాగేశ్వరరావు, సిటీ యూనిట్ ప్రతినిధులు ప్రసాద్, పున్నారావు, కృష్ణారావు పాల్గొన్నారు.