పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రదర్శనగా వెళ్తున్న ప్రజలు
సాక్షి నెట్‌వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులుగా ప్రజలు సంబరాలతో సందడి చేస్తున్నారు. బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి నూతన జిల్లా ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భీమవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
భీమవరానికి వచ్చే ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్ఛాపురం, టెక్కలిలో సంబరాలు ఘనంగా జరిగాయి. పలాస డివిజన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో అభినందన సభ జరిపారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టెక్కలిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సోంపేటలో పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన అభినందన సభకు హాజరైన ప్రజలు
తిరుపతి జిల్లా ఆవిర్భావ నేపథ్యంలో వెంకటగిరిలో బుధవారం నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో వేలాది మంది భాగస్వాములయ్యారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పాదయాత్ర జరిగింది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు పాదయాత్రలు జరిగాయి. పెదగంట్యాడలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బుచ్చెయ్యపేట మండలంలో ఎమెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి సుమారు పది వేల మంది హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో భారీ ర్యాలీ జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటు శుభపరిణామం
సీతమ్మధార (విశాఖ ఉత్తర): రాష్ట్రంలో జిల్లాలను పునర్విభజించటం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. బుధవారం సీతమ్మధారలోని బీజేపీ కార్యాలయంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment