జెన్కో సీఎండీని అడ్డుకున్న నేదునూరు నిర్వాసితులు
మానకొండూర్ : తిమ్మాపూర్ మండలం నేదునూర్‌లో నిర్మించతలపెట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ పవర్‌ప్లాంట్‌కు ప్రహరీ ఏర్పాటు కోసం మంగళవారం వచ్చిన జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే ప్రహరీ నిర్మించాలంటూ సుమారు 200 మంది ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. 2010లో పవర్‌ప్లాంట్‌కు అప్పటి సీఎం రోశయ్య శంకుస్థాపన చేశారని, తమ పిల్లలకు ఉద్యోగాలివ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందించారని, అనంతరం విస్మరించారని ఆరోపించారు. న్యాయం చేసేవరకూ పనులు చేపట్టవద్దని హెచ్చరించారు. ప్రహరీ నిర్మిస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందని, సుమారు రూ.400 కోట్ల వరకు నిధులువచ్చే అవకాశముందని సీఎండీ నచ్చజెప్పినా నిర్వాసితులు వినిపించుకోలేదు. దీంతో గత్యంతరం లేక ఆయన వెళ్లిపోయారు.