సాక్షి,అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్, తదనుగుణ జీవోలు, ఇతర ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటు రాజ్యాంగానికి, రాష్ట్రపతి ఉత్తర్వులకు ముఖ్యంగా అధికరణ 371–డీకి విరుద్ధమని, అందువల్ల వాటిని రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిద్ధార్థ, గుంటూరుకు చెందిన దొంతినేని విజయ్‌కుమార్, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామారావు తదితరులు హైకోర్టులో గతవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటు రాజ్యాంగంలోని అధికరణ 371–డీకి విరుద్ధమన్నారు. రాష్ట్రానికి విద్య, ఉపాధి అవకాశాల్లో న్యాయం చేసేందుకు ఆ అధికరణ తీసుకొచ్చారని, దీని ప్రకారం ఉద్యోగాల భర్తీ విషయంలో జిల్లాను ఓ యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీని ఆధారంగా లోకల్ కేడర్, ఏరియాను నిర్ణయించారన్నారు.
పిటిషనర్లకొచ్చిన ఇబ్బంది ఏంటి?
కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పిటిషనర్లకొచ్చిన ఇబ్బంది ఏమిటని, కొత్త జిల్లాల ఏర్పాటును అధికరణ 371–డీ నిషేధిస్తోందా? వాదనల సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. పరిపాలన పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని, పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉందంది. ఎప్పటికీ 13 జిల్లాలు మాత్రమే ఉండాలని పిటిషనర్లు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది. కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి లేదని తాము చెప్పడం లేదని న్యాయవాది సుధాకరరావు బదులిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జోనల్ వ్యవస్థ కూడా మారిపోతుందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన 8 వేలకు పైగా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వాటి ఏర్పాటు తగదన్నారు.
తెలంగాణలో ఏర్పాటయ్యాయి కదా?
ధర్మాసనం తిరిగి జోక్యం చేసుకుంటూ, అధికరణ 371–డీ ఉండగానే తెలంగాణలో కొత్త జిలాలు ఏర్పాటయ్యాయి కదా? అని అని ప్రశ్నించింది. అసలు రాజ్యాంగంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిషేధం ఎక్కడుందో చూపాలంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అప్పుడు కొత్త జిల్లా కూడా ఓ లోకల్ ఏరియా, ఓ యూనిట్‌గా ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్లు ఏం చేస్తుంటారంటూ ధర్మాసనం ఆరా తీయగా.. పిటిషనర్లలో ఇద్దరు నిరుద్యోగులని, వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదని న్యాయవాది సుధాకరరావు తెలిపారు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అందువల్ల జిల్లాల ఏర్పాటును నిలువరిస్తూ మ«ధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీ చేసింది కేవలం ముసాయిదా మాత్రమేనని, పిటిషనర్లు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొంది. తుది నోటిఫికేషన్‌పై అభ్యంతరం ఉంటే అప్పుడు దానిని సవాలు చేసుకోవచ్చునని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది.
పాలనా వ్యవహారాలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనివి. పాలనాపరమైన సౌలభ్యం నిమిత్తం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయరాదని రాజ్యాంగంలో నిషేధం ఎక్కడ ఉందో చూపండి. రాష్ట్రంలో ఎప్పటికీ 13 జిల్లాలు మాత్రమే ఉండాలని పిటిషనర్లు కోరుకుంటున్నారా?
– ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం
Comments
Please login to add a commentAdd a comment