చందా... మా వర్సిటీకి రావా!!
కోల్‌కతా: అమెరికాలోని హార్వర్డ్.. స్టాన్‌ఫర్డ్.. కొలంబియా.. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో చదివేందుకు అవకాశం రావడమే గొప్ప. అలాంటిది కోల్‌కతాకు చెందిన ఓ కుర్రాడికి వీటితోసహా ఏకంగా 7 ప్రఖ్యాత యూనివర్సిటీలు ఆహ్వానం పలికాయి! అమెరికన్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రామాణిక పరీక్ష ‘శాట్’లో 2400/2400 మార్కులతో మెరిసిన కోల్‌కతా వైద్యదంపతుల కుమారుడైన అరుణవా చందా(19) ఈ ఘనత సాధించాడు. కోల్‌కతాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రూబీ పార్క్‌లో ఈ ఏడాదే పన్నెండో తరగతి పరీక్షలు రాసిన చందా అమెరికాలోని 8 ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వాటిలో మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రం ప్రాజెక్టు రిపోర్టు సమర్పించలేదన్న కారణంతో ఇతడి దరఖాస్తును తిరస్కరించగా.. మిగతావన్నీ ఆహ్వానం పలికాయి.
వీటిలో కొలంబియా, డ్యూక్ కార్నెల్ యూనివర్సిటీలు స్కాలర్‌షిప్‌ను, మిగతా వర్సిటీలు ఆర్థిక సహాయం కూడా ఆఫర్ చేశాయి. కొలంబియా వర్సిటీ ఇవ్వజూపిన సీ ప్రిస్కాట్ డేవిస్ స్కాలర్‌షిప్ ఇంతవరకూ భారతీయులెవరికీ రాలేదట. ఈ స్కాలర్‌షిప్ పొందినవారికి నోబెల్ విజేతల ఆధ్వర్యంలో ప్రాజెక్టులు చేపట్టే అవకాశం లభిస్తుంది. అయితే హార్వార్డ్, స్టాన్‌ఫర్డ్, కొలంబియా మూడు వర్సిటీల్లోనూ చదవాలని తనకు ఉందని, కానీ ప్రస్తుతం దేన్ని ఎంచుకోవాలో తెలియట్లేదని చందా వెల్లడించాడు.