డొనాల్డ్ ట్రంప్ అనూహ్య చర్య
వాషింగ్టన్: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో జగడాలమారిగా పేరు తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సామాన్యుడికి స్నేహహస్తం అందించారు. తనలోని మరో కోణాన్ని బయట పెట్టుకున్నారు. ఫ్లోరిడాలోని మెల్ బోర్న్ లో శనివారం ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను ప్రసంగిస్తుండగా జనం మధ్యలో ఉన్న జీన్ హబర్ అనే వ్యక్తిని హఠాత్తుగా వేదికపైకి పిలిచారు.
ట్రంప్ పిలుపుకు వెంటనే స్పందించిన హంబర్.. బారియర్స్ పైనుంచి దూకి పోడియం వద్దకు చేరుకున్నాడు. వేదికపైకి వెళ్లి ట్రంప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఒక సామాన్యుడు వచ్చి అధ్యక్షుడిని హత్తుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత విషయం తెలుసుకుని కూల్ అయ్యారు.
ట్రంప్ కు హబర్ వీరాభిమాని. ఆరు అడుగుల కటౌట్ ను తన ఇంటిలో పెట్టుకున్నాడు. ప్రతిరోజు ట్రంప్ కటౌట్ కు సెల్యూట్ కూడా చేస్తానని హబర్ తెలిపాడు. తానెంతో అభిమానించే నాయకుడు స్వయంగా తనను గుర్తించి వేదికపైకి పిలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. బోయిన్టన్ బీచ్ కు చెందిన హబర్.. కారు సేల్స్ మేన్ గా పనిచేస్తున్నాడు. తమ కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ట్రంప్ నిలబెట్టుకున్నారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. హబర్ ను ట్రంప్ వేదిక మీదకు పిలవడం కాకతాళీయమా, ముందుగానే నిర్ణయించుకుని చేశారా అనే దానిపై స్పష్టత లేదు. ట్రంప్ చర్యతో హంబర్ వార్తల్లోకి ఎక్కాడు.