Georgia Institute of Technology
-
నావల్ మాస్క్ తయా రు చేసిన శాస్త్రవేత్తలు.
వాషింగ్టన్: ప్రస్తుతం ఉన్న మాస్కు లు తరచుగా జారిపోవడం లేదా, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కళ్లజోడు ఉన్న వారికి తడిగాలి అద్దాల మీదకు రావడం వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కు ప్రొటోటైప్‌ను డిజైన్ చేశారు. రోజంతా ధరించేలా, సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని తయారు చేసినట్లు టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్కు చెందిన జర్నల్ ప్రచురిం చింది. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు దీన్ని తయారు చేశారు. మాస్కు కు ఉన్న పాకెట్ ద్వారా అదనపు లేయర్ ధరించి అదనపు భద్రత పొందే అవకాశం కూడా అందులో ఉందన్నారు. దాదాపు 20 సార్లు ఉతికినప్పటికీ, అది సాగడం గానీ, నాణ్యత తగ్గడంగానీ లేదని చెప్పారు. గ్రామీణ భారతానికి ముప్పు దేశంలో కేసుల సంఖ్య 40 లక్షలు దాటుతున్న తరుణంలో కరోనా సమూహ వ్యాప్తిగా మారుతుండడంతో గ్రామీణ భారతంపై భయాందోళనలు నెలకొన్నాయి. ఆస్పత్రి సదుపాయాలు అంతగా లేని గ్రామాల్లో కరోనా ప్రబలితే పరిస్థితులు మరింతగా దిగజారతాయని నిపుణులు చెబుతున్నారు. హౌ ఇండియా లివ్స్ వెబ్ సైట్ పరిశోధన ప్రకారం 714 జిల్లాల్లో కరోనా సోకింది. దీనివల్ల దాదాపు 94.76% మంది ప్రమాదంలో పడ్డారని చెప్పింది. -
ప్లూటోకు ‘చందమామ’ రక్ష!
వాషింగ్టన్: మరుగుజ్జు గ్రహమైన ప్లూటోపై ఉన్న వాతావరణం తరిగిపోకుండా దాని ఉపగ్రహం(చందమామ) కారన్ కాపాడుతోందని తాజా పరిశోధనలో తేలింది. ప్లూటో చుట్టూ కవచాన్ని ఏర్పరచి సౌర పవనాలను దానికి దూరంగా దారి మళ్లిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని జార్జియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్లూటో, కారన్‌కు మధ్య ఉన్న సంబంధం.. అలాగే సౌర పవనాల నుంచి కారన్ ఎలా కాపాడుతోందన్న దానిపై లోతైన అధ్యయనం చేశారు. ప్లూటో వ్యాసార్థం కన్నా ఎక్కువ పరిమాణంలో ఉండే కారన్ కేవలం 19,312 కిలోమీటర్ల దూరం నుంచే పరిభ్రమిస్తుంది. సూర్యుడికి, ప్లూటోకు మధ్య వచ్చినపుడు కారన్ అక్కడి వాతావరణాన్ని కాపాడుతుందని పరిశోధన చెబుతోంది. కారన్‌కు సొంత వాతావరణమంటూ ఏదీ లేదని, అయితే అది ఏర్పడ్డపుడు ప్లూటో చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరచి, సౌరపవనాల నుంచి ప్లూటోను కాపాడుతుందని జార్జియా టెక్ అసోసియేట్ ప్రొఫెసర్ కారోల్ పాటీ వివరించారు. న్యూ హరిజాన్స్ అంతరిక్ష నౌక సేకరించి, భూమిపైకి పంపిన విషయాల ఆధారంగా పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. -
మనుషుల్లాగే నడిచే రోబో
వాషింగ్టన్: మనుషుల్లానే కాళ్లకు షూ వేసుకుని నడిచే రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అది మనలా నడవటమే కాకుండా నడకలో మనుషుల్ని అనుకరిస్తుంది కూడా. ఈ రోబోలు మానవుల మడమ, బొటనవేలిని తల పించే నిర్మాణాల సాయంతో నడుస్తాయి. దీని సాయంతో అవి మనుషుల నడకను అనుకరించగలవు. ఈ హ్యూమనాయిడ్ రోబోకి వారు డ్యూరస్ అని పేరు పెట్టారు. డ్యూరస్కి ముందున్న రోబో కాళ్ల నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి దీన్ని తయారు చేశారు. నడిచే దారిని బట్టి నడకను మెరుగుపరుచుకునేలా ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాం దారి సవ్యంగా లేనప్పుడు అది కింద పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. -
కాళ్లున్న హెలికాప్టర్...
హెలికాప్టర్‌కు కాళ్లేంటి? ఇదిగో ఫొటోలో కనిపించడంలే.. ఇవి రోబో కాళ్లు! విమానాలతో పోలిస్తే.. హెలికాప్టర్లు మారుమూల ప్రాంతాలకు చొచ్చుకుపోతాయి.. భారీ రన్వేలాంటివి అవసరం ఉండదు. ముఖ్యంగా సహాయక చర్యల్లో ఇవి ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే.. సమతలంగా లేని ప్రాంతాలు, ఎగుడుదిగుడుగా ఉండే పర్వతాలు వంటి వాటిల్లో దిగాలంటే వీటికీ కష్టమే. ఈ ఇబ్బందులను తొలగించేలా అమెరికాకు చెందిన డార్పా(డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ), జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు రోబోటిక్ ల్యాండింగ్ గేర్‌కు రూపకల్పన చేశారు. ఈ రోబో కాళ్ల సాయంతో హెలికాప్టర్లు పర్వత ప్రాంతాలతోపాటు వేగంగా కదిలే భారీ పడవలపైనా దిగగలవని వారు చెబుతున్నారు. సహాయక చర్యలతోపాటు సైనిక కార్యకలాపాలకు ఇవి ఎంతో సహాయకారిగా ఉంటాయని అంటున్నారు. దీని తాలూకు ప్రాథమిక నమూనాను ఇటీవల అట్లాంటాలో విజయవంతంగా పరీక్షించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమట. -
చందా... మా వర్సిటీకి రావా!!
కోల్‌కతా: అమెరికాలోని హార్వర్డ్.. స్టాన్‌ఫర్డ్.. కొలంబియా.. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో చదివేందుకు అవకాశం రావడమే గొప్ప. అలాంటిది కోల్‌కతాకు చెందిన ఓ కుర్రాడికి వీటితోసహా ఏకంగా 7 ప్రఖ్యాత యూనివర్సిటీలు ఆహ్వానం పలికాయి! అమెరికన్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రామాణిక పరీక్ష ‘శాట్’లో 2400/2400 మార్కులతో మెరిసిన కోల్‌కతా వైద్యదంపతుల కుమారుడైన అరుణవా చందా(19) ఈ ఘనత సాధించాడు. కోల్‌కతాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రూబీ పార్క్‌లో ఈ ఏడాదే పన్నెండో తరగతి పరీక్షలు రాసిన చందా అమెరికాలోని 8 ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వాటిలో మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రం ప్రాజెక్టు రిపోర్టు సమర్పించలేదన్న కారణంతో ఇతడి దరఖాస్తును తిరస్కరించగా.. మిగతావన్నీ ఆహ్వానం పలికాయి. వీటిలో కొలంబియా, డ్యూక్ కార్నెల్ యూనివర్సిటీలు స్కాలర్షిప్ను, మిగతా వర్సిటీలు ఆర్థిక సహాయం కూడా ఆఫర్ చేశాయి. కొలంబియా వర్సిటీ ఇవ్వజూపిన సీ ప్రిస్కాట్ డేవిస్ స్కాలర్షిప్ ఇంతవరకూ భారతీయులెవరికీ రాలేదట. ఈ స్కాలర్షిప్ పొందినవారికి నోబెల్ విజేతల ఆధ్వర్యంలో ప్రాజెక్టులు చేపట్టే అవకాశం లభిస్తుంది. అయితే హార్వార్డ్, స్టాన్‌ఫర్డ్, కొలంబియా మూడు వర్సిటీల్లోనూ చదవాలని తనకు ఉందని, కానీ ప్రస్తుతం దేన్ని ఎంచుకోవాలో తెలియట్లేదని చందా వెల్లడించాడు.