German aircraft
-
ఓరోజు నా పేరు మార్మోగిపోతుంది!
డ్యూసెల్డార్ఫ్: ‘ఏదో ఒక రోజు నా పేరు మార్మోగుతుంది. ఈ వ్యవస్థనంతా మార్చిపారేసే పని చేస్తా’- జర్మనీ విమానాన్ని ఫ్రాన్స్‌లో కూల్చి 150 మంది ప్రాణాలు బలిగొన్న కోపైలట్ లుబిట్జ్ అన్న మాటలివి! కొద్ది నెలల కిందట తనతో లుబిట్జ్ ఈ మాటలు చెప్పాడని అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరియా వెల్లడించారు. జర్మన్ పత్రిక బిల్డ్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు. ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం చేసే ఈమె.. లుబిట్జ్తో కలిసి కిందటేడాది ఐదు నెలలపాటు పనిచేశారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. లుబిట్జ్ నిద్రలో నుంచి ఉన్నట్టుండి లేచి ‘మనం పడిపోతున్నాం’ అని అరిచేవాడని, అతడికి పీడకలలు వచ్చేవని ఆమె తెలిపారు. -
ట్రైనింగ్‌లో లూబిడ్జ్ ఎక్కడికెళ్లాడు?
పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానం 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని తేలిపోవడంతో అతని ఉద్దేశం వెనుక కారణాలేమిటనే అంశంపైనే ప్రస్తుతం దర్యాప్తు కేంద్రీకృతమైంది. లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరఫున అమెరికాలోని ఆరిజోనాలో పెలైట్ శిక్షణ పొందిన కోపైలట్ తన శిక్షణ కాలంలో కొన్ని నెలలపాటు శిక్షణకు గైర్హాజరయ్యాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకు లూబిడ్జ్ గైర్హాజరయ్యాడన్న అంశం తేలితే విమానం ప్రమాదం మిస్టరీ వీడిపోయే అవకాశం ఉందని లుఫ్తాన్సా విమానయాన సంస్థ ఉన్నతాధికారి కార్స్టెన్ స్పార్ తెలిపారు. పైలట్ శిక్షణ సందర్భంగా సాధారణంగా ఎవరికి లాంగ్ లీవ్ ఇవ్వరని, సిక్ లీవ్ మాత్రం ఇస్తారని ఆయన చెప్పారు. లూబిడ్జ్ సిక్ లీవ్‌పై వెళ్లాడా, లేదా, వెళితే అతని అనారోగ్యానికి కారణాలేమిటో కూపీ లాగాల్సి ఉందని ఆయన అన్నారు. పైలట్ శిక్షణ కేంద్రం నిబంధనలు, జర్మన్ చట్టాల ప్రకారం శిక్షణ పొందుతున్న పైలట్ల సెలవులకు కారణాలు బయటకు వెల్లడించరని, కోర్టు కోరితే తెలపవచ్చని ఆయన తెలిపారు. 2001, సెప్టెంబర్11వ తేదీన అమెరికాలోని పెంటగాన్‌పై హైజాక్ చేసిన విమానంతో దాడి జరిపిన టైస్టు కూడా ఆరిజోనాలోనే పైలట్ శిక్షణ పొందిన విషయం ఇక్కడ గమనార్హం. ఎయిర్‌బస్ విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఆల్ఫ్స్ పర్వతాలపైకి మళ్లించడం, హఠాత్తుగా విమానాన్ని తలకిందులుగా అతివేగంతో కిందకు తీసుకెళ్లి రాళ్లకు ఢీ కొట్టించడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు బ్లాక్‌బాక్స్ సందేశాల ద్వారా కనుక్కొన్న విషయం తెల్సిందే. కోపైలట్ ఇలా చేయడానికి రెండే రెండు కారణాలు ఉంటాయని, ఒకటి మానసిక ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, రెండు టైస్టుల ఆదేశాల మేరకు నడుచుకోవడమని కార్స్టెన్ చెప్పారు. ఈ రెండు అంశాల్లో కూడా లూబిడ్జ్ను అనుమానించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అయితే అతని పైలట్ శిక్షణా కాలంలో ఎందుకు అన్ని నెలలు సెలవు పెట్టారు, ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉందని చెప్పారు. -
కో-పైలటే కూల్చేశాడు!
బాత్రూమ్కు వెళ్లిన కెప్టెన్.. కాక్‌పిట్‌ను లాక్ చేసుకున్న కోపైలట్ కెప్టెన్ తలుపు కొడుతూ ఎంతగా అడిగినా కోపైలట్ స్పందించలేదు విమానం కూలిపోయేలా కోపైలటే ఆపరేట్ చేసినట్లు తెలుస్తోంది ఎందుకు కూల్చివేశాడో తెలియదు.. ఉగ్రవాదంతో సంబంధం లేదు విమానం కూలిపోయే ముందు ప్రయాణికులు హాహాకారాలు చేశారు బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించి నిర్ధారించామన్న ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో మంగళవారం కుప్పకూలిన జర్మన్ విమానాన్ని కో-పైలట్ ఉద్దేశపూర్వకంగా కూల్చేశాడని.. ఫ్రాన్స్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. విమానం పైలట్ కాక్‌పిట్ నుంచి బయటకు(బహుశా బాత్రూమ్కు) వెళ్లాక.. కోపైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ కాక్‌పిట్ తలుపు మూసేశాడని, పైలట్ ఎంతగా అడిగినా తలుపు తెరవలేదని, లోపలకు రానీయలేదని.. ఆ తర్వాత విమానం పర్వతాలపై కూలిపోయేలా నడిపించాడని వివరించారు. విమాన శకలాల నుంచి లభ్యమైన ‘బ్లాక్ బాక్స్’ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డయిన సంభాషణలు, శబ్దాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు ప్రాసిక్యూటర్ బ్రైస్ రాబిన్ తెలిపారు. జర్మనీ దేశపు జర్మన్వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఎ320 విమానం.. గత మంగళవారం ఉదయం 10 గంటలకు స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి బయల్దేరి జర్మనీలోని డ్యుసెల్డార్ఫ్ నగరానికి పయనమవటం.. 40 నిమిషాల్లోనే ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో కూలిపోవటం తెలిసిందే. విమానంలోని ఆరుగురు సిబ్బందితో పాటు.. 144 మంది ప్రయాణికులు మొత్తం ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన విషయమూ విదితమే. ఈ విమాన శకలాల నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించిన నిపుణులు.. విమానాన్ని కో-పైలట్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడని బలంగా అనుమానిస్తున్నారు. ప్రాసిక్యూటర్ గురువారం మీడియాకు వివరించిన కథనం ప్రకారం... విమానం బయల్దేరిన తర్వాత కాక్‌పిట్‌లో కెప్టెన్, కో-పైలట్ల మధ్య సంభాషణలు మామూలుగానే సాగాయి. ఎటువంటి ఆందోళనకరమైన అంశాలూ లేవు. చివరిగా.. విమానం నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత ఆ ఎత్తులో ప్రయాణం సాగిం చేందుకు లాంఛనంగా గ్రౌండ్ కంట్రోల్ అనుమతి కోరటం నమోదయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలు ఎటువంటి సంభాషణలూ లేవు. కాసేపటికి.. కాక్‌పిట్ నుంచి కెప్టెన్ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కాక్‌పిట్ వెలుపలి నుంచి తలుపుపై నెమ్మదిగా తడుతూ తెరవాలని కోరటం వినిపించింది. దీనికి కో-పైలట్ నుంచి ఎటువంటి స్పందనా, సమాధానం లేవు. తలుపు తెరవాల్సిందిగా కెప్టెన్ పదే పదే అడుగుతుండటం.. తలుపుపై చేతులతో కొడుతున్న శబ్దం వినిపించింది. కానీ.. కో-పైలట్ తలుపు తెరవలేదు. మరి కొద్ది నిమిషాల్లోనే తలుపును పగలగొట్టటానికి కెప్టెన్ ప్రయత్నిస్తున్నట్లు గట్టి శబ్దాలు వినిపించాయి. కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ మామూలుగా శ్వాస తీసుకుంటున్న శబ్దం మినహా మరే శబ్దాలూ వినిపించలేదు. ఇక విమానం మరికొన్ని క్షణాల్లో కూలిపోతుందనగా ప్రయాణికులు హాహాకారాలు చేయటం నమోదయింది. దీనినిబట్టి.. కాక్‌పిట్ నుంచి కెప్టెన్ బయటకు వెళ్లాక, తలుపు తెరుచుకోకుండా చేసి.. కో-పైలటే ఉద్దేశపూర్వకంగా.. విమానం నేరుగా నేలను తాకి కూలిపోయేలా నియంత్రణ వ్యవస్థను ఆపరేట్ చేశాడన్న నిర్ధారణకు వచ్చినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. భూమికి 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవటానికి ముందు చివరి పది నిమిషాల్లో ఏకంగా 36,000 అడుగులకు పైగా కిందకు దిగిపోయింది. చివరి క్షణాల వరకూ ప్రయాణికులకు ముంచుకొస్తున్న విపత్తు గురించి తెలియదని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డయిన శబ్దాలను బట్టి తెలుస్తోందని చెప్పారు. విమానం కూలిపోతున్నంతవరకూ కో-పైలట్ సృ్పహలోనే ఉన్నాడని తెలిపారు. కో-పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి కారణమేమిటనేది ఇంకా తెలియదన్నారు. అయితే.. ఇందులో ఉగ్రవాద పాత్రకు అవకాశం లేదని, అతడికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆధారాలు లేవని కొట్టివేశారు. ఘటనా స్థలానికి మృతుల బంధువులు... ఆల్ప్స్ పర్వతాల్లో గాలింపు, సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పర్వతాలు, లోయల్లో చెల్లాచెదురుగా పడిపోయిన విమాన ప్రయాణికుల మృతదేహాలు, శరీరభాగాలను హెలికాప్టర్ల ద్వారా సమీపంలోని సెయిన్ లె ఆల్ప్స్కు తరలిస్తున్నారు. శరీరభాగాలు గుర్తించలేనంతగా ఛిద్రమయ్యాయని ఆ ప్రాంతానికి వెళ్లిన పర్వత మార్గదర్శకుడు ఒకరు పేర్కొన్నారు. దీంతో.. మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం 18 దేశాలకు చెందిన పౌరులు మృతి చెందగా.. వారిలో అత్యధికంగా 72 మంది జర్మనీ వాసులు, 51 మంది స్పెయిన్ పౌరులు ఉన్నారు. స్పెయిన్, జర్మనీల నుంచి బాధిత ప్రయాణికుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘటనా ప్రాంతానికి వెళ్లేందుకు ఫ్రాన్స్ వస్తున్నారు. బార్సిలోనా, డుసెల్డార్ఫ్ల నుంచి రెండు విమానాల్లో వీరు గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించేందుకు ఘటనా ప్రాంతంలో టెంట్లను నెలకొల్పారు. ఎవరీ లూబిట్జ్? కోపైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ (28) జర్మనీ పౌరు డు. జర్మనీలోని మోంటాబార్ అతడి స్వస్థలం. అక్కడ తన తల్లిదండ్రులతో కలసి జీవిస్తున్నాడు. టీనేజీ వయసులోనే గ్లైడర్ పైలట్ లెసైన్స్ పొందాడు. గత ఏడాదే పైలట్ లెసైన్స్‌ను పునరుద్ధరించుకున్నాడు. జర్మనీలోనే లుఫ్తాన్సా శిక్షణ కేంద్రంలో పైలట్ శిక్షణ పూర్తిచేసుకున్న వెంటనే జర్మన్వింగ్స్ సంస్థలో 2013 సెప్టెంబర్‌లో ట్రైనీ పైలట్‌గా చేరాడు. అతడికి 630 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. ఇటీవలి కాలంలో అతడు ఎలాంటి మానసిక ఒత్తిడికీ లోనైనట్లు కనిపించలేదని.. అతడిని దగ్గరగా తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. జర్మన్వింగ్స్లో ఉద్యోగంలో చేరటం వల్ల సంతోషంగా కూడా ఉన్నాడని చెప్పారు. లూబిట్జ్ స్వతహాగా మితభాషి అయినా.. స్నేహశీలి అని వివరించారు. విమానం కెప్టెన్‌కు(పేరు వెల్లడించలేదు) 6,000 గంటల పాటు విమా నం నడిపిన అనుభవం ఉందని, 2014 మే నెల నుం చి జర్మన్వింగ్స్ సంస్థలో పనిచేస్తున్నాడని, అంతకుముందు జర్మన్వింగ్స్ మాతృసంస్థ లుఫ్తా న్సా, కాండోర్ విమానయాన సంస్థల్లో పనిచేశాడని.. లుఫ్తాన్సా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశంలో ఎయిర్‌బస్ ఏ320... ► ప్రతీ రెండు సెకన్లకు ప్రపంచంలో ఏదో ఒక చోట ఒక ఏ320 విమానం టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతోంది. ►1988 నుంచి ఇప్పటివరకు ఎయిర్‌బస్ విమానాల్లో 8.5 కోట్ల సర్వీసుల్లో 600 కోట్ల మంది ప్రయాణించారు. ► ఇప్పటివరకూ 60 సంఘటనలు, 11 ప్రమాదాల్లో 789 మంది మరణించారు. ►మంగళవారం కూలిన విమానం తొలిసారిగా 1990లో సర్వీసు ప్రారంభించింది. ► 1991లో లుఫ్తాన్సా దీన్ని కొని, 2014లో జర్మన్‌వింగ్స్‌కు అమ్మేసింది. ► చివరిసారిగా సోమవారం దీనిని ‘సాధారణ తనిఖీ’ చేశారు. ► ఇప్పటివరకు 46,700 ప్రయాణాల్లో 58,313 గంటలు గాల్లో ఎగిరింది. ► ఈ విమానం 60,000 గంటల సామర్థ్యం గలదని లుఫ్తాన్సా చెబుతోంది. ► విమానంలో సీఎఫ్ఎం 56-5ఏ1 రకం ఇంజిన్లను అమర్చారు. -
కుప్పకూలిన జర్మన్ విమానం
-
కూలిన జర్మనీ విమానం
స్పెయిన్ నుంచి జర్మనీ వెళుతున్న ఎయిర్‌బస్ ఎ320 మంచు పర్వతాల్లో ప్రమాదం.. అక్కడికి చేరుకోవటం చాలా కష్టం ఘటనాస్థలానికి హెలికాప్టర్ల ద్వారానే సహాయ బృందాల రవాణా {పమాదానికి కారణం తెలీదు.. ఎవరూ బతికే అవకాశం లేదు: ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో ప్రమాదం 150 మంది మృతి పారిస్: ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. జర్మనీకి చెందిన విమానం ఆల్ప్స్ పర్వత శ్రేణిలో కూలిపోయింది. విమానంలోని 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిసహా మొత్తం 150 మంది మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:30 - 11:00 గంటల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. దట్టమైన మంచుతో నిండిన ఆల్ప్స్ పర్వతాల్లో కూలడంతో ప్రమాదం జరిగి కొన్ని గంటలు గడిచినా ఆ స్థలానికి సహాయక బృందాలేవీ చేరుకోలేక పోయాయి. ప్రమాద స్థలానికి ఫ్రాన్స్ హెలికాప్టర్‌ను పంపించగా.. లె ట్రోయిస్ ఎవెచెస్ అనే పర్వత శ్రేణిలో విమాన శకలాలను గుర్తించింది. ఆ పర్వతాలు సముద్రమట్టానికి 1,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ ప్రదేశానికి చేరుకోవటం చాలా కష్టమని, ఫ్రాన్స్ అధ్యక్షుడు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలన్నిటికీ తమ సానుభూతి తెలియజేశారు. జర్మనీ చాన్సలర్ మెర్కెల్‌తో ఆయన ఫోన్లో మాట్లాడి.. ఆ దేశానికి సంఘీభావం తెలిపారు. ఫ్రాన్స్‌లో జర్మనీ విమానం కుప్పకూలటం అత్యంత దురదృష్టకర సంఘటన అని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీటర్లో విచారం వ్యక్తంచేశారు. ఆపద సంకేతాలేవీ పంపలేదు... ప్రమాదానికి గురైన విమానం ఎయిర్‌బస్ ఎ320 విమానం. 1990 నుంచి వినియోగంలో ఉంది. జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు అనుబంధ సంస్థ అయిన జర్మన్వింగ్స్ నిర్వహిస్తున్న విమానమిది. స్పెయిన్ దేశంలోని తీర నగరం బార్సెలోనా నుంచి బయల్దేరిన ఈ విమానం జర్మన్ దేశంలోని డ్యుసెల్డార్ఫ్ నగరానికి వెళ్లాల్సి ఉంది. మధ్యలో ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల మధ్య గల బార్సెలోనెటె స్కీ రిసార్ట్ సమీపంలో కూలింది. ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని.. ఉదయం 10:30 గంటలకు విమానం ప్రమాదంలో చిక్కుకుందని పౌర విమానయాన అధికారులు ప్రకటించారు. విమానం కూలిపోవటానికి ముందు అది ప్రయాణిస్తున్న ఎత్తు 8 నిమిషాల్లోనే 25 వేల అడుగులు పడిపో యిందని రాడార్ చెప్తోంది. హెలికాప్టర్లలో వెళ్లడమే ఏకైక మార్గం... ప్రమాద వార్త తెలిసిన వెంటనే సంక్షోభంపై మంత్రివర్గ బృందాన్ని ఫ్రాన్స్ ప్రధాని వాల్స్ సమావేశపరిచారు. భారీ సహాయ ప్రయత్నాలను ప్రారంభించామని.. కానీ విమానం కూలిన మారుమూల ప్రాంతాన్ని చేరుకోవటంలో పలు సవాళ్లు ఉంటాయని ఆయన తెలిపారు. మంచుతో నిండి ఉన్న ఆ ప్రాంతానికి భూమార్గంలో వాహనాలు చేరుకోవటం సాధ్యం కాదని.. అయితే హెలికాప్టర్లతో ఆకాశమార్గం ద్వారా చేరుకోవచ్చని అలాన్ పేర్కొన్నారు. అంతర్గత శాఖ మంత్రి బెర్నార్డ్ కాజెనూ తక్షణమే ప్రమాదస్థలానికి బయల్దేరారు. స్పెయిన్ పౌరులు పలువురు విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలియడంతో.. స్పెయిన్ రాజు ఆరవ ఫెలిపె తన ఫ్రాన్స్ పర్యటనను అర్థంతరంగా ముగించుకున్నారు. ఫ్రాన్స్‌లో ప్రధానమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యూనియన్ బుధవారం నుంచి శుక్రవారం వరకు తలపెట్టిన సమ్మెను.. జర్మన్ విమాన ప్రమాదం నేపథ్యంలో విరమించుకుంది. నాలుగు దశాబ్దాల్లో ఘోర ప్రమాదం... నాలుగు దశాబ్దాల కాలంలో ఫ్రాన్స్ ప్రధాన భూభాగంలో ఇదే అతి ఘోరమైన విమాన ప్రమాదం. ఫ్రాన్స్ ప్రధాన భూభాగంలో 1974లో టర్కీ విమానం కూలిపోయిన దుర్ఘటనలో 346 మంది చనిపోయారు. ఆ తర్వాత 1981లో ప్రధాన భూభాగంపై కాకుండా.. కోర్సికా దీవిలో మరో విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలోని మొత్తం 180 మంది చనిపోయారు. కాగా, జర్మన్వింగ్స్ విమానయాన సంస్థ చరిత్రలో ఇప్పటివరకూ ఘోరమైన ప్రమాదమేదీ నమోదు కాలేదు. ప్రమాదానికి సంబంధించి తక్షణ వివరాలేవీ తెలియలేదని లుఫ్తాన్సా ప్రధాన అధికారి కార్స్టెన్ సోర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ప్రమాదం జరిగిన విమానానికి సంబంధించిన బ్లాక్‌బాక్స్ దొరికిందని అధికారులు తెలిపారు. కారణాలు తెలియదు విమానం కూలినపుడు భారీ శబ్దం వినిపించిందని.. ఆ సమయంలో ఆ ప్రాంతంలో స్కీయింగ్ చేస్తున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్ టెలివిజన్ చానల్‌తో చెప్పారు. ‘‘విమానం కూలిపోవడానికి కారణాలేమిటనేది మాకు తెలియదు. కూలిన పరిస్థితులను బట్టి విమానంలోని 150 మందీ చనిపోయినట్లు అక్కడికి వెళ్లిన సిబ్బంది నిర్ధారించారు’’ అని ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయెల్ వాల్స్ మీడియాతో పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి, బాధిత కుటుంబాలకు సా యం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మరణించిన వారిలో 67 మంది జర్మన్లు, 45మంది స్పెయిన్ పౌరులు ఉన్నారు.