ప్రపంచ ఆర్థిక రథసారథులు
కూడబెడితే డబ్బు జమౌతుంది.. దాచిపెడితే ఖర్చులకు ఉంటుంది.ఈ జమాఖర్చులేనా... మనీ మేనేజ్మెంట్ అంటే?ఇంటి వరకైతే ఇంతే. దేశం వరకైతే ఇంతే. దేశాల మధ్య డబ్బుని తిప్పడం మాత్రం.. అంతకుమించిన పని! ఆ పనిని మహిళలు నేర్పుగా చేస్తున్నారు కనుకే..ప్రపంచ బ్యాంకులన్నీ ఇప్పుడు ఆడవాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దేశాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
సరకులు నిండుకున్నా.. ఆ క్షణంలో ఇంటికొచ్చిన అతిథికి కడుపు నిండా అన్నంపెట్టి పంపించగల నేర్పరులు మహిళలు. జేబులో చిల్లిగవ్వ లేకుంటే గడప దాటలేరు పురుషులు. అప్పంటే ఆడవారికి భయం. భర్త జీతంలోంచి ఖర్చుల కోసమని ఇచ్చే చాలీచాలని డబ్బుతోనే తులాల కొద్ది బంగారాన్ని కొనిపెట్టే ఇగురం ఆమెది.. ఆపదలో అక్కరకు వస్తుందని, భవిష్యత్ పట్ల విజన్ అది. వేలకు వేలు జీతం తీసుకుంటున్నా ఆ తెగువ చూపరు మగవాళ్లు. ఇన్వెస్ట్మెంట్ పట్ల ఇగ్నోరెన్స్ వీళ్లది. దుబారా.. మేల్కి నిర్వచనం. ఆదా ఆడాళ్ల పేటెంట్. అందుకే ఇంటి నుంచి ప్రపంచం దాకా మనీ మ్యాటర్స్ను మేనేజ్ చేస్తోంది మహిళే. ఇంటి పద్దు లోటు అప్పుగా మారకుండా ఎంత నేర్పుతో ఉంటుందో.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వడ్డీని అంతే నిక్కచ్చిగా వసూలు చేస్తోంది. ఇది స్త్రీ శక్తి అని నిరూపిస్తున్నారు... ఐమ్ఎఫ్కు రెండు రోజుల క్రితమే చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమితురాలైన గీతా గోపీనాథ్, ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లెగార్డ్, వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ పినలోపి కౌజనో గోల్డ్బర్గ్, వరల్డ్ బ్యాంక్ సీఈఓ క్రిస్టలినా జార్జీవా, ఓఈసీడీ చీఫ్ ఎకనమిస్ట్ లారెన్స్ బూన్. వీళ్లే కాదు. ప్రతి సాధారణ గృహిణి కూడా! జగత్తుకు సంబంధించిన విత్తం వ్యవహారాలను చూస్తోన్న ఆ అయిదుగురి గురించి తెలుసుకుంటే.. మనింటి ఆడపడుచుల మీదా గౌరవం రెట్టింపవుతుంది.
గీత గోపీనాథ్
డేటాఫ్ బర్త్.. డిసెంబర్, 1971. తండ్రి టీవీ గోపీనాథ్. రైతు, వ్యాపారి. తల్లి విజయలక్ష్మి గృహిణి. మలయాళీ కుటుంబం. కానీ గీత పుట్టింది కోల్‌కతాలో. తండ్రి వ్యవసాయంతో పాటు వ్యాపారమూ చేస్తుండడంతో ఆగ్రో ఎకనామిక్స్ మీద మొదటి నుంచి ఆసక్తి పెంచుకుంది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ చేసి యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ వెళ్లింది. ప్రిన్స్టన్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేసింది. 2010లో హార్వర్డ్ యూనివర్శిటీలో (ఎకనమిక్స్ డిపార్ట్మెంట్) పర్మినెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. ఆ అవకాశం దక్కిన మూడో మహిళ గీత. మన భారతదేశం నుంచి అమర్త్యసేన్ తర్వాత ఆ గౌరవం అందుకున్న మొదటి భారతీయురాలు కూడా. ‘‘నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మన దేశం తీవ్ర ఆర్థిక ఎద్దడిలో ఉంది. కరెన్సీ క్రైసిస్‌ను ఫేస్ చేసింది. ఆ పరిస్థితులను చూసే ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేయాలని డిసైడ్ అయ్యాను. అదే ఈ రోజు నన్ను ఐఎమ్ఎఫ్కు చీఫ్ ఎకనమిస్ట్ను చేసింది’’ అంటుంది గీతా గోపీనాథ్. 2014లో ఐఎమ్ఎఫ్ ప్రకటించిన తొలి 25 మంది అత్యుత్తమ ఆర్థికవేత్తలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. 2011లో వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’ కు ఎంపికైంది. ‘‘ప్రపంచంలోని ప్రతిభ గల ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరు. ఆర్థిక వ్యవహారాల మీద సమగ్రమైన అవగాహన.. సమర్థత ఆమె ఇంటలెక్చువల్ లీడర్షిప్కు ప్రతీకలు’ అంటూ కితాబిస్తుంది ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీనా లేగార్డ్.
క్రిస్టీనా లేగార్డ్
పారిస్‌లో పుట్టింది. విజయం ఆమెకు కొత్త కాదు. ఐఎమ్ఎఫ్కి ఎమ్డీ పదవితోనే అది ప్రారంభం కాలేదు. చిన్నప్పుడు ఈతతో ఆమె గెలుపు మొదలైంది. ఆ విజయం టీనేజ్ వరకూ సాగింది. అవును.. ఆమె స్విమ్మర్. సింక్రనైజ్డ్ స్విమ్మింగ్ (ఈత, డాన్స్, జిమ్నాస్టిక్స్ మూడూ కలిపి చేసేది) టీమ్‌కి లీడర్ కూడా. పదహారేళ్ల వయసులో చదువు కోసం పారిస్ నుంచి అమెరికాకు ప్రయాణమైంది. ఫ్రెంచ్ వాళ్లకు (యురోపియన్స్) ఇంగ్లీష్ రాదు అన్న అపవాదును తుడిచేసింది.. అనర్ఘళంగా ఇంగ్లీష్‌లో మట్లాడుతూ. అమెరికా వెళ్లిన యేడాదికే తండ్రి చనిపోవడంతో మళ్లీ పారిస్ వచ్చేసింది. లా స్కూల్ ఆఫ్ పారిస్ నుంచి డిగ్రీ పట్టా తీసుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిక్స్ ఎన్ ప్రావిన్స్‌లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చదివింది. 1981లో మళ్లీ అమెరికా వెళ్లింది. ఇంటర్నేషనల్ లా ఫర్మ్ బేకర్ అండ్ మెకెంజీలో అసోసియేట్‌గా చేరి లేబర్, యాంటి ట్రస్ట్, ఎమ్ అండ్ ఏ (మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్)లో స్పెషలైజేషన్ చేసింది. చదువు పూర్తయిన పద్దెనిమిదేళ్లకు అదే లా ఫర్మ్‌కు చైర్పర్సన్ అయింది. ఆ పదవి పొందిన మొదటి మహిళ క్రిస్టీనానే. ఇలాంటి ఫస్ట్లు చాలానే ఉన్నాయి ఆమె కెరీర్లో. 2005లో ఫ్రాన్స్ ట్రేడ్ మినిస్టర్ పదవి వరించింది. ఫ్రాన్స్ దేశపు ఎగుమతులను రికార్డ్‌స్థాయికి తీసుకెళ్లింది. ఆ సామర్థ్యం 2007లో ఆర్థికశాఖా మంత్రి పదవిని కట్టబెట్టింది. ఒక్క ఫ్రాన్స్‌లోనే కాదు.. జీ8 ప్రధాన దేశాల్లోనే ఆర్థిక శాఖ చేపట్టిన మొదటి మహిళా మంత్రిగా ఖ్యాతినార్జించింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే ముక్కుసూటి మనిషి. పారిశ్రామిక వేత్తలకు కాదు.. ప్రజలకు అవసరమయ్యే ఆర్థిక వ్యూహాలనే అనుసరించగల ధైర్యశాలి. ఈ నైజం నచ్చని పురుషాధిపత్య ఆర్థిక, పారిశ్రామిక రంగం.. 2008 నాటి ఆర్థిక సంక్షోభానికి ఆమె నిర్ణయాలను కారణంగా చూపుతూ క్రిస్టీనాను నిందించింది. అయినా ఆమె చరిష్మా తగ్గలేదు. ఫ్రాన్స్‌లోని బ్రాడ్‌కాస్టర్ ఆర్టీఎల్, లీ పారిసీన్ వార్తా పత్రిక 2009లో నిర్వహించిన ‘కంట్రీస్ మోస్ట్ ఫేవరేట్ పర్సనాలిటీస్’ పోల్‌లో పాపులర్ సింగర్, యాక్టర్ జానీ హాలీడేను ఓడించింది క్రిస్టీనా. ఆ కీర్తి అంతర్జాతీయ తీరాన్నీ తాకింది. అదే యేడు ఫైనాన్షియల్ టైమ్ ఆమెను యూరప్‌లోనే ది బెస్ట్ ఫైనాన్స్మినిస్టర్గా ఎన్నుకుంది. ఈ ఘనతలన్నిటిని ఆమె ఖాతాలో చేర్చింది ఆమె ముక్కుసూటి నైజమే. ‘‘క్రిస్టీనా.. ఇంప్రెసివ్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ మీద ఆమె ఒక రాక్‌స్టార్’’ అని అభివర్ణిస్తాడు ఐఎమ్ఎఫ్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కెన్నెత్ రోగోఫ్.
పినెలోపి కైజనో గోల్డ్బర్గ్
గ్రీస్‌లో పుట్టింది. ఏథెన్స్లోని జర్మన్ స్కూల్లో చదువుకుంది. జర్మనీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి స్కాలర్షిప్ రావడంతో తర్వాతి విద్యాభ్యాసం జర్మనీ దేశంలో సాగింది. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే అమెరికా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది పినలోపీ. అమెరికాలోని ఓ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ కోసం ఉత్తరం రాసింది. ఆమె జాబుకు జవాబు వచ్చింది.. ‘‘మీరు డాక్టోల్ ప్రోగ్రామ్‌కి ఎన్రోల్ చేయించుకోకపోయుంటే కనుక మీ ఈ ఇంటర్న్‌షిప్ దరఖాస్తును కనీసం చూసి ఉండేవాళ్లం కూడా కాదు’’ అని. ‘‘ఆ జవాబు రాసిన వ్యక్తి ఎవరో కాని.. డాక్టోరల్ కోర్స్ చేయమని చెప్పకనే చెప్పాడు నాకు. అతని వల్లే డాక్టోరల్ డిగ్రీ చేశాను’’ అని గుర్తుచేసుకుంటుంది పినెలోపి. అలా ఆమె అమెరికాలోని ప్రతిష్టాత్మాకమైన స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో పోస్ట్గ్రాడ్యూషన్ పూర్తి చేసింది. యేల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ పదవి బరీలో మహామహులతో పోటీపడి ఆ స్థానాన్ని గెలుచుకుంది పినలోపీ. ‘‘పినెలోపి తన అకడమిక్ ఎక్స్‌పీరియెన్స్, మేధస్సుతో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వృద్ధికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్. వరల్డ్‌బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్నా పాఠాలు చెప్పడం మరిచిపోలేదు పినెలోపి. ఇప్పటికీ యేల్ యూనివర్శిటీలో గెస్ట్‌గా ఫ్యాకల్టీగా వెళ్తూనే ఉంది. అన్నట్టు.. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఎన్నికైన మొదటి గ్రీస్ దేశస్థురాలు ఈమె.
లారెన్స్ బూన్
ఐర్లండ్ దేశస్తురాలు. లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్శిటీ పారిస్‌లో చదువుకుంది. ఫ్రాన్స్ ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ కీలక పాత్ర వహించింది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలోనూ పనిచేసింది. తన అనుభవంతో ప్రపంచ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన ఆర్థిక ప్రణాళికలనూ రచిస్తోంది లారెన్స్ బూన్. ఇప్పుడర్థమైంది కదా.. పోపులో ఇంగువ మోతాదును అంచనా వేసినంత ఈజీగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులనూ పసిగట్టగల సమర్థులు మన మహిళలు అని!
క్రిస్టలీనా జార్జీవా
బల్గేరియా దేశస్తురాలు. బల్గేరియా, సోఫియాలోని యూనివర్శిటీ ఆఫ్ నేషనల్ అండ్ వరల్డ్ ఎకానమీలో పీహెచ్డీ (ఎకనామిక్స్‌లో) చేసింది. అదే యూనివర్శిటీలో సోషియాలజీతో మాస్టర్స్ చదివింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, మస్సాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్‌లో నేచ్యురల్ రిసోర్స్ ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అభ్యసించింది. వరల్డ్ బ్యాంక్గ్రూప్లోనే ఆమె కెరీర్ మొదలైంది. యురోపియన్ యూనియన్ అనే కాన్సెప్ట్ రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకుంది క్రిస్టిలీనా. వరల్డ్ బ్యాంక్ గ్రూప్‌లోని వివిధ శాఖలు, వివిధ స్థాయిల్లో పనిచేశాక యురోపియన్ యూనియన్‌లో చేరింది. మళ్లీ ఇప్పుడు తిరిగి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గూటికే చేరి ఏకంగా వరల్డ్ బ్యాంక్ సీఈఓ అయ్యింది.
– శరాది