Genomic Research
-
వేరియంట్ల గుట్టు తేలుద్దాం..నమూనాల సేకరణ ఇలా
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. కోవిడ్ వైరస్ నేపథ్యంలో వస్తున్న వివిధ వేరియంట్ల ఉనికిని కనుగొనేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు జినోమిక్ సీక్వెన్స్ సర్వే (వేరియంట్ల ఉనికిని తెలుసుకునే ప్రక్రియ) సరిగా జరగలేదు. ఈ వేరియంట్ల మ్యుటేషన్ (ఉత్పరివర్తనాలను) తెలుసుకోగలిగితేనే వైద్యం చేసేందుకు వీలుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు జినోమిక్ సర్వే చేపడుతున్నారు. దీనికోసం ఇండియన్ సార్స్ కోవిడ్–2 కన్సార్టియంను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందలాది వేరియంట్లు దేశంలో ఉన్నాయి. చదవండి: కరోనా మూలం కనిపెట్టడంలో అమెరికా విఫలం చికిత్సకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే లోపే వాటి తీవ్రత పెరిగి ప్రాణనష్టం సంభవిస్తోంది. అలా జరగకుండా ప్రాథమిక స్థాయిలోనే వేరియంట్లను గుర్తించాలని నిర్ణయించారు. దేశవ్యాప్త జినోమిక్ సీక్వెన్స్ సర్వేకు ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) నోడల్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేసే జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీలు ఎన్సీడీసీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సీఎస్‌యూ (సెంట్రల్ సర్వెలెన్స్ యూనిట్), ఐడీఎస్పీ (ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలెన్స్ ప్రోగ్రాం) తమ సహకారం అందిస్తాయి. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి నిర్ణయించిన మేరకు నమూనాలు సేకరించి వేరియంట్ల ఉనికిని గుర్తిస్తారు. చదవండి: డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం! నమూనాల సేకరణ ఇలా.. రోజూ నమోదయ్యే అన్ని రకాల నమూనాలనూ సేకరించి సీక్వెన్స్ ల్యాబ్‌లకు పంపకూడదు. దీనికి కొన్ని ప్రొటోకాల్స్ నిర్ణయిస్తారు. అవి ఎలా అంటే... ► అంతర్జాతీయ ప్రయాణికులనుంచి నమూనాలను సేకరించి పరిశీలించడం మొదటి ప్రాధాన్యత ► కోవిడ్ మహమ్మారి కారణంగా అసాధారణ ఘటనలు జరిగిన ప్రాంతాల నుంచి సేకరిస్తారు ► వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా సరే.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి నమూనాలు సేకరిస్తారు ► కరోనా కారణంగా ఎక్కువగా మృతి చెందుతున్న ఏరియాల నుంచి నమూనాలు ► తరచూ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసుల నుంచి కూడా కొన్ని సేకరిస్తారు ► ప్రత్యేక పరిస్థితుల్లో నమోదయ్యే కేసుల నమూనాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. సెంటినల్ ఆస్పత్రుల ఏర్పాటు.. ప్రతి రాష్ట్రంలో నమూనాల సేకరణకు నిర్ధారిత ఆస్పత్రులను గుర్తించి ఇక్కడ నుంచి ల్యాబొరేటరీకి నమూనాలు పంపిస్తారు. సెంటినల్ ఆస్పత్రికి విధిగా నోడల్ అధికారిని నియమిస్తారు. జినోమిక్ సీక్వెన్స్ ల్యాబొరేటరీకి మరో 18 శాటిలైట్ ల్యాబ్స్ సహకారమందిస్తాయి. దేశవ్యాప్తంగా 10 చోట్ల హబ్‌లుంటాయి. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన అనంతరం వీటి వివరాలను ఇండియన్ సార్స్ కోవిడ్–2 కన్సార్టియం ఏర్పాటు చేసే పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. మన రాష్ట్రంలో జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ గుంటూరులో ఏర్పాటు చేయనున్నారు. అప్పటివరకూ శాంపిళ్లను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపిస్తారు. జినోమిక్ సర్వే వల్ల లాభాలు.. ► జినోమిక్ సీక్వెన్సింగ్ పరిశోధనల వల్ల ప్రైమరీ ట్రాకింగ్ (ప్రాథమికంగా వేరియంట్ ఉనికి)ను తెలుసుకోవచ్చు ► వేరియంట్ తీవ్రతను తెలుసుకోగలిగితే ఆయా ప్రాంతంలో ముందస్తు చర్యలు తీసుకోవచ్చు ► తీవ్రత తెలుసుకుంటే వ్యాప్తిని అరికట్టడంతో పాటు చికిత్సలకు అవకాశం ఉంటుంది ► వేరియంట్ల ఉధృతిని బట్టి చర్యలు తీసుకుంటే మరణాలను భారీగా అరికట్టే అవకాశం ఉంటుంది ► పరిశోధనల వల్ల అసాధారణ వ్యాప్తి, నష్టాలు అరికట్టవచ్చు. -
వేల ఏళ్ల క్రితమే కరోనా కజిన్ సిస్టర్!
కరోనా.. ఈ పేరు వింటేనే వణుకు పుడుతున్న సమయమిది. దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన ఈ మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. నిజానికి కరోనా వైరస్ ఇప్పటిదేనా అంటే.. కాదట.. సుమారు 25 వేల ఏళ్ల ముందే కరోనాను పోలిన వైరస్ మనుషులకు సోకిందట. ఇప్పుడు అప్పుడూ అని కాదు.. మనుషులు తొలినాళ్ల నుంచీ ప్రమాదకర వైరస్‌లను ఎదుర్కొంటూనే ఉన్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలా వైరస్‌లను ఎదుర్కొన్నప్పటి సామర్థ్యం జన్యువుల రూపంలో తర్వాతి తరాలకు అందిందని.. అందుకే కొత్త కొత్త వైరస్లు వచ్చినా తట్టుకోగలుగుతున్నారని అంటున్నారు. ఈ అంశంపై ప్రొఫెసర్ డేవిడ్ ఎనార్డ్ ఆధ్వర్యంలో అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి.. ఇటీవలే నివేదిక విడుదల చేశారు. మానవులు సమాజంగా ఏర్పడి జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన వైరస్ దాడికి గురవుతూనే ఉన్నారు. అలా వైరస్లు విజృంభించినప్పుడల్లా కొందరు వాటిని తట్టుకుని జీవించగలిగారు. అలాంటి వారిలో వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యానికి కారణమైన జన్యువులు తర్వాతి తరాలకు అందుతూ, మరింతగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ క్రమంలో వేల ఏళ్ల కిందటి ఆయా వైరస్ల జాడలు డీఎన్ఏలో ఉండిపోతాయి. వాటిని పరిశీలించడం ద్వారా అప్పటి పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు కరోనా వైరస్‌కు సంబంధించి.. ప్రపంచవ్యాప్తంగా 26 ప్రాంతాల నుంచి 2,504 మంది జన్యుక్రమంపై అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అప్పటి వైరస్‌తోనే తూర్పు ఆసియాలో.. మనుషుల్లో కొన్ని వేల రకాల ప్రొటీన్లు ఉంటాయి. మన శరీరంలోకి ప్రవేశించిన కరోనా ఇలాంటి కొన్ని ప్రొటీన్లను ఆధారం చేసుకునే.. కణాల్లో ప్రవేశించి, తన సంతతిని పెంచుకుంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌కు, శరీర కణాలకు మధ్య 420 రకాల ప్రొటీన్లు కీలకమని.. అందులో 332 ప్రొటీన్లు కరోనాకు అనుకూలంగా ఉండగా, మిగతావి వైరస్‌ను ఎదుర్కోవడంలో కణాలకు సాయం చేస్తాయని గుర్తించారు. ఇలా కరోనాను ఎదుర్కొనే ప్రొటీన్లు, వాటి ఉత్పత్తి కారణమయ్యే జన్యువులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ప్రొటీన్లు ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఉండగా.. తూర్పు ఆసియా దేశాలకు చెందినవారిలో మరింత సమర్థవంతంగా ఉన్నట్టు తేల్చారు. ఈ ప్రొటీన్లు ఇలా సమర్థవంతంగా మారడానికి కొన్ని జన్యుమార్పులు కారణమని.. సుమారు 25 వేల ఏళ్ల కిందటే ఈ మార్పులు మొదలయ్యాయని గుర్తించారు. అంటే అప్పటి నుంచే కరోనాను పోలిన వైరస్లు తూర్పు ఆసియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయని, అందుకే అక్కడి వారిలో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడి ఉంటుందని అంటున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు..! ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా.. వైరస్ల వల్లనే వైరస్‌లను ఎదుర్కొని నిలిచే శక్తి మనుషులకు వచ్చిందని డేవిడ్ ఎనార్డ్ చెప్పారు. ‘‘వేల ఏళ్లనాడు వైరస్‌లను తట్టుకుని జీవించగలిగిన వారు.. తర్వాతి తరాలకు మూలంగా నిలిచారు. వారిలోని సమర్థవంతమైన జన్యువులు తర్వాతి తరాలకు సంక్రమించాయి. ఇలా క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా మనుషుల్లో పరిణామం రావడానికి అప్పటి వైరస్‌లే ప్రధాన కారణం’’అని వివరించారు. ఇప్పుడు తాము చేసిన పరిశోధన కరోనా వంటి మహమ్మారులు విజృంభిస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానికి మార్గనిర్దేశం చేయగలదని తెలిపారు. తూర్పు ఆసియా అంటే..? ఆసియా ఖండంలోని చైనా, జపాన్, మంగోలియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలను తూర్పు ఆసియా దేశాలుగా పేర్కొంటారు. ఇక వాటికి సమీపంగా ఉన్న దేశాలను చూస్తే నేపాల్, భూటాన్, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు ఉంటాయి. అరిజోనా వర్సిటీ నివేదిక ప్రకారం.. తూర్పు ఆసియా దేశాల వారికి కరోనా సోకినా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల పలు దేశాల్లోనూ వైరస్‌ను ఎదుర్కొనే శక్తి కొంత వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
50 ఏళ్ల తర్వాత మీ ఆరోగ్యమేంటి?
భవిష్యత్తు ఆరోగ్య సమస్యలను చెప్పే మ్యాప్ మై జీనోమ్ ♦ 10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి ♦ దేశంలోని 45 ఆసుపత్రులతో ఒప్పందం ♦ అమెరికా, సింగపూర్ల నుంచి కూడా కస్టమర్ల రాక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘చికిత్స కంటే నిరోధం మేలు’...! మామూలుగా చెప్పాలంటే... వ్యాధి వచ్చాక తగ్గించుకోవటం కంటే రాకుండా చూసుకోవచ్చుగా! అని అర్థం. మరి ఇదే నానుడిని వ్యాపార మంత్రంగా జపిస్తే...! అప్పుడది ‘మ్యాప్ మై జీనోమ్’ అవుతుంది. జబ్బు చేశాక మందులేసుకోవటం కంటే అసలు మనని ఎలాంటి రోగాలు.. ఏ వయసులో చుట్టుముడతాయో తెలిస్తే ఎంత బాగుంటుందో కదూ!? వ్యక్తిగత జన్యువుల ఆధారంగా భవిష్యత్తులో రాగల రోగాలను ఇప్పుడు చెప్పేయడమే మ్యాప్ మై జీనోమ్ ప్రత్యేకత అంటోంది సంస్థ సీఈఓ అనూరాధ ఆచార్య. మన దేశ సైంటిఫిక్ రీసెర్చ్ విభాగం (సీఎస్ఐఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ సెన్సైస్ గవర్నింగ్ బాడీలో సభ్యురాలు అనూరాధ. 2011లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డును కూడా అందుకున్నారామె. మ్యాప్ మై జీనోమ్ సంస్థ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే.. మాది రాజస్థాన్. 1995లో ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి పట్టా తీసుకున్నా. తరవాత అమెరికాలో ఎంఎస్, ఎంఐఎస్ పూర్తి చేశా. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా చదివిన చదువుకు సంబంధం లేకుండా ఓ టెలికాం కంపెనీలో కొంతకాలం ఉద్యోగం కూడా చేశా. కానీ, జీవితంలో ఏదో కోల్పోతున్నాననే బెంగ వెంటాడేది. మనకంటూ ఒక సొంత కంపెనీ ఉండాలని... అది కూడా మన చదువుకి సంబంధించినదైతే బాగుంటుందని భావించి ‘ఆసిమమ్ బయో సొల్యూషన్స్’ సంస్థను ప్రారంభించాను. ఫార్మా సంస్థలకు జీనోమిక్ రీసెర్చ్ చేయడం దీనిపని. అది కూడా సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండటంతో మనసులో ఏదో వెలితి. ఇలా ఫార్మా కంపెనీలకు కాకుండా.. నేరుగా ప్రజలకు ప్రయోజనం కలిగే కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. పదమూడేళ్ల పాటు జీనోమిక్ శాంపిళ్లపై చేసిన పరిశోధన... సరికొత్త ఆలోచనలకు బీజం వేసింది. జన్యు పరీక్షల ద్వారా భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యల్ని ముందే చెప్పేస్తే ఎలా ఉంటుందని అనుకున్నా!! కానీ, అదంతా సులువుగా ఏమీ జరగలేదు. 2011లో నా ప్రతిపాదనకు అప్పటికే మా కంపెనీలో పెట్టుబడిదారులైన కుబేరా పార్టనర్స్, ప్రపంచ బ్యాంక్ ఒప్పుకోలేదు. మీ కొత్త ఆలోచనతో అసలు లక్ష్యం పక్కదారి పడుతుందన్నారు. రాబోయే వ్యాధులను ముందే తెలుసుకుని భయపడటం ఎందుకని కొందరు, ఆసుపత్రులుండగా వీరేం చేయగలరని మరికొందరు విమర్శించారు. దీంతో రెండేళ్ల పాటు ఇంక్యుబేటెడ్‌గా మ్యాప్ మై జీనోమ్‌ని నిర్వహించా. 2013లో ఆసిమమ్ సంస్థ నుంచి బయటికొచ్చి మ్యాప్ మై జీనోమ్ సంస్థను ప్రారంభించా. 50 ఏళ్ల తర్వాత వచ్చే రోగాలేంటో.. మ్యాప్ మై జీనోమ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... వ్యక్తిగత జన్యువుల ఆధారంగా అప్పటి ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పడమే. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో వచ్చే జబ్బులేంటో ముందుగానే వివరించడం. ఇంకా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పసిగుడ్డుకు 50 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలేంటో వివరించడమన్నమాట. దీంతో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో... ఆహా రపు అలవాట్లు, జీవన శైలిలో ఎలాం టి మార్పులవసరమో తెలిసిపోతుంది. చికిత్స కంటే నిరోధమే మేలనేది మ్యాప్ మై జీనోమ్ సిద్దాంతం. వ్యాధులకు చికిత్స చేయడం మ్యాప్ మై జీనోమ్ పనికాదు. కేవలం తదుపరి చికిత్సకు సిఫారసు చేయడమే దీని పని. పరిశోధనలే ఆధారం... మాలిక్యులర్ డయాగ్నస్టిక్ వ్యవస్థ ద్వారా ప్రోగ్నొస్టిక్, డయాగ్నొస్టిక్ పద్ధతుల ఆధారంగా మ్యాప్ మై జీనోమ్ పరిశోధనలు చేస్తుంది. ఇందుకోసం మా దగ్గర ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్‌డీలు చేసిన వైద్యులు అందుబాటులో ఉంటారు. వారు రోగి ఆరోగ్య నివేదికను, కుటుంబ చరిత్రనూ వివరంగా తీసుకొని పరిశోధనలు చేస్తారు. ఇమ్యూన్, ఆటో ఇమ్యూన్ సమస్యలతో పాటు... రోగి కుటుంబ సభ్యులకూ పరీక్షలు చేసి వారసత్వంగా వచ్చే వ్యాధుల గురించి, వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతూ మందులు వాడుతుంటే అవి ఏ మేరకు పనిచేస్తున్నాయో విశ్లేషిస్తాం. తన జన్యు చరిత్ర ప్రకారం ఇంకెన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందో కూడా వివరిస్తాం. కొన్నిసార్లు సమస్య ఒకటైతే తీసుకునే మందు ఇంకోటి ఉంటుంది. మరికొన్ని సార్లు వారు తీసుకున్న మందుని శరీరం పూర్తి స్థాయిలో స్వీకరించదు కూడా. వీటన్నింటినీ మ్యాప్ మై జీనోమ్ వివరిస్తుంది. 10 మిలియన్ డాలర్ల సమీకరణ.. ఇటీవలే మ్యాప్ మై జీనోమ్‌లో పలువురు ప్రైవేటు పెట్టుబడిదారులు 1.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. రెండో విడతగా మరో 10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టిసారిచాం. దీనికోసం ప్రపంచ బ్యాంకుతో సంప్రతింపులు జరుపుతున్నాం. ఎందుకంటే గతంలో నా మరో కంపెనీ ఆసిమమ్ బయో సొల్యూషన్స్‌లో ప్రపంచ బ్యాంక్, కుబేరా పార్ట్నర్స్ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు కూడా. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.6 కోట్ల ఆదాయాన్ని చేరుకుంటాం. దేశంలోని 45 ఆసుపత్రులతో... ప్రస్తుతం మ్యాప్ మై జీనోమ్‌లో బ్రె యిన్ మ్యాప్, వెబ్ న్యూరో, లంగ్ క్యాన్సర్, నికోటిన్ డిపెండెన్సీ టెస్ట్, కార్డియో మ్యాప్, ఆంకోమ్యాప్, బ్రెయిన్ మ్యాప్, మైఫిట్ జినీ, స్మార్ట్‌స్పోర్ట్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తాం. రోగి ఆరోగ్య నివేదిక, డీఎన్ఏ నమూనాల సేకరణకు మా సిబ్బందే ఇంటికొస్తారు. సంబంధిత పరీక్షల కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 45 ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. కేర్, మణిపాల్, కిమ్స్ వంటి ఆసుపత్రులూ ఇందులో ఉన్నాయి. పరీక్షల ద్వారా ఒక్కో వ్యక్తి నుంచి సుమారు 38,000 జన్యువుల్ని లెక్కిస్తాం. సింగపూర్, మలేషియా, అమెరికా వంటి దేశాల నుంచి కూడా మా ల్యాబ్‌కి రిపోర్ట్‌లొస్తుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కార్యాలయాలున్నాయి. త్వరలోనే ముంబై, గోవాల్లోనూ ప్రారంభిస్తాం.