breaking news
Generation-Z
-
సారథిపై జెన్ జెడ్‌లో విభేదాలు
కాఠ్మండు: ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఆగ్రహం ధాటికి నేపాల్ ప్రభుత్వం కుప్పకూలగా సుస్థిర పాలన అందించే సారథి ఎంపికలో జెన్‌జెడ్ విద్యార్థి సంఘం తర్జనభర్జనలు పడుతోంది. ఈలోపు జెన్ జెడ్ విద్యార్ధుల్లో బేధాభిప్రాయాలు పొడచూపాయి. కొందరు విద్యుత్ బోర్డ్ మాజీ సీఈఓ కుల్మాన్ ఘీసింగ్ వైపు మొగ్గుచూపారు. మరికొందరు మాత్రం నేపాల్ మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీ మాత్రమే సమర్థపాలన అందించగలరని వాదించారు. ఈ వాదనల నడుమే ఉమ్మడిగా జన్‌జెడ్ విద్యార్థి బృందం దేశాధ్యక్షుడు రామచంద్ర పౌదెల్, ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్దెల్‌తో భద్రకాళీ ప్రాంతంలోని సైనిక ప్రధాన కార్యాలయంలో గురువారం సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే ఎవరిని తాత్కాలిక ప్రధానమంత్రిగా చేయాలనే అంశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో జెన్‌జెడ్, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉమ్మడి ప్రకటన వెలువడలేదు. మరోదఫా చర్చలు జరిపే అవకాశం ఉంది. ‘‘ప్రస్తుత అనిశ్చితికి చరమగీతం పాడే అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణ అంశం సైతం చర్చకొచ్చింది’’అని నేపాల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాలని తనను ఎవరూ ఇంతవరకు కోరలేదని జస్టిస్ సుశీల తెలిపారని ఆమె సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అంతకుముందు ఆమెనే ప్రధాని పదవి చేపట్టాలని ఆన్లైన్లో వేలాది మంది పోల్‌లో ఓటేశారు. అయితే నేపాల్ రాజ్యాంగ నియమాల ప్రకారం మాజీ న్యాయమూర్తులు ప్రధానమంత్రి వంటి కీలక పదవులు చేపట్టేందుకు అనర్హులు. మరోవైపు కాఠ్మండు నగర మేయర్, జనాల్లో అమితమైన ఆదరణ చూరగొన్న బాలేంద్ర షా రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఆయనకు ప్రధాని వంటి అత్యున్నత పదవులు చేపట్టే ఆలోచన లేదని తెలుస్తోంది. జస్టిస్ సుశీలకు బాలేంద్ర మద్దతు పలకడం విశేషం. ‘‘తొలుత మేం బాలేంద్ర షా వైపు మొగ్గుచూపాం. ఆయన అందుకు సంసిద్ధంగా లేరని సమాచారం వచ్చింది. దాంతో మేం జస్టిస్ సుశీలను ఎంపికచేయాలని భావించాం. అయితే జడ్జీల ఎంపిక కుదరదని, అందుకే రాజ్యాంగం ఒప్పుకోదని తేలింది. ఇక ధారన్ మున్సిపాలిటీ మేయర్ హార్క్ సంపంగ్ను ప్రధాన అభ్యరి్థగా ఆశించాం. కానీ ఆయనకు పెద్దగా ఎవరూ మద్దతు ప్రకటించలేదు. దీంతో విద్యుత్ అథారిటీ సంస్థ మాజీ సీఈఓ కుల్మాన్ ఘీసింగ్ ఇందుకు తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నాం’’అని జెన్‌జెడ్ ఒక ప్రకటన విడుదలచేసింది. అయితే సుశీల నాయకత్వం మాకు సమ్మతమే అని ‘వీ నేపాలీ గ్రూప్’సారథి, ఉద్యమకారుడు సుదన్ గురుంగ్ ప్రకటించారు. ఆర్మీ కార్యాలయం ఎదుట బాహాబాహీ ఓవైపు జెన్‌జెడ్ కీలక నేతలు ఆర్మీ ప్రధాన కార్యాలయంలో దేశాధ్యక్షుడు, ఆర్మీ చీఫ్‌లతో మంతనాలు జరుపుతుంటే బయట జెన్ జెడ్ విద్యార్థులు ఘర్షణలకు దిగారు. సుశీల సమర్థురాలు అని కొందరు, ఘీసింగ్ గొప్ప వ్యక్తి అంటూ మరికొందరు వాదనలకు దిగారు. తర్వాత వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో జెన్ జెడ్ వర్గంలో విబేధాలు బట్టబయలయ్యాయి. ‘‘సుశీల కేసులనైతే గొప్పగా తీర్చుచెప్పగలిగారేమోగానీ పరిపాలన అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా ఆమె 70 ఏళ్ల వృద్దురాలు. ఈ వయసులో ఆమె క్రియాశీలక పాత్ర పోషించడం చాలా కష్టం’’అనికొందరు వాదించారు. మరికొందరు ఘీసింగ్‌కు మద్దతు పలికారు. ‘‘రోజుకు 18 గంటలపాటు విద్యుత్కోతలుండేవి. ఎలక్ట్రిసిటీ అథారిటీ బోర్డ్ సీఈఓగా ఘీసింగ్ సమర్థవంతంగా పనిచేశారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన విద్యుత్ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించారు’’అని మరికొందరు వాదించారు. దీంతో ఇరువర్గాల మధ్య నడిరోడ్డు మీద గొడవ మొదలైంది. అధికారంపై ఆర్మీ ఆసక్తి! అధికారంపై ఆర్మీ ఆసక్తి కనబరుస్తున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జెన్‌జెడ్ ప్రతినిధి బృందంతో అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ చర్చలు జరుపుతున్నప్పుడే వివాదాస్పద వ్యాపారవేత్త దుర్గా ప్రసాయ్ వచ్చారు. దేశంలోని రాజరిక పాలన మళ్లీ తేవాలని ఆయన గట్టిగా విశ్వసిస్తారు. ఈయనతోపాటో రాష్రీ్టయ స్వతంత్ర పారీ్ట(ఆర్ఎస్పీ)ని సైతం ఈ చర్చల్లో భాగస్వాములుగా చేర్చుకుంటే సమస్యను త్వరగా పరిష్కరించవచ్చని ఆర్మీ చీఫ్ అశోక్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. తమ కనుసన్నల్లో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటు జరగాలనే ఉద్దేశ్యంతోనే వ్యాపారి, రాజకీయ పారీ్టలను ఇందులోని ఆర్మీ లాగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యలో దుర్గా ప్రసాయ్ జోక్యాన్ని సహించని జెన్ జెడ్ విద్యార్థులు వెను వెంటనే చర్చలను అర్ధంతరంగా ఆపేసి బయటకు వచ్చేశారని తెలుస్తోంది. ‘‘మాతో చర్చలకు పిలిచి మధ్యలో దుర్గా ప్రసాయ్, ఆర్ఎస్పీలను కలుపుకుని పొండి అని ఆర్మీ చీఫ్ చెప్పడం ఏమాత్రం సబబుగా లేదు. విద్యార్థి ఉద్యమాన్ని తక్కువచేసి చూపిస్తున్నారు’’అని విద్యార్థి నేత రక్షా బామ్ తర్వాత మీడియాతో అన్నారు. చర్చలు ఎటూ తేలకపోవడంతో ఆర్మీ చీఫ్ చైనాలో తన వారంరోజుల పర్యటనను తప్పనిపరిస్థితుల్లో రద్దుచేసుకున్నారు. -
నేపాల్‌కు నిప్పు పెట్టిందెవరు?
కాఠ్మండు: చేతికి ఆరో వేలుగా అతుక్కుపోయిన స్మార్ట్‌ఫోన్‌లో సోషల్‌మీడియా యాప్స్ అనేవి ఓ రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటూ ఊరుకోబోమని తెలియజేప్పేందుకే శాంతియుత నిరనస ర్యాలీలు చేపట్టామని నేపాల్‌లోని జెన్ జెడ్ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, మూడ్రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్ జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టంచేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసనకార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్‌ను అగి్నగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి చివరకు ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్లోనూ అదే కుట్ర జరుగుతోందని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడదూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్లదాడి ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ విధ్వంసం వెనుక బయటి శక్తుల హస్తముందని విద్యార్థులు ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనర్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజేప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యంకాదని స్పష్టంచేశారు. మద్దతు పలికిన మాజీ ప్రధాని విద్యార్థుల వాదనలకు పరోక్షంగా మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ మద్దతు పలికారు. ‘‘నాకు తెల్సిన విద్యార్థులు ఇలాంటి విధ్వంసాలకు అస్సలు దిగరు. వారసత్వ రాజకీయాలు, రాజకీయనేతలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవితం, అవినీతిపై విద్యార్థుల తిరుగుబాటు మొదలైంది. తీరాచూస్తే ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా మరో ‘తిరుగుబాటు’ఆరంభమైనట్లు తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. మేకవన్నె పులులు మీ ఉద్యమ మందల్లో దూరిపోయాయి. వారితో జాగ్రత్త అని మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నా’’అని విద్యార్థులను భట్టారాయ్ హెచ్చరించారు. ఉద్యమంలో బయటిశక్తులనుద్దేశిస్తూ.. ‘నేపాల్ ప్రజాస్వామ్య పునాదులనే పెకళించే దుస్సాహసానికి వాళ్లు దిగారు. వాళ్ల తదుపరి దారుణ లక్ష్యం ఏమిటో’’అని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత దేశాన్ని తగలబెడుతున్న విద్యార్థులు అంటూ వస్తున్న వార్తలను భట్టారాయ్ తప్పుబట్టారు. ‘‘మొసలికన్నీరు కార్చడానికి విద్యార్థులేమీ రాజకీయనేతలు కాదు. అల్లర్లు, ఘర్షణలు చూసి విద్యార్థులే అవాక్కవుతున్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని బయటి శక్తులు దురుద్దేశ్యంతో ఉగ్రరూపంలోకి మార్చేశారని విద్యార్థులు బాధపడుతున్నారు. తాజా వినాశనానికి బయటిశక్తులే కారణం’’అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్రంగా ఖండించిన యువజన, ఎన్జీవో సంఘాలు హింసాత్మక ఘటనలను యువజన, విద్యార్థి, లాభాపేక్షలేని ప్రభుత్వేతర ఎన్జీవోలు ఖండించాయి. ముఖ్యంగా తొలుత శాంతియుత నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించిన జెన్ జెడ్ నేపాల్, హమీ నేపాల్ సంస్థలు ఈ విధ్వంసకాండపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశాయి. ‘‘మొదట్నుంచీ విధ్వంసాన్ని మేం అడ్డుకునేందుకే ప్రయతి్నంచాం. వినాశనానికి మాకు వీసమెత్తయినా సంబంధం లేదు. విద్యార్తులెవరూ ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసంచేయలేదు. ప్రధాని, మాజీ ప్రధానులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’అని బుధవారం ప్రకటనలో స్పష్టంచేశాయి. ‘‘ఘటనాస్థలికి మేం తర్వాత వచ్చాం. బాధితులను కాపాడాం. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. ప్రజల ఆస్తుల పరిరక్షణకు పాటుపడ్డాం’’అని జెన్‌జెడ్ నేపాల్ మరో ప్రకటనలో పేర్కొంది. ‘‘సహేతుకమైన, ప్రజాస్వామ్యయుత ఉద్యమపంథాలో సాగుతున్న మమ్మల్ని విధ్వంసకపర్వంలో భాగస్వాములుగా చిత్రించకండి. అధికారమే పరమావధిగా కుట్రలు చేసే రాజకీయ శక్తులు, అవకాశవాదులే ఈ వినాశనానికి సృష్టికర్తలు. మా ఉద్యమానికి తప్పుడు మరకలు అంటించే కుట్రలు జరుగుతున్నాయి. మంచి కోసం పోరాడుతున్న మమ్మల్ని దేశవినాశకారులుగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి’’అని జెన్‌జెడ్ ఆరోపించింది. ‘‘మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. కూల్చడం మా పనికాదు. దేశ పునర్నిర్మాణమే మా ధ్యేయం. దేశవ్యతిరేక యుద్ధం మేం చేయట్లేము. చెడుకు వ్యతిరేకంగా సాగుతున్న సంఘర్షణలో మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటున్నాం. నఖూ జైలును మేం బద్దలుకొట్టలేదు. మాజీ ఉప ప్రధానమంత్రి రవి లమీచ్ఛానేను మేం జైలు నుంచి విడిపించలేదు ’’అని హమీ నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
నేపాల్ ప్రధానిగా సుశీల?
కాఠ్మండు: కల్లోల నేపాల్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతరం ఆరంభించిన పోరాటం నేపాల్ ప్రధానమంత్రి కేపీ వర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ‘జనరేషన్ జెడ్’ఆన్లైన్లో సంప్రదింపులు ప్రారంభించింది. యువత తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలని చాలామంది సూచిస్తున్నారు. యువతలో ఆమెపట్ల అమితమైన ఆదరణ కనిపిస్తోంది. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో 5 వేల మందికిపైగా పాల్గొన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా జస్టిస్ సుశీల కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువమంది ఓటేశారు. తొలుత కాఠ్మండు నగర మేయర్ బాలెన్ షా పేరు వినిపించింది. అయనను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని జనరేషన్ జెడ్ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు కర్కీకి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. మద్దతుగా 2,500 మంది సంతకాలు మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలంటూ సుశీల కర్కీని యువత అభ్యర్థించగా.. తనకు మద్దతుగా కనీసం వెయ్యి సంతకాలు సేకరించి, చూపించాలని ఆమె కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా సంతకాలు చేసినవారి సంఖ్య 2,500కు చేరినట్లు సమాచారం. మరోవైపు పోటీలో సుశీల కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్, యువనేత సాగర్ ధాకల్, ధరణ్ సిటీ మేయర్ హర్కా సంపంగ్ పేర్లపైనా చర్చ సాగుతోంది. నేపాల్‌లోని ప్రముఖ యూట్యూబర్ రందోమ్ నేపాలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరూ మందుకు రాకపోతే తాను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు. సుశీల కర్కీ నియామకానికి పెద్ద తతంగమే ఉంటుందని సమాచారం. ఆమె తొలుత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ను, అనంతరం అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ను కలుసుకొని మద్దతు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు.ఎవరీ జస్టిస్ సుశీల? నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీల కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్‌లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. సుశీల కర్కీ మొదట టీచర్‌గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిపార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆమెను చీఫ్ జస్టిస్‌గా నియమించారు. సుశీల కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదుకున్నప్పటి రోజులను సుశీల ఇటీవలే గుర్తుచేసుకున్నారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకొనే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచి్చందని, అక్కడే పీహెచ్డీ పూర్తిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ, విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.మోదీజీ కో నమస్కార్ నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీక రించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జస్టిస్ సుశీల చెప్పారు. ఆమె బుధవారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యంతర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలంటూ యువత చేసిన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని నేపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రారంభానికి శ్రీకారం చుడదామని అన్నారు. భారత్–నేపాల్ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ అంటే తమకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టంచేశారు. తమ దేశానికి భారత్ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నానని జస్టిస్ సుశీల కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రప త్తులు, ఆరాధనభావం ఉన్నట్లు వివరించారు. -
నైపుణ్యాలు, ఉద్యోగ పురోగతికే ప్రాధాన్యం
ముంబై: కంపెనీల కార్యకలాపాల్లో ఆటోమేషన్, జెనరేటివ్ ఏఐ వినియోగం విస్తరిస్తుండడంతో.. జెనరేషనల్ జెడ్, మిలీనియల్స్ తరగతి యువత నైపుణ్యాలు పెంచుకునేందుకు, ఉద్యోగంలో పురోగతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ నిర్ణయాల్లో పురోగతి, అభ్యాసనా అవకాశాలకే తమ ప్రాధాన్యమని డెలాయిట్ సర్వేలో వారు చెప్పారు. జెన్ జెడ్, మిలీనియల్స్‌లో 85 శాతం మంది ప్రతి వారం చివర్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు, పనిచేస్తూనే నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు డెలాయిట్ ఇండియా చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరి రంగన్ తెలిపారు. కాకపోతే వీరికి తగినంత మార్గదర్శకత్వం లభించడం లేదని డెలాయిట్ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ మేనేజర్ల నుంచి మార్గదర్శనం కోరుకుంటుంటే.. అది కొందరికే లభిస్తున్నట్టు తెలిపింది. 505 మంది జెనరేషన్ జెడ్, 304 మిలీనియల్స్ అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా డెలాయిట్ తెలుసుకుంది. 1981–1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్‌గా, 1997–2012 మధ్యకాలంలో జని్మంచిన వారిని జెనరేషన్ జెడ్ కింద పరిగణిస్తుంటారు. పట్టాలు కాదు.. అనుభవానికే పెద్ద పీట వేగంగా మార్పులకు గురవుతున్న ఉద్యోగ మార్కెట్లో సంప్రదాయ డిగ్రీ అర్హతల కంటే.. అనుభవానికే అగ్ర తాంబూలం లభిస్తున్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. దీంతో సంప్రదాయ విద్యా వ్యవస్థ నాణ్యతపై సందేహాలు లేవనెత్తింది. 94 శాతం జెన్ జెడ్, 97 శాతం మిలీనియల్స్ సిద్ధాంతాల కంటే అనుభవానికే విలువ ఎక్కువని చెప్పారు. ఉన్నత విద్యపై 52 శాతం జెన్ జెడ్, 45 శాతం మిలీనియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్య వ్యయాలపై 36 శాతం జెన్ జెడ్, 40 శాతం మిలీనియల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన, ఒత్తిడి విషయంలో ఉద్యోగం కారణమవుతున్నట్టు 36 శాతానికి పైనే చెప్పారు. ఉద్యోగుల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి.. ‘‘ఉద్యోగుల సంతోషం, శ్రేయస్సు విషయంలో సంస్థలు తమ విధానాలను తిరిగి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. భౌతిక, మానసిక, ఆర్థిక శ్రయస్సు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నాయకత్వం స్థాయిలో వీటిని పరిష్కరించాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. -
నాడు వ్యూవర్స్.. నేడు క్రియేటర్స్: యూట్యూబ్ రిపోర్ట్
యూట్యూబ్ కొన్నేళ్లుగా ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఏ సమాచారం కావాలన్నా, ఏం సందేహం వచ్చినా అన్నింటికీ అదే సమాధానం అయిపోయింది. ఒకప్పుడు వీడియోలు చూడటానికే పరిమితమైన యూజర్లు క్రమంగా తామూ వీడియాలు చేస్తూ తమను తాము ప్రదర్శించుకోవడానికి యూట్యూబ్‌ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారు.యూట్యూబ్‌లో ఏదైనా కంటెంట్‌ను అభిమానిస్తూ ఫాలో అయ్యే ఫ్యాన్స్ ధోరణిలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. ఏడాది కాలంగా భారతీయ యూజర్లలో వచ్చిన మార్పులపై యూట్యూబ్ ఓ నివేదికను విడుదల చేసింది. యూట్యూబ్ కల్చర్ అండ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ జెన్ జెడ్ (14-24 సంవత్సరాల వయసువారు)లో 91% మంది గత సంవత్సరంలో ఫ్యాన్ సంబంధిత కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. 93% మంది తమకు ఇష్టమైన అంశాలను అనుసరించడానికి వారానికోసారైనా యూట్యూబ్‌ను ఉపయోగించారు.ముంబైలో జరిగిన యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా స్మిత్గీగర్తో కలిసి రూపొందించిన ఈ నివేదికను యూట్యూబ్ విడుదల చేసింది. ఇంకా ఈ రిపోర్ట్ మరికొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది. భారతీయ జెన్ జెడ్‌లో 83% మంది తమను తాము క్రియేటర్లుగా ప్రదర్శించుకున్నారు. 87% మంది వివిధ స్థాయిలలో ఎవరో ఒకరికి, ఏదో ఒక దానికి ఫ్యాన్‌గా నిమగ్నమయ్యారు. అంటే లైక్, కామెంట్ వంటివి చేశారన్నమాట. -
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్‌లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
జనరేషన్ జెడ్‌కు జై...
మన దేశ భవిష్యత్ ఇప్పుడు ఒక కొత్త తరం మీద ఆధారపడి ఉంది. వారే జనరేషన్ జెడ్. 1996–2000 మధ్య పుట్టిన వారిని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. మిలేనియల్స్‌కి, వీళ్లకి ఎంతో తేడా ఉంది. భారత్‌లో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో అభివృద్ధిలో వారిదే కీలకపాత్ర. జనరేషన్ ఎక్స్(1965–80 మధ్య పుట్టినవారు) తరం తల్లిదండ్రుల చేతుల మీదుగా పెరిగిన వీరి ఆలోచన, అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఇతర తరాలకి ఎన్నో తేడాలున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లో జెనరేషన్ జెడ్ స్వభావాల్ని అంచనా వేశాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం.. ప్రస్తుతం జనరేషన్ జెడ్ జనాభా దాదాపుగా 10 కోట్ల వరకు ఉంటుంది. జెనరేషన్ జడ్లో 25% మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటూ సామాజిక బాధ్యత కలిగి ఉన్నారు. ఆర్థిక మాంద్యం సమయంలో పెరిగి పెద్దవడంతో డబ్బుల్ని పొదుపు చేయాలన్న స్పృహ కలిగి ఉన్నారు. మిగిలిన తరాలతో పోల్చి చూస్తే సహనం ఎక్కువ. ఆచరణ సాధ్యంగా ఉండాలని ప్రయత్నిస్తారు. తమ వ్యక్తిగత ఆసక్తులు, కుటుంబానికి, తాము చేసే పనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరిలో మానసిక సమస్యలూ ఎక్కువే. 35 శాతం మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. -
‘స్మార్ట్’గా నెట్ విహారం!
• స్మార్ట్‌ఫోన్ వెంట జనరేషన్-జీ • వాట్సాప్, ఫేస్‌బుక్‌పైనే మక్కువ • టీసీఎస్ యూత్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చేతిలో పుస్తకమే కాదు.. గ్యాడ్జెట్ సైతం ఉండాలంటోంది నవతరం. 1995 తర్వాత జన్మించిన వారికి (జనరేషన్-జీ) స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీ అత్యంత ప్రాధాన్య ఉపకరణాలుగా మారాయని అధ్యయనంలో తేలింది. 12-18 ఏళ్ల వయసున్న విద్యార్థుల డిజిటల్ అభిరుచులపై ఐటీ దిగ్గజం టీసీఎస్ చేపట్టిన యూత్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చారుు. హైదరాబాద్ జనరేషన్-జీ గ్రూప్‌లో 69 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ ప్రధాన్య గ్యాడ్జెట్‌గా నిలిచింది. ఇంట్లో ఫిక్స్డ్ లైన్/వైఫై ద్వారా 85 శాతం మంది నెట్లో విహారం చేస్తున్నారట. 47 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లో 4జీ/3జీని వినియోగిస్తున్నారు. 88 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. యాప్స్‌లో గేమింగ్ తర్వాత వాట్సాప్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ యాప్స్ వరుసలో ఉన్నారుు. చాటింగ్ కోసమే.. హైదరాబాద్ జనరేషన్-జీ గ్రూప్‌లో 78% మంది స్కూల్ అసైన్మెంట్ కోసం ఇంటర్నెట్ను వాడుతున్నారు. 61% ఇన్స్టంట్ మెసేజింగ్ కోసం ఇంటర్నెట్లో విహరిస్తున్నారు. 60% గేమ్స్, మ్యూజిక్కు, 56 % సోషల్ మీడియా, వీడియోలు, సినిమాల కోసం నెట్‌ను వినియోగిస్తున్నారు. 48% అబ్బారుులు, 31% అమ్మారుులు షాపింగ్‌కు నెట్‌పై ఆధారపడుతున్నారు. నెలవారీ మొబైల్ బిల్లు రూ.500 లోపు చేస్తున్నట్టు 51% మంది తెలిపారు. బిల్లు రూ.501-1,000 మధ్య అవుతున్నట్టు 18% అబ్బారుులు, 13% మంది అమ్మరుులు వెల్లడించారు. 31 శాతం అమ్మారుులకు, 22% మంది అబ్బారుులకు అసలు ఫోనే లేదంట. ఇక విద్యార్థుల రోల్ మోడల్స్‌గా స్టీవ్ జాబ్స్ ముందు వరుసలో ఉన్నారు. అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వరుసలో నిలిచారు. యాక్టివ్‌గా ఫేస్బుక్లో.. ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉన్నవారి సంఖ్య 62% ఉంది. ఈ విషయంలో 67%తో అబ్బారుులు ముందంజలో ఉన్నారు. 40% అమ్మారుుల సామాజిక మాధ్యమం ఫేస్బుక్కేనట. గూగుల్ ప్లస్, ఇన్ట్రాగామ్, ట్విటర్, స్నాప్‌చాట్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారుు. ఫేస్బుక్లో అబ్బారుులకే స్నేహితులెక్కువ. సినీ తారలను ఫాలో కావడంలో అమ్మారుులే టాప్. అబ్బారుులు ఎక్కువగా క్రీడాకారులను ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ సెలబ్రిటీలు, చానెళ్లనూ నవతరం ఫాలో అవడం విశేషం. వాట్సాప్‌ను అధికంగా వినియోగిస్తున్నది అమ్మారుులే. 83% జనరేషన్-జీ గ్రూప్ సభ్యులకు వాట్సాప్ ముఖ్యమైన మెసేజింగ్ యాప్. తల్లిదండ్రుల ఒత్తిడి, సమయం వృధా కారణంతో 68% మంది సోషల్‌మీడియా అకౌంట్‌ను ఒక్కసారైనా డిలీట్/డీయాక్టివేట్ చేశారట.