ఈ తరం తీరే వేరు!.. ఆనందం తక్కువ ఎందుకంటే...
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి.
సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్ కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి.
వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు.
నా పనికి ప్రయోజనం ఉందా?
ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు.
ఈ మూడూ ఉంటేనే సంతోషం
జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి...
రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది.
బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి.
పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది.
సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com