కొత్త జిల్లాల్లో రెండు రకాల కేడర్లుండాలి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కాకుండా రెండు రకాల కేడర్లుగానే ఉద్యోగులను భర్తీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం టీజీవో భవన్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత అధ్యక్షతన ‘కొత్త జిల్లాల ప్రతిపాదనలు- ఉద్యోగుల విభజన, రాష్ట్రపతి ఉత్తర్వులు’ అనే అంశంపై చర్చ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు. ప్రస్తుతం జోనల్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలను నియామకాల సమయంలో జిల్లాస్థాయిలో చేపట్టి, తుది కేటాయింపులు మాత్రం రాష్ట్రస్థాయిలో చేపట్టాలని కోరారు. ఇందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి, అందులో టీజీవోలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కొత్త జిల్లాల్లో ఆయా జిల్లాల అధికారులను, వారి అధికారాలను తగ్గించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకువచ్చి కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను వెనక్కి పంపాలన్నారు. కమల్‌నాథన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పునస్సమీక్షించి, జరిగిన అవకతవకలను సరిదిద్దాలన్నారు.
కాంపెన్సేటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు చెల్లించే మొత్తం గిట్టుబాటు కాకుంటే ప్రీమియం చెల్లించేం దుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఎస్‌ను కలసి ఇదే విషయాన్ని తెలియజేశామన్నారు. సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నేతలు జి.విష్ణువర్ధన్ రావు, పురుషోత్తం రెడ్డి, జి.రామేశ్వర రావు, ఎస్.సహదేవ్, ఎం.మోహన్ నారాయణ, టి.రవీం దర్ రావు, మధుసూదన్ గౌడ్, పి.రవీందర్ రావు, జి.వెంకటేశ్వర్లు, ఎం.బి.కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.